ఫైనల్లో సాత్విక్‌ జోడీ

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టి ద్వయం ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో భారత స్టార్‌ జోడీ 21-19, 17-21, 21-17తో మూడో సీడ్‌ ఆంగ్‌ యివ్‌ సిన్‌, టియో ఈ యి (మలేసియా) జోడీపై విజయం సాధించింది.

Published : 26 Mar 2023 02:19 IST

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టి ద్వయం ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో భారత స్టార్‌ జోడీ 21-19, 17-21, 21-17తో మూడో సీడ్‌ ఆంగ్‌ యివ్‌ సిన్‌, టియో ఈ యి (మలేసియా) జోడీపై విజయం సాధించింది. 69 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌ తొలి గేమ్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌ జోడీ దూకుడు ప్రదర్శించింది. 11-9తో విరామానికి వెళ్లింది. ఆ తర్వాత జోరు కొనసాగించి 16-11తో ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి షట్లర్లు పుంజుకోవడంతో సాత్విక్‌ ద్వయం 17-19తో వెనకబడింది. అయితే కీలక సమయంలో వరుసగా 4 పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను గెలుచుకుంది భారత జోడీ. రెండో గేమ్‌లో తడబడిన సాత్విక్‌ జంట ఏ దశలోనూ మలేసియా జంటను అందుకోలేదు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో గేర్లు మార్చిన భారత ద్వయం ఎలాంటి ఒత్తిడి పెంచుకోకుండా విజయాన్ని అందుకుంది. అంతకుముందు క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ 15-21, 21-11, 21-14తో   జప్పే బే, లాసె మోల్హదె (డెన్మార్క్‌)ను ఓడించింది. ఈ టోర్నీలో భారత్‌ నుంచి పోటీలో ఉన్న షట్లర్లు వీరిద్దరు మాత్రమే. సింధు, శ్రీకాంత్‌, ప్రణయ్‌ నిష్క్రమించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని