Team India: ఇదో హెచ్చరిక

సొంతగడ్డపై గత కొన్నేళ్లలో టీమ్‌ఇండియాది తిరుగులేని రికార్డు. అలాంటిది ఆస్ట్రేలియా చేతిలో సిరీస్‌ ఓటమి పెద్ద షాకే. మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా.. ప్రపంచకప్‌ నేపథ్యంలో రోహిత్‌ సేనకు ఇది మేలుకొలుపే.

Updated : 24 Mar 2023 10:24 IST

సొంతగడ్డపై గత కొన్నేళ్లలో టీమ్‌ఇండియాది తిరుగులేని రికార్డు. అలాంటిది ఆస్ట్రేలియా చేతిలో సిరీస్‌ ఓటమి పెద్ద షాకే. మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా.. ప్రపంచకప్‌ నేపథ్యంలో రోహిత్‌ సేనకు ఇది మేలుకొలుపే.

స్థిరమైన జట్టు ఉండట్లేదు. గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా ఆటగాళ్లూ స్థిరంగా ఉండట్లేదు. ఉన్న ఆటగాళ్లలో నిలకడలేమి. వన్డేల్లో టీమ్‌ఇండియాను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ భారత జట్టులో లోపాలను బయటపెట్టింది. ఐపీఎల్‌లో పడి ఈ సిరీస్‌ వైఫల్యాన్ని మరిచిపోతే టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ (అక్టోబరు-నవంబరు) సన్నాహాలకు అంతకన్నా దెబ్బ ఇంకోటి ఉండదు.

ఎన్నో అంచనాలున్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఆసీస్‌పై హ్యాట్రిక్‌ డక్‌లతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ.. వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ అందుబాటులో లేకపోతే నాలుగో స్థానానికి అందుబాటులో ఉన్న ఉత్తమ బ్యాటర్‌ సూర్యనే అనడంలో సందేహం లేదు. అతడి ఆటతీరు చూస్తుంటే అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోంది. టీ20 స్టార్‌గా వైఫల్యం అంటే ఏంటో తెలియని అతణ్ని.. ఇప్పుడు వైఫల్య భయం వెంటాడుతున్నట్లుంది. లోపాలను   సరిదిద్దుకోవడానికి ఇప్పటికీ అతడికి తగినంత సమయం ఉంది. ఐపీఎల్‌లో అతడు వాటిపై దృష్టిసారించాలి. నిజం చెప్పాలంటే.. వన్డేల్లో మంచి రికార్డున్నప్పటికీ షార్ట్‌ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ మంచి అవకాశాలిచ్చింది. ఇక సూర్యలోని టీ20 బ్యాటర్‌ను వెలికితీయాలన్న ఉద్దేశంతో చివరి 15 ఓవర్లలో క్రీజులో ఉంచడం కోసం బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దిగువన పంపితే అది సూర్యకు మంచి కన్నా కీడే ఎక్కువ చేసింది. వచ్చే వన్డే సిరీస్‌ జులైలో ఆరంభమవుతుంది. ఫిట్‌నెస్‌ సమస్యలు ఉంటే తప్ప జట్టు మేనేజ్‌మెంట్‌ సూర్యకు అండగా ఉండడం అవసరం. నాలుగో స్థానంలో నిలదొక్కుకోవడానికి అతడికి తగినన్ని అవకాశాలివ్వాలి. ఎందుకంటే వెన్ను గాయం నుంచి కోలుకుని ప్రపంచకప్‌కు సిద్ధంకావడానికి అవసరమైనంత సమయం శ్రేయస్‌కు ఉండకపోవచ్చు.

రాహుల్‌, సంజుల సంగతి..: ప్రతిభావంతుడైన సంజు శాంసన్‌కు సరైన అవకాశాలు రావట్లేదని, అతణ్ని మిడిల్‌ ఆర్డర్‌లో ఆడించాలన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఒకవేళ సంజును ఆడిస్తే అది వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా రాహుల్‌ స్థానంలో ఆడించాల్సివస్తుంది. 116 పరుగులతో ఆసీస్‌తో సిరీస్‌లో భారత టాప్‌ స్కోరర్‌ రాహుల్‌. ఆస్ట్రేలియాపై ముంబయిలో 75, అంతకుముందు శ్రీలంకపై కోల్‌కతాలో  పేస్‌ పిచ్‌పై టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలినప్పుడు అర్ధశతకం సాధించాడు. కానీ ఈ రెండు సందర్భాల్లో తక్కువ లక్ష్య ఛేదన ఉందని, వేగంగా ఆడాలన్న ఒత్తిడి లేదన్నది వాదన ఉంది. ప్రస్తుతానికి అనుభవం, నైపుణ్యం ఉన్న రాహుల్‌వైపే జట్టు మేనేజ్‌మెంట్‌ దృష్టి సారించొచ్చు. అయితే ఐపీఎల్‌లో శాంసన్‌ చెలరేగి ఆడితే.. జట్టులోకి అతడిని తీసుకురావాలన్న డిమాండ్‌ మరింత పెరిగే అవకాశముంది. పంత్‌ కూడా అందుబాటులో లేని నేపథ్యంలో శాంసన్‌ మంచి ప్రత్యామ్నాయమవుతాడు. రజత్‌ పటీదార్‌ కొన్ని వన్డే సిరీస్‌ల్లో భాగమైనా టీమ్‌మేనేజ్‌మెంట్‌ ఇంకా అతణ్ని పరీక్షించలేదు. ప్రస్తుతానికి అతడు రేసులో లేడన్నది స్పష్టం.

దిద్దుకోవాల్సిందే..: ప్రపంచకప్‌ అక్టోబరు 5న ఆరంభమవుతుంది. భారత జట్టు సన్నాహాలు అందుకు మూడు నెలల ముందు మొదలవుతాయి. అంటే జులైలో అన్నమాట. అప్పటికి జట్టు మేనేజ్‌మెంట్‌కు 13 మందితో కూడిన ప్రధాన బృందంలో ఎవరు ఉండాలన్నదానిపై ఓ స్పష్టత వస్తుంది. ఆసీస్‌ చేతిలో ఓటమి నిరాశపరిచేదే అయినా మార్చిలో సీజన్‌ ముగింపులో పిచ్‌లపై ఆడిన సిరీస్‌.. వానా కాలం ముగిశాక తాజా పిచ్‌లపై ఆడే టోర్నీలో జరగబోయే దానికి సరైన సూచిక అని అనుకోలేం. అయితే భారత్‌ లోపాలను సరిదిద్దుకోవాల్సివుంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో దూకుడు కొరవడింది. రోహిత్‌ శర్మను మినహాయిస్తే టాప్‌ ఆర్డర్‌లో ఎవరూ కూడా తొలి పవర్‌ప్లేలో అవసరమైనంత వేగంగా ఆడట్లేదు. ఎప్పుడో 90ల్లో ఆడినట్లు ఆడుతున్నారు. ఆరంభంలో నిలదొక్కుకోవడం, మిడిల్‌ ఓవర్లలో సాఫీగా సాగడం, ఆఖరి 10 ఓవర్లలో చెలరేగడం. ఇది ప్రణాళిక. అయితే ఆస్ట్రేలియాతో మొదటి రెండో వన్డేల్లో భారత్‌ బ్యాటింగ్‌ చేసిన తీరు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. స్టార్క్‌ బృందం బ్యాటర్ల టెక్నిక్‌ లోపాలను బహిర్గతం చేసింది. కానీ చెన్నైలో బ్యాటింగ్‌ చేసిన విధానం మాత్రం ఆందోళన కలిగించేదే. ఇద్దరు ఆస్ట్రేలియా స్పిన్నర్ల బౌలింగ్‌లో బ్యాటర్లు స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేకపోయారు. పైగా సొంతగడ్డపై అది అలవాటైన పిచ్‌. మిడిల్‌ ఓవర్లలో స్ట్రైక్‌రొటేషన్‌ అనేది కొంతకాలంగా భారత్‌కు సమస్యగా ఉంది. దీన్ని అధిగమించాల్సివుంది. లోపాలను సరిదిద్దుకోవడానికి తగినంత సమయం కూడా ఉంది. అందుకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటాడు? తాత్కాలిక పరిష్కారం కోసం చూస్తాడా లేదా దీర్ఘకాలిక పరిష్కారం వైపు మొగ్గుచూపుతాడా? అన్నది చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని