సీవర్‌ దంచేసింది..వాంగ్‌ ముంచేసింది

జట్టులో స్టార్‌ క్రికెటర్లు, అదరగొట్టే ఆల్‌రౌండర్లు, హడలెత్తించే బౌలర్లు.. ఇలా అన్ని విభాగాల్లోనూ పటిష్ఠం. తొలి అయిదు మ్యాచ్‌ల్లో విజయాలతో అన్ని జట్ల కంటే ముందే ప్లేఆఫ్స్‌లో చోటు.

Updated : 25 Mar 2023 02:37 IST

ఇస్సీకి హ్యాట్రిక్‌
చిత్తుగా ఓడిన యూపీ
ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌

జట్టులో స్టార్‌ క్రికెటర్లు, అదరగొట్టే ఆల్‌రౌండర్లు, హడలెత్తించే బౌలర్లు.. ఇలా అన్ని విభాగాల్లోనూ పటిష్ఠం. తొలి అయిదు మ్యాచ్‌ల్లో విజయాలతో అన్ని జట్ల కంటే ముందే ప్లేఆఫ్స్‌లో చోటు. కానీ వరుసగా రెండు ఓటములతో చిన్న కుదుపు. తిరిగి పుంజుకుని విజయంతో లీగ్‌ దశకు ముగింపు. ఫైనల్లో చోటు కోసం యూపీ వారియర్స్‌తో ఎలిమినేటర్లో తలపడాల్సిన పరిస్థితి. కానీ ఈ కీలక పోరులో ముంబయి ఇండియన్స్‌ జూలు విదిల్చింది. బలాన్ని ప్రదర్శించి అన్ని విభాగాల్లోనూ అదరగొట్టి.. సగర్వంగా డబ్ల్యూపీఎల్‌ తుదిపోరు చేరింది. బ్యాట్‌తో సీవర్‌.. బంతితో వాంగ్‌ చెలరేగిన వేళ తామెంత ప్రమాదకరమో మరోసారి చాటుతూ యూపీని చిత్తుగా ఓడించి దిల్లీతో ఆదివారం టైటిల్‌ సమరానికి ముంబయి సై అంటోంది.

హిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఆరంభ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ ఫైనల్‌ చేరింది. శుక్రవారం ఎలిమినేటర్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో యూపీ వారియర్స్‌ను 72 పరుగుల తేడాతో ఓడించింది. మొదట ముంబయి 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. నాట్‌ సీవర్‌ (72 నాటౌట్‌; 38 బంతుల్లో 9×4, 2×6) అజేయ అర్ధశతకంతో చెలరేగింది. యూపీ బౌలర్లలో సోఫి ఎకిల్‌స్టోన్‌ (2/39) మెరిసింది. ఏపీ పేసర్‌ అంజలి శర్వాణి (1/17) ఆకట్టుకుంది. ఛేదనలో యూపీ 17.4 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. కిరణ్‌ నవ్‌గిరె (43; 27 బంతుల్లో 4×4, 3×6) మాత్రమే రాణించింది. ఇసీ వాంగ్‌ (4/15) డబ్ల్యూపీఎల్‌లోనే తొలి హ్యాట్రిక్‌ సాధించింది. సైకా ఇషాక్‌ (2/24) రెండు వికెట్లు పడగొట్టింది.

బౌలింగ్‌ అదుర్స్‌..: 26/3.. ఛేదనలో 5 ఓవర్లకు యూపీ స్కోరిది. భారీ లక్ష్యాన్ని చూసి ముందే యూపీ బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో ఇషాక్‌ బౌలింగ్‌లో తొలి అయిదు బంతులను వృథా చేసిన శ్వేత (1) భారీ షాట్‌కు ప్రయత్నించి కవర్స్‌లో చిక్కింది. ఆ తర్వాతి ఓవర్లోనే పేలవ షాట్‌తో అలీసా (11) నిష్క్రమించింది. కొద్దిసేపటికే లేని పరుగుకు స్పందించిన తాలియా (7) రనౌటైంది. ఆ దశలో కిరణ్‌ బ్యాట్‌ ఝుళిపించింది. ఇషాక్‌ వేసిన ఆరో ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌ రాబట్టింది. దీంతో ఆ జట్టు 46/3తో పవర్‌ప్లేను ముగించింది. ఆ వెంటనే అమేలియా బౌలింగ్‌లో ఎక్కువ ఎత్తులో నుంచి వచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌ నుంచి కుడివైపు పరిగెత్తిన హేలీ జారవిడిచింది. కానీ సూపర్‌ ఫామ్‌లో ఉన్న హారిస్‌.. క్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం అన్నట్లు సీవర్‌ బౌలింగ్‌లో వాంగ్‌ చేతుల్లోకి బంతిని పంపించింది. దీంతో యూపీ కష్టాలు మరింత పెరిగాయి. మరోవైపు ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు రావడమూ గగనమైంది. సింగిల్స్‌ తీయడానికి కూడా దీప్తి శర్మ (16) కష్టపడింది. 10 ఓవర్లకు 63/4తో ఆ జట్టు ఓటమి ముందుగానే ఖాయమైంది! యూపీ ఇన్నింగ్స్‌లో ఆకట్టుకుంది ఏమైనా ఉంది అంటే అది కిరణ్‌ పవర్‌ హిట్టింగే. అమేలియా బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకు వచ్చి వరుసగా రెండు సిక్సర్లు బాదింది. కానీ మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన వాంగ్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో విజృంభించింది. 13వ ఓవర్‌ రెండో బంతికి ఫుల్‌టాస్‌తో కిరణ్‌ను బుట్టలో వేసుకున్న ఆమె.. మూడో బంతికి సిమ్రన్‌ (0)ను బౌల్డ్‌ చేసింది. తర్వాతి బంతిని ఎకిల్‌స్టోన్‌ (0) వికెట్ల మీదకు ఆడుకోవడంతో వాంగ్‌తో పాటు ముంబయి సంబరాల్లో మునిగిపోయింది. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన ముంబయి ప్రత్యర్థిని వేగంగా కుప్పకూల్చింది.

నాట్‌ నిలబడి..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే మొదలెట్టింది. ఓ ఎండ్‌లో హీలీ (26) కుదురుకునేందుకు సమయం తీసుకోగా.. మరో ఎండ్‌లో యాస్తిక (21) తొలి బంతి నుంచే బాదుడు మొదలెట్టింది. ఇన్నింగ్స్‌ తొలి బంతినే బౌండరీకి తరలించిన ఆమె.. దూకుడుగా ఆడింది. ఓ సిక్సర్‌తో హేలీ కూడా జోరందుకుంది. ఈ దశలో రెండు వైపులా మంచి స్వింగ్‌ రాబట్టి, కచ్చితమైన లైన్‌, లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసిన అంజలి.. యాస్తికను ఔట్‌ చేసి యూపీకి తొలి వికెట్‌ అందించింది. వెంటనే రాజేశ్వరి ఓవర్లో సీవర్‌ క్యాచ్‌ను మిడాఫ్‌లో ఎకిల్‌స్టోన్‌ పట్టలేకపోయింది. హేలీ, సీవర్‌ కలిసి ముంబయి ఇన్నింగ్స్‌ను నడిపించారు. కానీ బౌలింగ్‌కు వచ్చిన సంచలన టీనేజీ స్పిన్నర్‌ పార్శవి (1/25) తొలి బంతికే హేలీని పెవిలియన్‌ చేర్చి ఈ జంటను విడగొట్టింది. 11 ఓవర్లకు ముంబయి 82/2తో నిలిచింది. ఇక స్కోరు వేగం పెంచాల్సిందేననే లక్ష్యంతో సీవర్‌ గేరు మార్చింది. పార్శవి బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4 కొట్టింది. కానీ తర్వాతి ఓవర్లోనే ఓ మంచి బంతితో హర్మన్‌ప్రీత్‌ (14)ను ఎకిల్‌స్టోన్‌ బౌల్డ్‌ చేసింది. కానీ ఆ ఆనందాన్ని యూపీకి మిగల్చకుండా.. అక్కడి నుంచి సీవర్‌ మరింతగా చెలరేగింది. క్రీజులో సౌకర్యవంతంగా కదులుతూ.. అన్ని వైపులా షాట్లు ఆడింది. తన క్యాచ్‌ను వదిలేసినందుకు ప్రత్యర్థి చింతించేలా బౌండరీలతో విరుచుకుపడింది. 26 బంతుల్లోనే అర్ధశతకం అందుకుంది. స్పిన్నర్లు ఏ మాత్రం లయ తప్పినా.. బంతికి బౌండరీ మార్గాన్ని చూపించింది. ఆలస్యంగానైనా అమేలియా (29) కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో ముంబయి స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఎకిల్‌స్టోన్‌ వేసిన 19వ ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టిన అమేలియా.. తర్వాతి బంతికే అంజలి చేతికి చిక్కింది. దీప్తి వేసిన చివరి ఓవర్లో పూజ (11 నాటౌట్‌) వరుసగా 4, 6.. సీవర్‌ 6 కొట్టడంతో ముంబయికి ఘనమైన ముగింపు దక్కింది. ఆఖరి 5 ఓవర్లలో ముంబయి 66 పరుగులు పిండుకుంది.  


ఆ క్యాచ్‌ను పట్టలేక.. ఈ క్యాచ్‌ పట్టినా!

ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టిన ముంబయి బ్యాటర్‌ సీవర్‌.. 6 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గరే ఔటవాల్సింది. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో రాజేశ్వరి బౌలింగ్‌లో చివరి బంతికి ఆమె ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మిడాఫ్‌లో ఎకిల్‌స్టోన్‌ పట్టలేకపోయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆమె ఫోర్లు, సిక్సర్లతో చెలరేగింది. మరోవైపు ఇన్నింగ్స్‌ 9వ ఓవర్లో దీప్తిశర్మ బౌలింగ్‌లో హేలీ క్యాచ్‌ను బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌లో ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చి తక్కువ ఎత్తులో అంజలి అద్భుతంగా అందుకుంది. చాలాసేపు పరిశీలించిన టీవీ అంపైర్‌ బంతి అందుకున్న తర్వాత నేలకు తాకిందని నాటౌట్‌గా ప్రకటించడం చర్చనీయాంశమైంది. బంతి కింద అంజలి వేళ్లు ఉన్నాయని, అది నేలకు తాకలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


భార్య కోసం స్టార్క్‌

ముంబయి, యూపీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ సందడి చేశాడు. యూపీ జెర్సీ ధరించి.. ఆ జట్టుకు మద్దతు తెలిపాడు. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ వీక్షించాడు. యూపీ జట్టు కెప్టెన్‌ అలీసా హీలీ.. స్టార్క్‌ భార్య అని తెలిసిందే. ఆమె కోసం మైదానానికి అతనొచ్చాడు. పైగా శుక్రవారం అలీసా పుట్టిన రోజు కూడా. మ్యాచ్‌కు ముందు ఆమె జన్మదిన వేడుకలను స్టార్క్‌ జరిపించాడు. ఇటీవల టీమ్‌ఇండియాతో మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా దక్కించుకోవడంలో స్టార్క్‌ కీలక పాత్ర పోషించాడు. భార్య కోసం భారత్‌లోనే ఉండిపోయిన అతను.. డబ్ల్యూపీఎల్‌ ముగిసిన తర్వాత అలీసాతో కలిసి స్వదేశం వెళ్లనున్నాడు. 2020 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య ఫైనల్‌కూ స్టార్క్‌ హాజరైన విషయం విదితమే.


ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: యాస్తిక (సి) కిరణ్‌ (బి) అంజలి 21; హేలీ (సి) కిరణ్‌ (బి) పార్శవి 26; సీవర్‌ నాటౌట్‌ 72; హర్మన్‌ప్రీత్‌ (బి) ఎకిల్‌స్టోన్‌ 14; అమేలియా (సి) అంజలి (బి) ఎకిల్‌స్టోన్‌ 29; పూజ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182; వికెట్ల పతనం: 1-31, 2-69, 3-104, 4-164; బౌలింగ్‌: గ్రేస్‌ హారిస్‌ 3-0-20-0; అంజలి శర్వాణి 3-0-17-1; రాజేశ్వరి 4-0-36-0; ఎకిల్‌స్టోన్‌ 4-0-39-2; దీప్తిశర్మ 4-0-39-0; పార్శవి చోప్రా 2-0-25-1

యూపీ వారియర్స్‌ ఇన్నింగ్స్‌: అలీసా (సి) హర్మన్‌ (బి) వాంగ్‌ 11; శ్వేత (సి) హేలీ (బి) ఇషాక్‌ 1; తాలియా రనౌట్‌ 7; కిరణ్‌ నవ్‌గిరె (సి) సీవర్‌ (బి) వాంగ్‌ 43; హారిస్‌ (సి) వాంగ్‌ (బి) సీవర్‌ 14; దీప్తి శర్మ (సి) జింతిమణి (బి) హేలీ 16; సిమ్రన్‌ (బి) వాంగ్‌ 0; ఎకిల్‌స్టోన్‌ (బి) వాంగ్‌ 0; అంజలి (బి) జింతిమణి 5; రాజేశ్వరి ఎల్బీ (బి) ఇషాక్‌ 5; పార్శవి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (17.4 ఓవర్లలో ఆలౌట్‌) 110; వికెట్ల పతనం: 1-8, 2-12, 3-21, 4-56, 5-84, 6-84, 7-84, 8-94, 9-104  బౌలింగ్‌: సీవర్‌ 3-0-21-1; సైకా ఇషాక్‌ 2.4-1-24-2; ఇస్సీ వాంగ్‌ 4-0-15-4; అమేలియా 3-0-25-0; హేలీ మాథ్యూస్‌ 3-0-21-1; అమన్‌జోత్‌ 1-0-2-0; జింతిమణి 1-0-2-1


1

డబ్ల్యూపీఎల్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఇస్సీ వాంగ్‌ రికార్డు సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని