మీ పంచ్‌బంగారంగానూ

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అమ్మాయిలు కీలక సమరానికి సిద్ధమయ్యారు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో నిఖత్‌ జరీన్‌ (50 కేజీ), లవ్లీనా బోర్గోహెయిన్‌ (75 కేజీ), నీతు గాంగాస్‌ (48 కేజీ), స్వీటీ బూర (81 కేజీ) ఫైనల్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.

Published : 25 Mar 2023 02:03 IST

నేడు నీతు, స్వీటీ ఫైనల్స్‌
మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అమ్మాయిలు కీలక సమరానికి సిద్ధమయ్యారు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో నిఖత్‌ జరీన్‌ (50 కేజీ), లవ్లీనా బోర్గోహెయిన్‌ (75 కేజీ), నీతు గాంగాస్‌ (48 కేజీ), స్వీటీ బూర (81 కేజీ) ఫైనల్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. వీళ్లలో హరియాణా బాక్సర్లు నీతు, స్వీటీ శనివారం తమ తమ విభాగాల్లో టైటిల్‌ పోరులో తలపడనున్నారు. తొలిసారి పసిడి ముద్దాడాలనే లక్ష్యంతో సమరానికి సై అంటున్నారు. నిరుడు స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీ, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు కొల్లగొట్టిన నీతు.. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో దూకుడు మీదుంది. వరుసగా మూడు బౌట్లలోనూ ప్రత్యర్థిని నాకౌట్‌ చేసి సెమీస్‌ చేరిన ఆమె.. ఆ పోరులో బలమైన బాక్సర్‌ బల్కిబెకోవా (కజకిస్థాన్‌)పై 5-2తో గెలిచింది. ఏడాది కాలంగా ఆటలో ఎంతో మెరుగైన నీతు.. ప్రత్యర్థిని బట్టి తన వ్యూహాలు మార్చుకుంటూ విజయాల వేటలో సాగుతోంది. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌ కాంస్య విజేత లుత్సాయిఖాన్‌ (మంగోలియా)తో ఫైనల్లో నీతు తలపడుతుంది. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌గా నిలిచిన 22 ఏళ్ల నీతు.. ఇప్పుడు తొలిసారి సీనియర్‌ టైటిల్‌ దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు 2014 ఫైనల్లో ఓడి రజతంతో సంతృప్తి చెందిన 30 ఏళ్ల స్వీటీ.. ఈ సారి పసిడిని వదలకూడదనే పట్టుదలతో ఉంది.  సెమీస్‌లో ఎమ్మా (ఆస్ట్రేలియా) నుంచి కఠిన సవాలు ఎదుర్కొని 4-3తో గెలిచిన స్వీటీ ఫైనల్లో మరోసారి అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సిద్ధమైంది. 2018 ప్రపంచ ఛాంపియన్‌, 2019 కాంస్య విజేత వాంగ్‌ లీనా (చైనా) రూపంలో ఫైనల్లో ఆమెకు సవాలు ఎదురు కానుంది. సాయంత్రం 6 గంటలకు ఫైనల్‌ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. ఆదివారం ఫైనల్స్‌లో న్యూయెన్‌ (వియత్నాం)తో నిఖత్‌, కైత్లిన్‌ పార్కర్‌ (ఆస్ట్రేలియా)తో లవ్లీనా పోటీపడనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని