సంక్షిప్త వార్తలు (7)

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌ ఆరంభ దశలో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు.

Published : 29 Mar 2023 02:42 IST

‘స్టోక్స్‌.. స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా’

ముంబయి: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌ ఆరంభ దశలో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనలో మోకాలి గాయంతో ఇబ్బంది పడిన స్టోక్స్‌ కొన్ని రోజులు బౌలింగ్‌కు దూరంగా ఉండే అవకాశాలున్నాయి. నిరుడు డిసెంబరులో ఆటగాళ్ల వేలంలో చెన్నై రూ.16.25 కోట్లకు స్టోక్స్‌ను కొనుక్కుంది. ఈనెల 31న ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో పాల్గొనేందుకు గతవారమే స్టోక్స్‌ చెన్నై చేరుకున్నాడు. ‘‘సీజన్‌ మొదట్లో అతను బ్యాటర్‌గా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్‌ వేసేందుకు మరికొంత సమయం పడుతుంది. ఆదివారం అతని మోకాలికి ఇంజక్షన్‌ వేయడంతో కాసేపు బౌలింగ్‌ చేశాడు. స్టోక్స్‌ను సీఎస్కే, ఈసీబీ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేసేందుకు అతడికి మరికొన్ని వారాలు పట్టొచ్చు’’ అని చెన్నై బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హసి తెలిపాడు.


ప్రిక్వార్టర్స్‌లో ధ్రువ్‌ జోడీ
స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌

మాడ్రిడ్‌: స్పెయిన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో ధ్రువ్‌ కపిల-ఎంఆర్‌.అర్జున్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో అర్జున్‌-ధ్రువ్‌ 16-21, 21-17, 21-12తో క్రిస్టఫర్‌ గ్రిమ్లే-మాథ్యూ గ్రిమ్లేను ఓడించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్‌ కపూర్‌ ఆరంభ రౌండ్లోనే వెనుదిరిగారు. అమ్రి-విన్నీ (ఇండోనేషియా) చేతిలో సిక్కి జోడీ 12-21, 22-20, 19-21తో పరాజయం చవిచూసింది. మరో మ్యాచ్‌లో సుమీత్‌రెడ్డి-అశ్విని పొన్నప్ప 17-21, 21-19, 13-21తో హితింగ్‌-డుయూ (చైనా) చేతిలో తలొంచారు. మహిళల డబుల్స్‌లో సిమ్రన్‌-రితిక 11-21, 19-21తో నటాషా-క్లారా (డెన్మార్క్‌) చేతిలో ఓడారు. పురుషుల సింగిల్స్‌లో ప్రియాంశు రజావత్‌ మెయిన్‌డ్రా చేరాడు. క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్లో ఫ్రాన్సిస్కో (ఎల్‌ సాల్వ్‌డార్‌)ను 21-16, 21-12తో ఓడించిన ప్రియాంశు.. రెండో రౌండ్లో అలెక్స్‌ (ఫ్రాన్స్‌)పై 21-18, 18-21, 21-15తో నెగ్గి ముందంజ వేశాడు. మరో మ్యాచ్‌లో మీరబా లువాంగ్‌ 14-21, 18-21తో అలెక్స్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు. సింధు, శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌ బుధవారం బరిలో దిగనున్నారు.


నా శైలిలో కోల్‌కతాను నడిపిస్తా

కోల్‌కతా: తనదైన శైలిలో జట్టును నడిపిస్తానని, ఎవరినీ అనుసరించనని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొత్త కెప్టెన్‌ నితీష్‌ రాణా అన్నాడు. ‘‘గత 2-3 ఏళ్లు నాయకత్వ పాత్రలో ఉన్నా. ఇప్పుడు కెప్టెన్సీ లభించిందంతే. కానీ ఇది నాకు కొత్త కాదు. బాధ్యత తీసుకోవడాన్ని ఇష్టపడతా. మంచి ఫలితాలు సాధిస్తానని ఆశిస్తున్నా. కెప్టెన్‌గా నేను ఎవరినీ అనుకరించను. నాదైన శైలిలో జట్టును నడిపిస్తా. ఒక్కో కెప్టెన్‌కు ఒక్కో శైలి ఉంటుంది’’ అని చెప్పాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడడంతో రాణాకు కెప్టెన్సీ దక్కిన సంగతి తెలిసిందే. రాణాను కెప్టెన్‌ చేయడం గురించి కోల్‌కతా కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ మాట్లాడుతూ.. ‘‘రాణా చాలా ఏళ్ల నుంచి కోల్‌కతా జట్టుతో ఉన్నాడు. చాలా ఏళ్ల నుంచి దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు. అతడు అన్ని విధాలా కెప్టెన్సీకి అర్హుడు. అందుకే అతడికి బాధ్యతలు అప్పగించాం. ఇది సమష్టి నిర్ణయం’’ అని చెప్పాడు.


భారత స్కీట్‌ షూటర్లు ఔట్‌

దిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచకప్‌ వ్యక్తిగత ఈవెంట్ల నుంచి భారత షూటర్లు అర్హత దశలో నిష్క్రమించారు. మహిళల స్కీట్‌లో రైజా దిల్లాన్‌ 114 స్కోరుతో 16వ స్థానంలో నిలిచింది. భారత్‌ తరఫున ఆమెదే అత్యుత్తమ ప్రదర్శన. పరియాంద్‌ ధలీవాల్‌ 33వ స్థానంలో, అరీబా ఖాన్‌ 40వ స్థానంలో నిలిచారు. పురుషుల విభాగంలో అంగద్‌ వీర్‌ సింగ్‌ 33వ స్థానంతో సంతృప్తి చెందాడు. అభయ్‌ సింగ్‌ 74వ స్థానంలో నిలిచాడు.


ఉపాధ్యక్షుడిగా అజయ్‌ సింగ్‌

దిల్లీ: భారత బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఐబీఏ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2026 వరకు అతడు ఆ బాధ్యతల్లో ఉండనున్నాడు.


పాక్‌కు ఊరట విజయం

షార్జా: అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్‌కు ఊరట విజయం దక్కింది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు కోల్పోయిన పాక్‌.. నామమాత్రమైన ఆఖరి పోరులో విజయాన్ని అందుకుంది. సోమవారం 66 పరుగుల ఆధిక్యంతో అఫ్గాన్‌ను ఓడించి ఆ జట్టు క్లీన్‌స్వీప్‌ ఆశలపై నీళ్లు చల్లింది. తొలుత పాక్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు సాధించింది. సైమ్‌ అయూబ్‌ (49), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (31), కెప్టెన్‌ షాదాబ్‌ఖాన్‌ (28) రాణించారు. అఫ్గాన్‌ 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షాదాబ్‌ (3/13), ఇహసానుల్లా (3/29) విజృంభించి అఫ్గాన్‌ను కట్టడి చేశారు.


ముక్కోణపు ట్రోఫీ భారత్‌ కైవసం

ఇంఫాల్‌: ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లో భారత్‌ విజేతగా నిలిచింది. మంగళవారం ఫైనల్లో 2-0 గోల్స్‌తో కిర్గిజ్‌ రిపబ్లిక్‌ను ఓడించింది. ఆరంభం నుంచి దాడులు చేసిన భారత్‌.. సందేశ్‌ (34వ ని) చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. కిర్గిజ్‌ కూడా గట్టిగానే ప్రయత్నించినా ఫినిషింగ్‌ చేయడంలో విఫలమైంది. ఆఖర్లో సునీల్‌ ఛెత్రి (84వ ని) బంతిని నెట్‌లోకి పంపడంతో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకున్న భారత్‌.. ఆధిక్యాన్ని కాపాడుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంతకుముందు మయన్మార్‌ను 1-0తో భారత్‌ ఓడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని