సంక్షిప్త సమాచారం(5)

టీ20 క్రికెట్లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌ తొలి విజయాన్ని అందుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా షార్జాలో జరిగిన తొలి టీ20లో అఫ్గాన్‌ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.

Published : 26 Mar 2023 02:19 IST

పాక్‌కు అఫ్గాన్‌ షాక్‌

షార్జా: టీ20 క్రికెట్లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌ తొలి విజయాన్ని అందుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా షార్జాలో జరిగిన తొలి టీ20లో అఫ్గాన్‌ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. మందకొడి పిచ్‌పై మొదట పాక్‌ను 92/9కు పరిమితం చేసిన అఫ్గాన్‌.. 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ముజీబ్‌ (2/9), ఫజల్‌ హక్‌  (2/13), మహ్మద్‌ నబి (2/12) పాక్‌ను దెబ్బతీశారు. లక్ష్యఛేదనలో అఫ్గాన్‌ కూడా ఇబ్బందిపడింది. ఒక దశలో 45కే 4 వికెట్లు కోల్పోయింది. నబి (38 నాటౌట్‌), నజీబుల్లా (17 నాటౌట్‌) అబేధ్యమైన అయిదో వికెట్‌కు 53 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు.


తొలి టీ20లో వెస్టిండీస్‌ విజయం

సెంచూరియన్‌: వర్ష ప్రభావిత తొలి టీ20లో వెస్టిండీస్‌ 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. శనివారం వర్షం వల్ల ఇన్నింగ్స్‌ను 11 ఓవర్లకు కుదించగా.. మొదట దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 131 పరుగులు చేసింది. మిల్లర్‌ (48) టాప్‌ స్కోరర్‌. వెస్టిండీస్‌ ఛేదన ఉత్కంఠభరితంగా సాగింది. రోమన్‌ పావెల్‌ (43 నాటౌట్‌) మెరవడంతో లక్ష్యాన్ని ఆ జట్టు 10.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చార్లెస్‌ 28 పరుగులు చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది.


198 పరుగుల తేడాతో..

తొలి వన్డేలో శ్రీలంకపై కివీస్‌ ఘనవిజయం

ఆక్లాండ్‌: హ్యారీ షిప్లే (5/31) విజృంభించడంతో శనివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ 198 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈడెన్‌ పార్క్‌లో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌పై మొదట కివీస్‌ 49.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. ఫిన్‌ అలెన్‌ (51), రచిన్‌ రవీంద్ర (49), మిచెల్‌ (47), గ్లెన్‌ ఫిలిప్స్‌ (39) రాణించారు. కరుణరత్నె నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో షిప్లే ధాటికి విలవిల్లాడిన లంక 19.5 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. టిక్నర్‌ (2/20), మిచెల్‌ (2/12) కూడా ఆ జట్టును దెబ్బతీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే మంగళవారం జరుగుతుంది.


బౌండరీ గురించి వాళ్లనే అడగండి: హర్మన్‌ప్రీత్‌

ముంబయి: డబ్ల్యూపీఎల్‌లో బౌండరీ చిన్నగా ఉండడంపై వ్యాఖ్యానించడానికి ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నిరాకరించింది. బౌండరీ దూరాన్ని నిర్ణయించేది పాలకులని, క్రీడాకారులు కాదని చెప్పింది. డబ్ల్యూపీఎల్‌లో బౌండరీ పరిధి గరిష్టంగా 60 మీటర్లు దాటరాదని టోర్నీ ఆరంభంలో బీసీసీఐ ఆదేశాలిచ్చింది. గత నెల టీ20 ప్రపంచకప్‌లో కంటే ఈ దూరం అయిదు మీటర్లు తక్కువ. భారీ స్కోర్లతో ప్రేక్షకులకు వినోదాన్నివ్వడం కోసమే బోర్డు బౌండరీ దూరాన్ని తగ్గించింది. అయితే డీవై పాటిల్‌, బ్రబౌర్న్‌ స్టేడియాలు రెండింటిలోనూ తక్కువలో తక్కువ 42-44 మీటర్ల బౌండరీ కూడా ఉంది. ఫైనల్‌ నేపథ్యంలో బౌండరీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు హర్మన్‌ బదులిస్తూ.. ‘‘మేం బౌండరీ తాళ్లు పెట్టలేదు. పెట్టిన వాళ్లను అడగడండి. బౌండరీ ఎంత దూరంలో ఉండాలన్నది మా చేతుల్లో లేదు. అధికారుల చేతుల్లో ఉంది. మీరు వాళ్లతో మాట్లాడొచ్చు’’ అని చెప్పింది.


శ్రీజ ముందంజ

జమ్ము: జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రెండో సీడ్‌ ఆకుల శ్రీజ ముందంజ వేసింది. తొలి రౌండ్లో ఆమె విజయం సాధించింది. టాప్‌ సీడ్‌ మనిక బత్రా, రీత్‌ రిష్య, దియా చితాలె, సుతీర్థ ముఖర్జీ, అనూష, స్వస్తిక , ప్రాప్తి సేన్‌ కూడా అలవోకగా నెగ్గారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని