పడి లేచి.. పసిడి పట్టి

ఎనిమిదేళ్ల క్రితం.. 2014 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌.. 21 ఏళ్ల భారత బాక్సర్‌ 81 కేజీల విభాగం ఫైనల్లో పోరాడి ఓడి రజతం గెలిచింది.

Published : 26 Mar 2023 03:25 IST

ఈనాడు క్రీడావిభాగం : ఎనిమిదేళ్ల క్రితం.. 2014 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌.. 21 ఏళ్ల భారత బాక్సర్‌ 81 కేజీల విభాగం ఫైనల్లో పోరాడి ఓడి రజతం గెలిచింది. ఆ తర్వాతి ఏడాదే ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లోనూ వెండి పతకం సొంతం చేసుకుంది. దీంతో ఆమెపై ఎన్నో అంచనాలు. స్టార్‌ బాక్సర్‌గా ఎదుగుతుందనే ఆశలు. కానీ ఒత్తిడికి తలవంచే బలహీనతతో వరుస పరాజయాలు ఎదుర్కొంది. ఇప్పుడా బలహీనతను అధిగమించి.. అనుభవంతో సత్తాచాటి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది స్వీటీ బూర. హరియాణాలోని హిసార్‌కు చెందిన ఈ 30 ఏళ్ల బాక్సర్‌.. కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు చూసింది. గొప్ప ఆరంభం తర్వాత  ఆమె కెరీర్‌ తడబడింది. తన ప్రతిభను, నైపుణ్యాలను సమర్థంగా ప్రదర్శించలేకపోయింది. శారీరకంగా, మానసికంగా అలసిపోయింది. నిలకడ అందుకోలేకపోయింది. 2018లో 81 కేజీల నుంచి 75 కేజీల విభాగానికి మారడం మరింత చేటే చేసింది. కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. ఒక్క అవకాశం తన ప్రస్థానాన్ని గొప్పగా మారుస్తుందని, తన ప్రయాణాన్ని మెరుగుపరుస్తుందని ఆమె ఆశించింది.

ఆ మార్పుతో..: స్వీటీ అనుకున్నట్లుగా ఆ ఒక్క అవకాశం ఆమెకు మరోసారి  81 కేజీల విభాగం రూపంలోనే వచ్చింది. లవ్లీనా కోసం నిరుడు 75 కేజీల విభాగాన్ని స్వీటీ వదిలేయాల్సి వచ్చింది. ఆ మార్పు ఆమెకు మేలే చేసింది. తిరిగి తన పాత బరువు విభాగంలో స్వీటీ సత్తాచాటుతోంది. ఎన్నో సవాళ్లను దాటుకుంటూ దాదాపు దశాబ్ద కాలంగా అత్యున్నత స్థాయి బాక్సింగ్‌లో కొనసాగుతున్న ఆమె.. వైఫల్యాలను వెనక్కినెట్టి తిరిగి గెలుపు బాట పట్టింది. ఎన్నో ఓటములు చూసిన ఆమె మానసికంగానూ బలంగా మారింది. ఒత్తిడిని దూరం చేసుకుంది. 2022 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారి పసిడి ముద్దాడింది. ఇప్పుడు అయిదోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ బరిలో దిగిన ఆమె సానుకూల దృక్పథంతో ముందుకు సాగింది. ప్రత్యర్థులపై పైచేయి సాధించి.. తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. నిరుడు కబడ్డీ స్టార్‌ ఆటగాడు దీపక్‌ నివాస్‌ హుడాను ఆమె వివాహం చేసుకుంది. స్వీటీ కూడా ఒకప్పుడు జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడిన సంగతి   తెలిసిందే.

2

ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ల్లో స్వీటీ గెలిచిన పతకాలు. 2014లో ఆమె రజతం నెగ్గింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని