రింగ్‌లో చిరుత

అప్పటివరకూ ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించిన ఆ బాక్సర్‌.. ఫలితం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఆమెతో  పాటు అక్కడున్న ప్రేక్షకులు, టీవీల ముందున్న అభిమానులు ఉత్కంఠగా చూస్తున్నారు.

Published : 26 Mar 2023 03:24 IST

అప్పటివరకూ ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించిన ఆ బాక్సర్‌.. ఫలితం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఆమెతో  పాటు అక్కడున్న ప్రేక్షకులు, టీవీల ముందున్న అభిమానులు ఉత్కంఠగా చూస్తున్నారు. ఎరుపు రంగు జెర్సీ వేసుకున్న అమ్మాయి 48 కేజీల ప్రపంచ ఛాంపియన్‌ అని ప్రకటించగానే.. స్టేడియంలోని ప్రేక్షకులు, దేశవ్యాప్తంగా అభిమానులు సంతోషంలో తేలిపోయారు. కానీ ఆమె మాత్రం కన్నీళ్లలో మునిగిపోయింది. ఎన్నో ఇబ్బందులు దాటి.. సవాళ్లను అధిగమించి.. తొలిసారి విశ్వవిజేతగా నిలవడంతో నీతు కళ్లలో నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. హరియాణాలోని భివానికి చెందిన ఈ 22 ఏళ్ల బాక్సర్‌.. ఇప్పటికే వరుసగా 2017, 2018లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు సీనియర్‌ విభాగంలో తొలిసారి పసిడి ముద్దాడింది. పట్టుదలతో వరుస వైఫల్యాల నుంచి బయటపడి.. తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ టైటిల్‌ సొంతం చేసుకుంది. శిక్షణ కోసం తండ్రి ఉద్యోగానికి దూరం కావడమే కాదు.. అప్పులు చేసి ఆమెకు శిక్షణ ఇప్పించాడు. స్కూటర్‌పై రోజు 40 కిలోమీటర్ల ప్రయాణం చేసిన ఆమె.. ఇప్పుడు రింగ్‌లో చిరుతలా పంజా విసురుతోంది.

ఆ కసితో..: ఓటమిని ఒప్పుకోని నీతు కసితో విజయాల బాటలో పయనిస్తోంది. 2017 నుంచి బరిలో దిగిన ప్రతి టోర్నీలోనూ దాదాపుగా ఆమె పసిడితోనే తిరిగి వస్తోంది. ప్రత్యర్థిని తికమక పెడుతూ పంచ్‌లు విసరడంలో గొప్ప పట్టు సాధించింది. ప్రత్యర్థి కిందకు వంగితే.. అప్పర్‌కట్‌ పంచ్‌లతో దిమ్మతిరిగేలా చేస్తోంది. ఒక చేతిని చూపించి.. మరో చేతితో ముఖంపై బలమైన హుక్‌ పంచ్‌లు విసురుతోంది. తనది ఎడమ చేతి వాటం అయినప్పటికీ రెండు చేతులతోనూ వేగాన్ని ప్రదర్శిస్తోంది. నిరుడు స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీ, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు సొంతం చేసుకుంది. 2018లో ఆసియా యూత్‌ ఛాంపియన్‌గానూ నిలిచింది. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో తొలి మూడు బౌట్లలోనూ ప్రత్యర్థులను నాకౌట్‌ చేయడం ఆమె దూకుడుకు నిదర్శనం. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థులు ఆమె ధాటికి తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను ఆపి నీతును విజేతగా ప్రకటించాల్సి వచ్చింది. నిరుడు క్వార్టర్స్‌లో తనను ఓడించిన బల్కిబెకోవాపై ఈ సారి సెమీస్‌లో తగిన ప్రతీకారం తీర్చుకుంది. ప్రత్యర్థిని బట్టి తన వ్యూహాలను మార్చుకుంటూ నీతు విజయవంతమవుతోంది. గతేడాది బల్కిబెకోవాతో పోరులో దూరం నుంచి ఆడి ఓటమి పాలైన ఆమె.. ఈ సారి ప్రత్యర్థి మీదకు దూసుకెళ్లి విజయం సాధించింది. ‘మిషన్‌ ఒలింపిక్స్‌’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పెట్టుకున్న ఆమె.. ఇప్పుడు వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సాగుతోంది.

‘‘విజయం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఈ పతకం కోసం పన్నెండేళ్లు శ్రమించా. తాజా     విజయంతో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నగదు బహుమతితో అప్పులు తీర్చేస్తా’’

నీతు

1

ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నీతుకు ఇదే తొలి పతకం. గతంలో ఆమె రెండు సార్లు (2017, 2018) ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌గా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు