సిరీస్‌ కివీస్‌దే

శ్రీలంకతో వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్‌ కైవసం చేసుకుంది. శుక్రవారం మూడో వన్డేలో కివీస్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది. తొలుత శ్రీలంక 41.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.

Updated : 01 Apr 2023 04:31 IST

నేరుగా ప్రపంచకప్‌ బెర్తుకు దూరమైన శ్రీలంక

వెల్లింగ్టన్‌: శ్రీలంకతో వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్‌ కైవసం చేసుకుంది. శుక్రవారం మూడో వన్డేలో కివీస్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది. తొలుత శ్రీలంక 41.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. నిశాంక (57), కెప్టెన్‌ శానక (31) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించారు. కివీస్‌ బౌలర్లు మాట్‌ హెన్రీ (3/14), హెన్రీ షిప్లీ (3/32), డరైల్‌ మిచెల్‌ (3/32) విజృంభించి శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. లక్ష్యాన్ని కివీస్‌ 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విల్‌ యంగ్‌ (86 నాటౌట్‌), హెన్రీ నికోల్స్‌ (44 నాటౌట్‌) అయిదో వికెట్‌కు అజేయంగా 100 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ ఓటమితో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని శ్రీలంక కోల్పోయింది. ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌ పట్టికలో 81 పాయింట్లతో శ్రీలంక తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మొదటి 8 స్థానాల్లో ఉన్న జట్లకు నేరుగా ప్రపంచకప్‌ బెర్తులు లభిస్తాయి. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌ (88), దక్షిణాఫ్రికా (78), ఐర్లాండ్‌ (68) చివరి బెర్తు కోసం రేసులో ఉన్నాయి. నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా రెండు వన్డేలు, బంగ్లాదేశ్‌తో ఐర్లాండ్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనున్నాయి. నేరుగా అర్హత సాధించే అవకాశం కోల్పోయిన శ్రీలంక ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో ఆడనుంది. పది జట్ల మధ్య జరిగే ఆ టోర్నీ నుంచి రెండు జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు