కోల్‌కతా కెప్టెన్‌గా నితీష్‌ రాణా

ఎడమచేతి వాటం బ్యాటర్‌ నితీష్‌ రాణా ఈ ఐపీఎల్‌ సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. గాయపడ్డ శ్రేయస్‌ అయ్యర్‌ స్థానాన్ని అతడు భర్తీ చేస్తాడు.

Published : 28 Mar 2023 03:08 IST

కోల్‌కతా: ఎడమచేతి వాటం బ్యాటర్‌ నితీష్‌ రాణా ఈ ఐపీఎల్‌ సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. గాయపడ్డ శ్రేయస్‌ అయ్యర్‌ స్థానాన్ని అతడు భర్తీ చేస్తాడు. వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకోనున్న శ్రేయస్‌.. మొత్తం సీజన్‌కే దూరమయ్యే ప్రమాదముంది. అయితే శ్రేయస్‌ టోర్నీలో ఏదో ఒక దశ నుంచి ఆడతాడని ఆశిస్తున్నట్లు కోల్‌కతా తెలిపింది. రాణా ముస్తాక్‌ అలీ ట్రోఫీలో దిల్లీకి నాయకత్వం వహించాడు. అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ వ్యూహాలను అమలు చేయాలని అతణ్ని కోరతారని తెలుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో పేలవ ఫామ్‌ కారణంగా.. 29 ఏళ్ల రాణా ఈ సీజన్‌ రంజీ ట్రోఫీకి దిల్లీ జట్టులో స్థానం కోల్పోయాడు. కోల్‌కతా 2018 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు రాణాను కొనుక్కుంది. అప్పటి నుంచి అతడు ఆ జట్టుతోనే ఉన్నాడు. కోల్‌కతా తరఫున రాణా 135.61 స్ట్రైక్‌రేట్‌తో 1744 పరుగులు చేశాడు. ఏప్రిల్‌ 1న పంజాబ్‌ కింగ్స్‌తో పోరుతో కోల్‌కతా ఈ సీజన్‌ టైటిల్‌ వేటను ఆరంభిస్తుంది.

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులో సందీప్‌: గాయపడ్డ ప్రసిద్ధ్‌ కృష్ణ స్థానంలో వెటరన్‌ పంజాబ్‌ సీమర్‌ సందీప్‌ శర్మను రాజస్థాన్‌ రాయల్స్‌.. జట్టులోకి తీసుకుంది. రాయల్స్‌ ప్రధాన బౌలరైన ప్రసిద్ధ్‌ వెన్నుకు శస్త్రచికిత్స కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో వేలంలో అమ్ముడుపోని సందీప్‌ శర్మకు అవకాశం లభించింది. అతడు 104 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 7.77 ఎకానమీ రేట్‌తో 114 వికెట్లు పడగొట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని