Nikhat Zareen: భారత బాక్సింగ్ కేరాఫ్ జరీన్
దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌ను సవాల్ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఎందుకంత పొగరు? అని అన్నారు. చిన్నతనం నుంచి కట్టుబాట్లను దాటి.. సామాజిక అడ్డంకులను అధిగమించి.. సమస్యలను వెనక్కునెట్టి.. పోరాటాన్నే నమ్ముకున్న ఆమెకు తన సత్తాపై ఉన్న నమ్మకమిచ్చిన పొగరది!
ఈనాడు క్రీడావిభాగం
దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌ను సవాల్ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఎందుకంత పొగరు? అని అన్నారు. చిన్నతనం నుంచి కట్టుబాట్లను దాటి.. సామాజిక అడ్డంకులను అధిగమించి.. సమస్యలను వెనక్కునెట్టి.. పోరాటాన్నే నమ్ముకున్న ఆమెకు తన సత్తాపై ఉన్న నమ్మకమిచ్చిన పొగరది! సెలక్షన్ ట్రయల్స్‌లో మేరీ చేతిలో ఓడిపోగానే.. ఆ అమ్మాయిని తక్కువ అంచనా వేశారు. కానీ ఎన్నో ఆటుపోట్లను చూసిన ఆమె.. కసితో ఎదిగింది. ఇప్పుడు ఒక్క సారి కాదు రెండు సార్లు విశ్వ విజేతగా అవతరించింది. ప్రపంచంలో మరే బాక్సర్‌కు సాధ్యం కాని రీతిలో మేరీకోమ్ ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ దిగ్గజ బాటలోనే సాగుతున్న నిఖత్.. మేరీ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఒకటి కంటే ఎక్కువ స్వర్ణాలు గెలిచిన భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. 2021 అక్టోబర్ నుంచి నిఖత్ ఒక్క బౌట్ కూడా ఓడిపోలేదు. రెండు సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. నిరుడు స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు దక్కించుకుంది. అన్ని సెలక్షన్ ట్రయల్స్‌లోనూ పైచేయి సాధించింది.
ఆమెదే హవా..
ప్రపంచ వేదికపై భారత బాక్సింగ్ సత్తాను చాటిన మేరీకోమ్ ఈ ఏడాది గ్లవ్స్‌ను వదిలేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఇప్పుడు భారత మహిళల బాక్సింగ్ ముఖ చిత్రంగా నిఖత్ మారింది. పోటీపడ్డ టోర్నీల్లో కచ్చితంగా పతకంతో తిరిగొస్తోంది. నిరుడు తొలిసారి కామన్వెల్త్ క్రీడల బరిలో దిగి స్వర్ణం పట్టేసింది. ప్రత్యర్థులను భయపెట్టేలా రింగ్‌లో పంచ్‌లు విసరడంలో నిలకడ ప్రదర్శిస్తోంది. బెదురు లేని వ్యక్తిత్వం.. వెనక్కి తగ్గని స్థైర్యం ఆమె సొంతం. ఎక్కువగా నాకౌట్, ఏకపక్ష విజయాలు సాధిస్తుండడం రింగ్‌లో ఆమె దూకుడుకు నిదర్శనం. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 52 కేజీల విభాగం లేకపోవడంతో ఆమె 50 కేజీలకు మారింది. శారీరకంగా బరువు తగ్గి.. ఆ విభాగానికి తగ్గట్లుగా మళ్లీ లయ అందుకోవడం చిన్న విషయమేమీ కాదు. అంతే కాకుండా వేగం, శక్తి తగ్గకుండా చూసుకోవాలి. అందుకు అవసరమైన ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలి. తీవ్రమైన కసరత్తులు చేయాలి. దీని కోసం నిఖత్ బాగానే కష్టపడింది. ఇష్టమైన ఆహారాన్ని వదులుకుంది. బళ్లారిలోని ఇన్‌స్పైర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో భారత్‌కు స్వర్ణం.. ఇప్పటికీ కలగానే ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా ఆ సుదీర్ఘ నిరీక్షణకు మాత్రం ముగింపు లేదు. ఇప్పటివరకూ ఒలింపిక్స్ బాక్సింగ్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో చూసుకుంటే దేశానికి కాంస్యాలే (2008లో విజేందర్, 2012లో మేరీ, 2020లో లవ్లీనా) దక్కాయి. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవాలనే తన కలతో పాటు దేశం స్వప్నాన్ని సాకారం చేసే దిశగా నిఖత్ సాగుతోంది. ప్రత్యర్థి ఎవరన్నది పట్టించుకోకుండా విజయాల బాటలో పయనిస్తున్న ఆమె ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉంది. ఒత్తిడిలోనే అత్యుత్తమ ఫలితాలు రాబట్టగలనని చెబుతున్న నిఖత్ వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో పసిడి మెడలో వేసుకుంటే అంతకుమించి ఆనందం ఏముంటుంది. అదే జరిగితే భారత బాక్సింగ్‌లో నిఖత్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం