IPL 2023: ఎన్నాళ్లీ నిరీక్షణ..

పదిహేనేళ్లయింది ఐపీఎల్‌ ఆరంభమై. ఎన్నో రసవత్తర మ్యాచ్‌లు.. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు. ఈ లీగ్‌ క్రికెట్‌ అభిమానులకు పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ప్రతి ఫ్రాంఛైజీ కూడా తన కంటూ ఒక ఇమేజ్‌ను సృష్టించుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌లదైతే తిరుగులేని ఆధిపత్యం.

Updated : 29 Mar 2023 07:57 IST

ఐపీఎల్‌-16 మరో 2 రోజుల్లో

పదిహేనేళ్లయింది ఐపీఎల్‌ ఆరంభమై. ఎన్నో రసవత్తర మ్యాచ్‌లు.. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు. ఈ లీగ్‌ క్రికెట్‌ అభిమానులకు పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ప్రతి ఫ్రాంఛైజీ కూడా తన కంటూ ఒక ఇమేజ్‌ను సృష్టించుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌లదైతే తిరుగులేని ఆధిపత్యం. ముంబయి అయిదుసార్లు టైటిల్‌ గెలిస్తే, చెన్నై నాలుగుసార్లు ట్రోఫీని ముద్దాడింది. అయితే లీగ్‌ మొదలై దశాబ్దంన్నర గడిచినా ఇప్పటివరకు బెంగళూరు, దిల్లీ, పంజాబ్‌ ఒక్కటంటే ఒక్కసారీ కప్పు అందుకోకపోవడం ఆశ్చర్యమే. ప్రతిసారీ మార్పులు చేస్తున్నా నిరాశ తప్పట్లేదు. ఈ జట్ల నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుందో! 2023 ఐపీఎల్‌లో పోటీపడుతున్న జట్లలో ఈ మూడు కాకుండా కప్పు గెలవనిది కొత్త జట్టు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మాత్రమే. మరి ఈసారి కొత్త ఛాంపియన్‌ వస్తుందా?


స్టార్లున్నా..

పీఎల్‌లో అత్యంత ఆకర్షణీయ జట్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒకటి. అభిమానులూ ఎక్కువే. అయితే కోహ్లి, డివిలియర్స్‌, గేల్‌.. ఇలా స్టార్లు ప్రాతినిధ్యం వహించినా ఇప్పటివరకు ఆర్సీబీకి కప్పు దక్కలేదు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయని జట్టేదయినా ఉందంటే అది బెంగళూరే. అలాగని పూర్తిగా విఫలమైందని కాదు. కప్పునకు చేరువగా వెళ్లినా ఆ జట్టు కల మాత్రం నెరవలేదు. మూడుసార్లు ఫైనల్లో (2009, 2011, 2016) అడుగుపెట్టిన ఆర్సీబీ.. మొత్తంగా ఎనిమిదిసార్లు ప్లేఆఫ్స్‌ (2010, 2015, 2020, 2021, 2022)లో ప్రవేశించింది. ప్రతి ఏడాదీ ‘ఈసారి కప్పు మనదే’ అని అభిమానులు అనుకోవడం.. బెంగళూరు నిరాశపరచడం సాధారణమైపోయింది. టోర్నీలో అత్యధిక స్కోరు (263), అత్యల్ప స్కోరు (49) రికార్డులు బెంగళూరు పేరిట ఉన్నాయంటే ఆ జట్టు నిలకడలేమి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టు ఎంపికే బెంగళూరుకు ప్రధాన సమస్య. మేటి ఆటగాళ్లున్నా సమతూకం లేకపోవడం వల్ల ఆ జట్టు దెబ్బతింది. అసలు వేలంలోనే అవసరాలకు తగ్గట్లు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతుందన్నది బెంగళూరుపై పెద్ద విమర్శ. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌, పేస్‌ బౌలింగ్‌ ఆ జట్టుకు కలిసి రాలేదు. తుది జట్టులో పదే పదే మార్పులు చేయడం కూడా ఆర్సీబీ సరైన ఫలితాలు రాబట్టలేకపోడానికి కారణం. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ భారీ ఆశలతోనే బరిలోకి దిగుతోంది. గత మూడు టోర్నీల్లో ప్లేఆఫ్స్‌కు చేరడం ఆ జట్టు విశ్వాసాన్ని పెంచుతోంది. విరాట్‌ కోహ్లి వైదొలగడంతో నిరుడు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన డుప్లెసిస్‌ ఆకట్టుకున్నాడు. ఈసారి అతడు జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.మ్యాక్స్‌వెల్‌, కోహ్లి, డుప్లెసిస్‌, హర్షల్‌ పటేల్‌, హసరంగలతో బలంగా ఉన్న బెంగళూరు ఈసారి గట్టిపోటీదారే.


జోరందుకునేది ఎప్పుడో..

మొత్తంగా ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ప్రదర్శన నిరాశాజనకమే. ఏ దశలోనూ ఆ జట్టు ఐపీఎల్‌ అగ్ర జట్ల జాబితాలో చేరలేకపోయింది. 2014లో ఫైనల్‌, 2008లో సెమీఫైనల్‌ మినహాయిస్తే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనపడదు. ఒక జట్టుగా లేకపోవడమే పంజాబ్‌కు అతి పెద్ద సమస్య. ముంబయి, చెన్నై జట్లలా పంజాబ్‌కు ఎప్పుడూ ఒక ప్రధాన జట్టు లేదు. సరైన ప్రణాళికలు లేవు. ప్రతి ఏడాదీ ఆటగాళ్లను మార్చడం, పదే పదే కెప్టెన్లను మార్చడంతో జట్టుగా పంజాబ్‌ ఎప్పుడూ స్థిరపడలేదు. కోచ్‌లనూ మార్చడం పంజాబ్‌కు అలవాటుగా మారింది. తుది జట్టులో కూడా నిత్యం మార్పులు చేయడం కూడా పంజాబ్‌ అస్థిర ప్రదర్శనకు ప్రధాన కారణం. మరీ ఎక్కువ ధరలకు ఆటగాళ్లను కొనడం, వాళ్లను ఎక్కువ కాలం అట్టిపెట్టుకోకుండా వదిలేయడంతో పంజాబ్‌కు ఓ రూపు అంటూ లేకుండా పోతోంది. 13 సార్లు లీగ్‌ దశ దాటలేకపోయిన పంజాబ్‌ పని ఎప్పుడూ చివరి స్థానాల కోసం పోటీపడడమే. 2015 నుంచి ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్‌ ముఖం చూడని ఆ జట్టు.. ఈసారైనా రాత మారుతుందన్న ఆశతో మరోసారి కెప్టెన్‌ను మార్చింది. శిఖర్‌ ధావన్‌కు బాధ్యతలు అప్పగించింది. కానీ 2023లో పంజాబ్‌పై అంచనాలైతే లేవు.కోట్లు పోసి కొనుక్కున్న సామ్‌ కరన్‌తో పాటు రబాడ, కెప్టెన్‌ ధావన్‌ ఏమేరకు జట్టును ఉత్తేజపరుస్తారో చూడాలి. స్టార్‌ బ్యాటర్‌ బెయిర్‌స్టో దూరం కావడం ఈ జట్టుకు పెద్ద దెబ్బ.


దిల్లీ ఈసారైనా..

పీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ (అప్పట్లో డేర్‌డెవిల్స్‌) ప్రస్ధానం ఘనంగానే ఆరంభమైంది. తొలి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. రెండో సీజన్లోనైతే టేబుల్‌ టాపర్‌. కానీ ఆ తర్వాత ప్రదర్శనే తీసికట్టు. మంచి ఆటగాళ్లున్నా మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమైంది. 2010 నుంచి 2018 వరకు ఒక్కసారి (2012) మినహా ఎప్పుడూ లీగ్‌ దశ దాటలేకపోయింది. అస్థిరత ఆ జట్టును వెంటాడుతూనే ఉంటుంది. సెహ్వాగ్‌, శిఖర్‌ ధావన్‌ లాంటి ఆటగాళ్లు కూడా దిల్లీని పైకి తీసుకెళ్లలేకపోయారు. వేలంలో సరైన ఆటగాళ్లను తీసుకోకపోవడం, సమతూకం లోపించడం దిల్లీని దెబ్బతీశాయి. అయితే దిల్లీ ఇప్పుడు బలంగానే ఉంది. యువ ఆటగాళ్ల చేరిక, కోచ్‌గా పాంటింగ్‌ నియమితుడయ్యాక గత కొన్నేళ్లలో పుంజుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో 2020లో చక్కని ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. నిరుడు పంత్‌ నేతృత్వంలో ప్లేఆఫ్‌ దశకు చేరలేకపోయినా.. ఈసారి మంచి అంచనాలతో బరిలోకి దిగుతోంది దిల్లీ. ప్రమాదంలో గాయపడ్డ కెప్టెన్‌ పంత్‌ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. కానీ వార్నర్‌, పృథ్వీ షా, నోకియా, మిచెల్‌ మార్ష్‌, అక్షర్‌ పటేల్‌ వంటి వారితో బలంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు వార్నర్‌ నాయకత్వం వహిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు