సంక్షిప్త వార్తలు (6)

సింధు, శ్రీకాంత్‌, ప్రణయ్‌ లాంటి టాప్‌ షట్లర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగిన స్విస్‌ ఓపెన్లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి అదరగొట్టారు.

Updated : 27 Mar 2023 04:00 IST

సాత్విక్‌-చిరాగ్‌ అదుర్స్‌

బాసెల్‌: సింధు, శ్రీకాంత్‌, ప్రణయ్‌ లాంటి టాప్‌ షట్లర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగిన స్విస్‌ ఓపెన్లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి అదరగొట్టారు. డబుల్స్‌ టైటిల్‌ నెగ్గి సత్తా చాటారు. హోరాహోరీగా సాగిన తుది సమరంలో చైనా జంటను ఓడించి కెరీర్లో అయిదో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ 21-19, 24-22తో రెన్‌ జియాంగ్‌-టాన్‌ కియాంగ్‌ (చైనా)ను ఓడించారు. స్విస్‌ ఓపెన్లో మన దేశానికి ఇది ఆరో టైటిల్‌. డబుల్స్‌లో ఇదే మొదటిది. ఇంతకుముందు సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ (2011, 2012) రెండుసార్లు నెగ్గగా.. సింధు (2022), శ్రీకాంత్‌ (2015), ప్రణయ్‌ (2016) కూడా టైటిళ్లు గెలిచారు.


స్విస్‌ టైటిల్‌ కైవసం
సమ్రాకు కాంస్యం

భోపాల్‌: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ రైఫిల్‌/పిస్టల్‌ ప్రపంచకప్‌ 50 మీటర రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో భారత వర్ధమాన షూటర్‌ సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా కాంస్యం గెలుచుకుంది. ర్యాంకింగ్‌ రౌండ్లో ఆమె 403.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. జాంగ్‌ (414.7), అనేటా బ్రబకోవా (411.3) టైటిల్‌ రౌండ్‌కు అర్హత సాధించారు. స్వర్ణ పతక పోరులో జాంగ్‌ (చైనా) 16-8తో బ్రబకోవా (చెక్‌)పై గెలిచింది. భారత్‌ ఒక స్వర్ణం, ఒక రజతం, 5 కాంస్యాలతో పతకాల పట్టికలో చైనా (8 స్వర్ణాలు) తర్వాత రెండో స్థానంలో నిలిచింది.


హంపి-హారిక గేమ్‌ డ్రా

దిల్లీ: మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్లో తొలి గేమ్‌ను హంపి, హారిక డ్రా చేసుకున్నారు. ఆదివారం ఆరంభమైన టోర్నీ తొలి రౌండ్లో హారికతో తలపడిన హంపి 31 ఎత్తుల్లో గేమ్‌ను డ్రాగా ముగించింది. వైశాలి శుభారంభం చేసింది. ఎలిజిబెత్‌ (జర్మనీ)తో మ్యాచ్‌లో ఆమెకు విజయం దక్కింది.


భారత్‌కు క్లిష్టమైన డ్రా
సుదిర్మన్‌ కప్‌

దిల్లీ: సుదిర్మన్‌ కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత్‌కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. చైనాలోని సుజ్‌హోలో మే 14న ఆరంభమయ్యే ఈ టోర్నీలో గ్రూప్‌-సిలో బలమైన మలేసియా, చైనీస్‌ తైపీతో భారత్‌ తలపడనుంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా మాత్రమే మన జట్టుకు తేలికైన ప్రత్యర్థి. 2011, 2017 టోర్నీల్లో అత్యుత్తమంగా క్వార్టర్‌ఫైనల్‌ చేరిన భారత్‌.. గత రెండు కప్‌లలో ఆ దశకు కూడా వెళ్లలేకపోయింది. ఈ ఫిబ్రవరిలో ఆసియా మిక్స్‌డ్‌ టోర్నీలో కాంస్యం గెలవడం ద్వారా సుదిర్మన్‌ కప్‌కు అర్హత సాధించిన భారత్‌కు ఈసారి క్వార్టర్స్‌ చేరడం కూడా అంత సులభం కాదు. 16 జట్లు తలపడే ఈ టోర్నీలో 12సార్లు ఛాంపియన్‌ చైనా.. డెన్మార్క్‌, సింగపూర్‌, ఈజిప్ట్‌తో కలిసి గ్రూప్‌-ఎలో ఉండగా.. గ్రూప్‌-బిలో ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, జర్మనీ, కెనడా.. గ్రూప్‌-డిలో 4సార్లు ఛాంపియన్‌ కొరియా, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, జపాన్‌ పోటీపడుతున్నాయి.


డాక్టర్‌ షూటర్‌.. సిప్త్‌ కౌర్‌ సమ్రాది

ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచిన పంజాబ్‌ అమ్మాయి సిప్త్‌ కౌర్‌ సమ్రాది భిన్నమైన నేపథ్యం. వైద్య విద్య చదువుతూనే షూటింగ్‌లో కొనసాగుతోంది సిప్త్‌. గతేడాది జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ సమయంలో ఆమెకు ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. దీంతో ఆ టోర్నీనే తనకు చివరిది అనుకుంది. ఆటను వదిలేద్దామని నిర్ణయించుకుంది. కానీ ఈ టోర్నీలో జాతీయ రికార్డుతో స్వర్ణం నెగ్గింది. ఈ టోర్నీ కన్నా ముందు ఆమె జూనియర్‌ ప్రపంచకప్‌లో అయిదు పతకాలు సాధించింది. దీంతో షూటింగ్‌కు దూరం కాలేదు. టోర్నీల్లో ఆడేందుకు వీలు కల్పించాలని.. ఎంబీబీఎస్‌ తొలి ఏడాది పరీక్షలకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కళాశాలను కోరినా వాళ్లు అనుమతించలేదు. కానీ పట్టుదలగా అటు వైద్య విద్య.. ఇటు షూటింగ్‌ను కొనసాగిస్తున్న సిప్త్‌.. ప్రపంచకప్‌లో పతకంతో సత్తా చాటింది.


భారత్‌ ఖాతాలో రెండు కాంస్యాలు

దిల్లీ: ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ రెండు కాంస్య పతకాలు నెగ్గింది. అల్బేనియాలోని డరెస్‌లో జరుగుతున్న టోర్నీలో తొలిరోజు జోత్స్న (40 కేజీ), ధనుష్‌ (49 కేజీ) కంచు సొంతం చేసుకున్నారు. మహిళల 40 కేజీల కేటగిరిలో స్నాచ్‌లో 53 కేజీలు.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 62 కేజీలు ఎత్తిన 14 ఏళ్ల జోత్స్న.. మొత్తం మీద 115 కేజీలతో మూడో స్థానంలో నిలిచింది. స్నాచ్‌లో రజతం గెలిచిన ఆమె క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో ఆరో స్థానం మాత్రమే సాధించగలిగింది. పురుషుల 49 కేజీల విభాగంలో 200 కేజీలు (స్నాచ్‌ 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌ 112 కేజీలు) లిఫ్ట్‌ చేసిన ధనుష్‌ మూడో స్థానం సాధించాడు. స్నాచ్‌లో ధనుష్‌ రజతం సాధించాడు. కాంటినెంటల్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జెర్క్‌, టోటల్‌ లిఫ్ట్‌లలో విడివిడిగా కూడా పతకాలు ఇస్తారు. ఒలింపిక్స్‌లో మాత్రం మొత్తం బరువుకు మాత్రమే పతకం వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని