wWBC: నిఖత్-లవ్లీ పంచ్
బలమైన పంచ్‌లతో చెలరేగి.. మెరుపు దాడులతో సత్తాచాటి.. రింగ్‌లో తన జోరుకు ఎదురు లేకుండా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మరోసారి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొట్టింది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో అదరగొట్టిన జరీన్
వరుసగా రెండో ఏడాది తెలంగాణ బాక్సర్‌కు స్వర్ణం
75 కేజీల విభాగంలో సత్తాచాటిన బోర్గోహెయిన్
తొలిసారి పసిడి నెగ్గిన లవ్లీనా
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్
దిల్లీ
బలమైన పంచ్‌లతో చెలరేగి.. మెరుపు దాడులతో సత్తాచాటి.. రింగ్‌లో తన జోరుకు ఎదురు లేకుండా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మరోసారి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొట్టింది. ఆదివారం 50 కేజీల విభాగంలో పసిడిని ముద్దాడి వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ టైటిల్ పట్టేసింది. మరోవైపు 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్ ఛాంపియన్‌గా నిలిచింది. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ఆమె.. తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సారి మొత్తం నాలుగు బంగారు పతకాలు భారత్ సొంతమయ్యాయి. 2006 తర్వాత ఓ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు నెగ్గడం భారత్‌కు ఇదే తొలిసారి.
మాటల్లోనైనా.. చేతల్లోనైనా.. ఆమెకు తెలిసిందొక్కటే.. పంచ్!
ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకు అని ప్రశ్నించారు?
ఎంపికపై గళమెత్తితే ఎందుకంత పొగరన్నారు?
అసలు ఎవరు నిఖత్ అంటూ ఎన్నో మాటలన్నారు!
అన్నింటికీ సమాధానంగా ఓ పంచ్ విసిరింది!
నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించుతూ నిరుడు దేశానికి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి అందించింది. పంచ్‌లతోనే సాగుతూ.. రింగ్‌లో సివంగిలా కదులుతూ.. మన నిఖత్ జరీన్ మరోసారి తాకత్ చూపించింది. వరుసగా రెండోసారి ప్రపంచ టైటిల్ పట్టేసింది. అసలు ఎవరు నిఖత్ అని ఎగతాళిగా మాట్లాడిన బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తర్వాత.. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత బాక్సర్‌గా రికార్డు సృష్టించింది. మరోవైపు లవ్లీనా కూడా ఈ సారి పతకం రంగు మార్చింది. గతంలో రెండుసార్లు కాంస్య పతకాలకు పరిమితమైన లవ్లీనా ఈసారి పసిడి పట్టేసింది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ మరోసారి విజేతగా నిలిచింది. ఆదివారం 50 కేజీల ఫైనల్లో ఆమె 5-0 తేడాతో థీ థామ్ న్యూయెన్ (వియత్నాం)ను చిత్తుచేసింది. 26 ఏళ్ల నిఖత్.. తుదిపోరులోనూ జోరు కొనసాగించి ఏకపక్ష విజయాన్ని అందుకుంది. 28 ఏళ్ల న్యూయెన్ కూడా దీటుగా బదులివ్వడంతో ఈ బౌట్ హోరాహోరీగా సాగింది. ఒకరిని మరొకరు తోసేసుకోవడం, కింద పడిపోవడం, మెడను అణిచిపెట్టి పంచ్‌లు విసరడం.. ఇలా ఈ మ్యాచ్ ఓ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. బాక్సర్లిద్దరూ ఒక్కోసారి రిఫరీ నుంచి హెచ్చరిక (ఎల్లో కార్డు) కూడా అందుకున్నారు. తన ఎత్తును అనుకూలంగా మార్చుకుని న్యూయెన్ గట్టిపోటీనిచ్చింది. నిఖత్‌ను ఒకసారి తోసేసింది. పడి లేచిన నిఖత్ అప్పర్‌కట్, హుక్ పంచ్‌లతో చెలరేగింది. తన మెడను కిందకు వచ్చి.. న్యూయెన్ ఆధిపత్యం చలాయించాలని చూసినా నిఖత్ ఆగలేదు. ఎదురు దెబ్బలు తిన్నా.. తిరిగి లెక్క సరిచేసింది. తొలి రౌండ్‌లో నిఖత్‌దే పూర్తి ఆధిపత్యం. రెండో రౌండ్‌లో ఆమె మరింతగా చెలరేగింది. ముఖంపై ఎడమ చేతి పంచ్‌లతో రెచ్చిపోయింది. చివరి రౌండ్లో పోరు మరోస్థాయికి చేరింది. ఇద్దరు బాక్సర్లు ఒకరిపై మరొకరు పడిపోతూ.. పంచ్‌లు ఇచ్చుకున్నారు. నిఖత్ కుడిచేత్తో బలంగా ఓ పంచ్ ఇవ్వడంతో.. ప్రత్యర్థికి దిమ్మతిరిగింది. దీంతో రిఫరీ ఎనిమిది అంకెలు (8 కౌంట్) లెక్కపెట్టిన తర్వాత మళ్లీ బౌట్ కొనసాగించింది. ఈ సారి న్యూయెన్ బలంగా నిఖత్‌కు పంచ్ ఇవ్వడంతో రిఫరీ మళ్లీ 8 కౌంట్ చేసింది. అయిదుగురు జడ్జీలూ నిఖత్‌కే ఓటు వేయడంతో ఆమె సంతోషం పట్టలేక కన్నీళ్లు పెట్టుకుంది.
75 కేజీల ఫైనల్లో లవ్లీనా 5-2తో కైత్లిన్ పార్కర్ (ఆస్ట్రేలియా)పై నెగ్గింది. రింగ్‌లో వేగంగా కదులుతూ.. అప్పర్‌కట్ పంచ్‌లతో లవ్లీనా దాడి కొనసాగించింది. పటిష్ఠమైన డిఫెన్స్‌తో పాటు దూకుడైన అటాకింగ్ నైపుణ్యాలు ప్రదర్శించింది. తొలి రౌండ్‌లో 3-2తో లవ్లీనాదే పైచేయి. రెండో రౌండ్‌లో కాస్త నెమ్మదించినట్లు కనిపించిన లవ్లీనా అవకాశం కోసం ఎదురు చూసింది. మరోవైపు కైత్లిన్ వేగం పెంచింది. లవ్లీనా ఎక్కువగా రక్షణాత్మకంగా వ్యవహరించింది. దీంతో కైత్లిన్ రెండో రౌండ్లో ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక మూడో రౌండ్‌లో లవ్లీనా ప్రాణం పెట్టి పోరాడింది. చివరకు బౌట్ సమీక్షలో లవ్లీనాకే జడ్జీలు జై కొట్టారు. తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ తదితరులు నిఖత్ పోరును ప్రత్యక్షంగా వీక్షించారు.
4
ఈ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ గెలిచిన బంగారు పతకాలు. స్వర్ణాల పరంగా 2006 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఉత్తమ ప్రదర్శనను ఇప్పుడు సమం చేసింది.
2
ప్రపంచ బాక్సింగ్‌లో ఒకటి కంటే ఎక్కువ స్వర్ణాలు గెలిచిన రెండో భారత బాక్సర్ నిఖత్. ఆమె కంటే ముందు మేరీకోమ్ ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
1
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో లవ్లీనాకు ఇదే తొలి స్వర్ణం. గతంలో ఆమె రెండు కాంస్యాలు (2018, 2019) గెలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ కంచు దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.