కప్పు.. ఎవరి కొప్పులో

దేశంలో అమ్మాయిల క్రికెట్‌కు ఊతమిస్తూ మొదలైన మహిళల ప్రిమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌లో ఆఖరి ఘట్టానికి వేళైంది. ఎందరో యువ ప్రతిభావంతులను అభిమానులకు పరిచయం చేసిన టోర్నీ ఫైనల్‌ నేడే.

Published : 26 Mar 2023 03:25 IST

దిల్లీ × ముంబయి
డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌ నేడు రాత్రి 7.30 నుంచి

దేశంలో అమ్మాయిల క్రికెట్‌కు ఊతమిస్తూ మొదలైన మహిళల ప్రిమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌లో ఆఖరి ఘట్టానికి వేళైంది. ఎందరో యువ ప్రతిభావంతులను అభిమానులకు పరిచయం చేసిన టోర్నీ ఫైనల్‌ నేడే. హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్‌.. మెగ్‌ లానింగ్‌ సారథ్యంలోని దిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది. మరి డబ్ల్యూపీఎల్‌ తొలి ట్రోఫీ ఏ జట్టుకు చిక్కుతుందో..!

ముంబయి : మొట్టమొదటి డబ్ల్యూపీఎల్‌లో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది. రెండు జట్లకు స్టార్‌ క్రికెటర్లు నాయకత్వం వహిస్తుండడంతో మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. అయితే జోరును కొనసాగిస్తూ ట్రోఫీని చేజిక్కించుకోవాలనుకుంటున్న ముంబయికి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఫామ్‌ కాస్త ఆందోళన కలిగిస్తోంది. టోర్నీ ఆరంభంలో మూడు అర్ధశతకాలు సాధించిన హర్మన్‌.. ఆ తర్వాత ఫామ్‌ను కోల్పోయింది. యూపీ వారియర్స్‌తో ఎలిమినేటర్‌లో నాట్‌ సీవర్‌    (72 నాటౌట్‌) చెలరేగకపోయుంటే కథ మరోలా ఉండేది. ఎలిమినేటర్‌లో హర్మన్‌ 14 పరుగులు మాత్రమే చేసింది. క్యాచ్‌ చేజారడంతో బతికిపోయిన సీవర్‌ అవకాశాన్ని ఉపయోగించుకుని బ్యాట్‌ ఝుళిపించి ఉండకపోతే ముంబయి ఇబ్బంది పడేదే. హర్మన్‌ను లానింగ్‌ జట్టు ఫైనల్లోనూ తక్కువ స్కోరుకు పరిమితం చేయడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. కానీ సొంత ప్రేక్షకుల మధ్య ఆడుతుండడం ముంబయికి కలిసొచ్చే అంశం. అయితే ముంబయిని పక్కకు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించిన దిల్లీకి కెప్టెన్‌ లానింగ్‌ గొప్ప బలం. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో లానింగ్‌ (310, సగటు 51.66) అగ్రస్థానంలో ఉంది. ఆల్‌రౌండర్‌ మరియన్‌ కాప్‌ కూడా దిల్లీ ధీమాను పెంచుతోంది. అయినప్పటికీ రెండు జట్లలో ఫేవరెట్‌ను ఎంచుకోవడం కష్టమే. ఇప్పటివరకు రెండు జట్లు కూడా అదిరే ప్రదర్శన చేశాయి. నిర్దాక్షిణ్యంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. కొన్నిసార్లు తడబడ్డాయి కూడా. లీగ్‌ దశలో రెండు జట్లు ఒకదానిపై ఒకటి భారీ విజయాలు సాధించాయి.

సీవర్‌పై భారం..: హర్మన్‌ప్రీత్‌ పరుగుల వేటలో తడబడుతున్న నేపథ్యంలో ఫైనల్లో నాట్‌ సీవర్‌పై బాధ్యత పెరిగింది. ఆమె మరోసారి మెరవాలని ముంబయి ఆశిస్తోంది. టోర్నీలో 54.40 సగటుతో 272 పరుగులు చేసిన సీవర్‌.. 10 వికెట్లు కూడా పడగొట్టి ముంబయి ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించింది. ఆమెను అడ్డుకోవడం దిల్లీకి సవాలే. మరో ఆల్‌రౌండర్‌ హేలీ మాథ్యూస్‌ (258 పరుగులు, 13 వికెట్లు) కూడా ముంబయికి అత్యంత కీలక ప్లేయర్‌. యాస్తిక భాటియా కూడా సత్తా చాటాలనుకుంటోంది. సైకా ఇషాక్‌ (16 వికెట్లు), వాంగ్‌ (13), అమేలియా  కెర్‌ (12)లతో ముంబయి బౌలింగ్‌లో కూడా బాగుంది.

కాప్‌ చెలరేగితే..: ఆల్‌రౌండర్‌ కాప్‌ (159 పరుగులు, 9 వికెట్లు) ఇంకొక్క మ్యాచ్‌లో సత్తా చాటాలని దిల్లీ కోరుకుంటోంది.. మిడిల్‌ ఓవర్లలో క్యాప్సీ పవర్‌ హిట్టింగ్‌ ఆ జట్టుకు సానుకూలాంశం. భారత స్టార్లు జెమీమా, షెఫాలి, శిఖా పాండే, రాధా యాదవ్‌ కూడా ఆఖరి సమరంలో మెరవాలని దిల్లీ ఆశిస్తోంది. మొత్తం మీద సమవుజ్జీలుగా కనిపిస్తోన్న దిల్లీ, ముంబయి మధ్య ఫైనల్‌ హోరాహోరీగా సాగడం ఖాయం.

ఫైనల్‌ చేరాయిలా..

లీగ్‌ దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో   అరు నెగ్గిన దిల్లీ టేబుల్‌ టాపర్‌గా నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ముంబయి కూడా 12 పాయింట్లతో సమంగా ఉన్నా.. రన్‌రేట్‌ తక్కువ ఉండడంతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఎలిమినేటర్‌ ఆడాల్సివచ్చింది. ఆ మ్యాచ్‌లో యూపీపై   నెగ్గి ముంబయి ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్‌ దశలో రెండు సార్లు తలపడ్డ ముంబయి, దిల్లీ చెరో సారి పైచేయి సాధించాయి. మొదట దిల్లీ 9 వికెట్ల తేడాతో ముంబయిని చిత్తు చేయగా.. ఆ తర్వాత ముంబయి కూడా అంతే తేడాతో నెగ్గి లెక్క సరి చేసింది. ఫైనల్‌ వేదిక బ్రబౌర్న్‌ స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయి  నెగ్గగా.. దిల్లీ రెండు గెలిచి, ఒకటి ఓడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని