WPL 2023: ముంబయికే పట్టం

ముంబయి ఇండియన్స్‌ అదుర్స్‌. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఈ ఫ్రాంఛైజీ.. మొట్టమొదటి మహిళల ప్రిమియర్‌ లీగ్‌ ఛాంపియన్‌గా అవతరించింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని ముంబయి.. రసవత్తరంగా సాగిన ఫైనల్లోనూ పైచేయి సాధించింది. దిల్లీకి నిరాశ.

Updated : 27 Mar 2023 03:56 IST

డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ కైవసం
రాణించిన సీవర్‌, వాంగ్‌, హేలీ
ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్‌ ఓటమి
ముంబయి

ముంబయి ఇండియన్స్‌ అదుర్స్‌. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఈ ఫ్రాంఛైజీ.. మొట్టమొదటి మహిళల ప్రిమియర్‌ లీగ్‌ ఛాంపియన్‌గా అవతరించింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని ముంబయి.. రసవత్తరంగా సాగిన ఫైనల్లోనూ పైచేయి సాధించింది. దిల్లీకి నిరాశ. పోరాడినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. బంతితో వాంగ్‌, హేలీ, అమేలియా.. బ్యాటుతో నీట్‌ సీవర్‌ ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు.

ముంబయి ఇండియన్స్‌దే డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌. నాట్‌ సీవర్‌ (60 నాటౌట్‌; 55 బంతుల్లో 7×4) రాణించడంతో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆ జట్టు ఏడు వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఇసీ వాంగ్‌ (3/42), హేలీ మాథ్యూస్‌ (3/5), అమేలియా కెర్‌ (2/18) విజృంభించడంతో మొదట దిల్లీ 9 వికెట్లకు 131 పరుగులే చేయగలిగింది. లానింగ్‌ (35; 29 బంతుల్లో 5×4) దిల్లీ టాప్‌ స్కోరర్‌. చాలా తక్కువ స్కోరుకే కుప్పకూలేలా కనిపించిన ఆ జట్టును చివరి వరుస బ్యాటర్లు శిఖా పాండే (27 నాటౌట్‌; 17 బంతుల్లో 3×4, 1×6), రాధా యాదవ్‌ (27 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4, 2×6) ఆదుకున్నారు. సీవర్‌తో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (37; 39 బంతుల్లో 5×4), అమేలియా కెర్‌ (14 నాటౌట్‌; 8 బంతుల్లో 2×4)  రాణించడంతో లక్ష్యాన్ని ముంబయి 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

నిలిచిన సీవర్‌: లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ముంబయి ఛేదన కష్టంగానే సాగింది. 4 ఓవర్లలో 24 పరుగులకే ఓపెనర్లు హేలీ (13), యాస్తిక భాటియా (4)లను ముంబయి కోల్పోయింది. ఆ దశలో సీవర్‌, హర్మన్‌ప్రీత్‌ నిలిచారు. బ్యాటర్లు దాటిగా ఆడకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. 11 ఓవర్లలో ఆ జట్టు స్కోరు 55 మాత్రమే. ఆ తర్వాత బ్యాటర్లు కాస్త వేగం పెంచినా 16 ఓవర్లలో 95/2తో నిలిచిన ముంబయికి.. చివరి 4 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతిలో 8 వికెట్లున్నా ఛేదన కష్టంగానే అనిపించింది. అలాంటి స్థితిలో హర్మన్‌ ఔటైంది. కానీ దూకుడు పెంచిన సీవర్‌ అదే ఓవర్లో (17వ) రెండు ఫోర్లు కొట్టింది. 18వ ఓవర్లో శిఖా అయిదు పరుగులే ఇవ్వడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబయిపై ఒత్తిడీ పెరిగింది. కానీ సీవర్‌ ఓ ఫోర్‌, అమేలియా కెర్‌ రెండు ఫోర్లు కొట్టడంతో 19వ ఓవర్లో జొనాసెన్‌ 16 పరుగులు సమర్పించుకుంది. దీంతో దిల్లీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

దిల్లీకి కళ్లెం: వాంగ్‌, అమేలియా, హేలీ సూపర్‌ బౌలింగ్‌తో ముంబయి అంతకుముందు దిల్లీకి కళ్లెం వేసింది. నిజానికి దిల్లీ చేసిన 131 కూడా అస్సలు ఊహించని స్కోరే. ఎందుకంటే 79 పరుగులకే 9 వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఫైనల్లో చాలా ముందే చేతులెత్తేసినట్లనిపించింది. చివరి జంట.. టెయిలెండర్లు శిఖ పాండే, రాధా యాదవ్‌ల అద్భుత పోరాట పుణ్యమా అని ఆ జట్టు కాస్త పోరాడగలిగే స్కోరు సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ ఆరంభం పేలవం. వాంగ్‌.. రెండో ఓవర్లోనే షెఫాలి (11), క్యాప్సీ (0)ని ఔట్‌ చేసి ఆ జట్టుకు షాకిచ్చింది. అయిదో ఓవర్లో జెమీమా (9)ను కూడా వాంగ్‌ వెనక్కి పంపడంతో దిల్లీ 35/3తో చిక్కుల్లో పడింది. ఈ ముగ్గురూ ఫుల్‌టాస్‌లకే ఔట్‌ కావడం విశేషం. అయితే చక్కగా ఆడుతున్న లానింగ్‌కు కాప్‌ (18; 21 బంతుల్లో 2×4) తోడవడంతో దిల్లీ కోలుకుంది. 10.2 ఓవర్లలో 73/3తో నిలిచింది. కానీ అనూహ్యంగా గతి తప్పిన ఆ జట్టు 6 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్లలో 79/9తో నిలిచిన దిల్లీ పని అయిపోనట్లేనని భావించారంతా. కానీ ఊహించని విధంగా చెలరేగిన శిఖా, రాధా యాదవ్‌ అభేద్యమైన ఆఖరి వికెట్‌కు కేవలం 24 బంతుల్లో 52 పరుగులు జోడించి దిల్లీని నిలబెట్టారు. మ్యాచ్‌ ఏకపక్షంగా కాకుండా చూశారు.


దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: మెగ్‌ లానింగ్‌ రనౌట్‌ 35; షెఫాలి వర్మ (సి) అమేలియా (బి) వాంగ్‌ 11; క్యాప్సీ (సి) అమన్‌జ్యోత్‌ (బి) వాంగ్‌ 0; జెమీమా (సి) హేలీ (బి) వాంగ్‌ 9; కాప్‌ (సి) యాస్తిక (బి) అమేలియా 18; జెస్‌ జొనాసెన్‌ (సి) అండ్‌ (బి) హేలీ 2; అరుంధతి రెడ్డి (సి) ఇషాక్‌ (బి) అమేలియా 0; శిఖా పాండే నాటౌట్‌ 27; మిన్ను మణి (స్టంప్డ్‌) యాస్తిక (బి) హేలీ 1; తానియా (బి) హేలీ 0; రాధా నాటౌట్‌ 27; ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 131; వికెట్ల పతనం: 1-12, 2-12, 3-35, 4-73, 5-74, 6-75, 7-75, 8-79, 9-79; బౌలింగ్‌: నాట్‌ సీవర్‌ 4-0-37-0;  ఇసి వాంగ్‌ 4-0-42-3; సైకా 4-0-28-0; అమేలియా 4-0-18-2; హేలీ మాథ్యూస్‌ 4-2-5-3

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: హేలీ మాథ్యూస్‌ (సి) అరుంధతి (బి) జొనాసెన్‌ 13; యాస్తిక (సి) క్యాప్సీ (బి) రాధా 4; నాట్‌ సీవర్‌ నాటౌట్‌ 60; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రనౌట్‌ 37; అమేలియా కెర్‌ నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 134; వికెట్ల పతనం: 1-13, 2-23, 3-95; బౌలింగ్‌: కాప్‌ 4-0-22-0; రాధా 4-0-24-1; జెస్‌ జొనాసెన్‌ 4-0-28-1; శిఖా పాండే 4-0-23-0; క్యాప్సీ 3.3-0-34-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని