IPL 2023: తొలి మెరుపులు ఎవరివో?

ఐపీఎల్‌ సీజన్‌ వస్తుందంటే చాలు ఆ సందడి మరోస్థాయికి చేరుకుంటుంది. ఏ జట్టు ఎలా ఉంది? ఏ జట్టులో ఏ ఆటగాళ్లున్నారు?కొత్తగా వచ్చే మార్పులేంటి? తొలిసారి లీగ్‌లో అడుగుపెట్టబోతున్న క్రికెటర్లు ఎవరు? ఇలా క్రికెట్‌ ప్రేమికుల ఆలోచనలన్నీ ఐపీఎల్‌ చుట్టూనే!

Updated : 30 Mar 2023 08:35 IST

రేపటి నుంచే ఐపీఎల్‌-16

ఈనాడు క్రీడావిభాగం

ఐపీఎల్‌ సీజన్‌ వస్తుందంటే చాలు ఆ సందడి మరోస్థాయికి చేరుకుంటుంది. ఏ జట్టు ఎలా ఉంది? ఏ జట్టులో ఏ ఆటగాళ్లున్నారు?కొత్తగా వచ్చే మార్పులేంటి? తొలిసారి లీగ్‌లో అడుగుపెట్టబోతున్న క్రికెటర్లు ఎవరు? ఇలా క్రికెట్‌ ప్రేమికుల ఆలోచనలన్నీ ఐపీఎల్‌ చుట్టూనే! ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్ఠాత్మక లీగ్‌లో అడుగుపెట్టి ఆటతో అదరగొట్టి అవకాశాలు, ఆదరాభిమానాలు సంపాదించుకున్న వాళ్లు ఎంతో మంది. ఈ ఏడాది కూడా తొలిసారి లీగ్‌లో ఆడేందుకు అటు అంతర్జాతీయ స్టార్లు.. ఇటు దేశవాళీ కుర్రాళ్లు సిద్ధమయ్యారు. మరి వాళ్లెవరో చూసేద్దాం పదండి!


నిలబడితే...

ఈ ఏడాది జనవరి 18న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో టీమ్‌ఇండియాతో వన్డేలో న్యూజిలాండ్‌ ఆటగాడు మైకెల్‌ బ్రాస్‌వెల్‌ మెరుపులు అంత సులభంగా మర్చిపోలేం. 350 పరుగుల ఛేదనలో 78 బంతుల్లోనే 140 పరుగులు చేసిన అతను.. భారత్‌ను దాదాపు ఓడించినంత పని చేశాడు. క్రీజులో నిలబడితే అలవోకగా సిక్సర్లు బాదగలిగే బ్రాస్‌వెల్‌ ఇప్పుడు ఐపీఎల్‌లో వినోదం పంచేందుకు ఎదురు చూస్తున్నాడు. నిరుడు వేలంలో ఈ ఆల్‌రౌండర్‌ అమ్ముడుపోలేదు. కానీ రూ.3.20 కోట్లతో కొనుగోలు చేసిన ఇంగ్లాండ్‌ ఆటగాడు విల్‌ జాక్స్‌కు గాయమవడంతో.. అతని స్థానాన్ని బ్రాస్‌వెల్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు భర్తీ చేసింది. ఎలాంటి భయం లేకుండా పవర్‌ హిట్టింగ్‌ చేసే బ్రాస్‌వెల్‌ ఉపయుక్తమైన ఆఫ్‌స్పిన్నర్‌ కూడా. అతను ఈ సీజన్‌లో ఆర్సీబీకి కీలకంగా మారతాడనే అంచనాలున్నాయి. మొత్తం 117 టీ20ల్లో అతను 2284 పరుగులు చేశాడు. ఇంకా జోష్‌ లిటిల్‌ (గుజరాత్‌ టైటాన్స్‌), మాథ్యూ షార్ట్‌, సికందర్‌ రజా (పంజాబ్‌ కింగ్స్‌), సిసాంద మగాలా (చెన్నై సూపర్‌ కింగ్స్‌), ఫిల్‌ సాల్ట్‌ (దిల్లీ క్యాపిటల్స్‌) కూడా ఐపీఎల్‌ అరంగేట్రం చేయబోతున్నారు.


దేశవాళీ పేసర్‌..

ముఖేష్‌ కుమార్‌.. ఇప్పటికే భారత దేశవాళీ క్రికెట్లో మార్మోగుతున్న పేరిది. 29 ఏళ్ల ఈ బెంగాల్‌ పేసర్‌ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 39 మ్యాచ్‌ల్లో 21.55 సగటుతో 149 వికెట్లు పడగొట్టాడు. 23 టీ20ల్లో 23.68 సగటుతో 25 వికెట్లు తీసుకున్నాడు. ఈ ప్రదర్శనే అతని కోసం వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ ఏకంగా రూ.5.5 కోట్లు ఖర్చు పెట్టేందుకు కారణమైంది. భారత పిచ్‌లపై ఉత్తమంగా రాణిస్తున్న ఈ పేసర్‌ ఇప్పటికే ఒకసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో సిరీస్‌ కోసం అతణ్ని ఎంపిక చేశారు. కానీ తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. నిరుడు రంజీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీలో అదరగొట్టిన అతను ఇప్పుడు ఐపీఎల్‌లోనూ మెరిస్తే జాతీయ జట్టుకు ఆడడం ఖాయమే! మరోవైపు వివ్రాంత్‌ శర్మ, మయాంక్‌ దగర్‌ (సన్‌రైజర్స్‌), విద్వత్‌ (పంజాబ్‌) లాంటి భారత కుర్రాళ్లు అవకాశం దొరికితే సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు.


మన కుర్రాళ్లు..

ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి సత్తాచాటేందుకు తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లూ ఎదురు చూస్తున్నారు. మైదానంలో బరిలో దిగే అవకాశం వస్తే తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిరుడు భారత్‌ అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌ను వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంది. తిరిగి చెన్నైతో చేరిన హైదరాబాద్‌ క్రికెటర్‌ భగత్‌ వర్మ ఈ సారైనా మైదానంలో దిగుతాడేమో చూడాలి. ఇక విశాఖ ఆటగాడు నితీశ్‌కుమార్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఆడేందుకు ఉత్సాహంతో ఉన్నాడు.


ఆల్‌రౌండ్‌ ఆటగాడు..

ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న యువ ఆటగాళ్ల పేర్లలో కామెరూన్‌ గ్రీన్‌ ఒకటి. ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలతో ఈ ఆస్ట్రేలియా క్రికెటర్‌ జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు భారత పర్యటనలో టీ20ల్లో అదరగొట్టాడు. ఇటీవల బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో చివరి టెస్టులో శతకమూ సాధించాడు. మంచి వేగంతో ఫాస్ట్‌ బౌలింగ్‌ వేయడంతో పాటు మెరుపు సిక్సర్లతో విరుచుకుపడే అతణ్ని.. గతేడాది వేలంలో ముంబయి ఇండియన్స్‌ ఏకంగా రూ.17.5 కోట్లు వెచ్చించడం తనకున్న డిమాండ్‌కు నిదర్శనం. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పలికిన రెండో ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. మాజీ ఆటగాడు పొలార్డ్‌ స్థానాన్ని గ్రీన్‌తో భర్తీ చేయాలని ముంబయి చూస్తోంది. ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న అతను.. అంచనాలను అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటివరకూ ఆడిన 8 అంతర్జాతీయ టీ20ల్లో అతను 173.75 స్ట్రైక్‌రేట్‌తో 139 పరుగులు చేశాడు.


సూపర్‌ ఫామ్‌తో..

ఇంగ్లాండ్‌ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ సూపర్‌ ఫామ్‌తో ఐపీఎల్‌ బరిలో దిగుతున్నాడు. టెస్టుల్లో అసాధారణ బ్యాటింగ్‌ నైపుణ్యాలతో అలరిస్తున్న అతను.. మిగతా ఫార్మాట్లోనూ ఉత్తమంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ మొత్తంగా 99 టీ20లాడిన అనుభవం అతని సొంతం. అందులో 148.38 స్ట్రైక్‌రేట్‌తో 2432 పరుగులు చేశాడు. గొప్ప ప్రతిభ ఉంది కాబట్టే అతని కోసం వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరకు ఈ 24 ఏళ్ల బ్యాటర్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.13.25 కోట్ల భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ పరీక్షకు సిద్ధమవుతున్న అతను సన్‌రైజర్స్‌కు మిడిలార్డర్‌లో ఉపయోగపడగలడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మెరుపు ముగింపులు ఇవ్వడంతో పాటు ఛేదనలోనూ కీలకంగా మారగలడని జట్టు భావిస్తోంది.


ఇన్నాళ్లకు ఛాన్స్‌..

అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ ఇన్నాళ్లకు ఐపీఎల్‌లో కనిపించబోతున్నాడు. ఈ సీజన్‌తోనే లీగ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. అతని నైపుణ్యాలు, బ్యాటింగ్‌ ప్రదర్శన, రికార్డుల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. వేలంలో కోటి రూపాయలకు రాజస్థాన్‌ రాయల్స్‌ అతణ్ని దక్కించుకుంది. అతని రాకతో ఆ జట్టు మిడిలార్డర్‌ బలంగా మారే అవకాశం ఉంది. నిలకడగా రాణించే అతని లాంటి అనుభవజ్ఞుడైన బ్యాటర్‌ కోసమే రాజస్థాన్‌ చూస్తోంది. రూట్‌ 32 అంతర్జాతీయ టీ20ల్లో 893 పరుగులు చేశాడు. అయితే యువ ఆటగాళ్ల వేగాన్ని అందుకునేలా, లీగ్‌లో జట్టు అవసరాలకు అనుగుణంగా తన బ్యాటింగ్‌ను అతను ఎలా మార్చుకుంటాడన్నది ఆసక్తికరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు