RCB vs DC: ఓటమి నం.5.. దిల్లీకి మళ్లీ భంగపాటే

ఐపీఎల్‌లో 21 మ్యాచ్‌లు పూర్తయ్యాయి.. మిగతా జట్లన్నీ బోణీ కొట్టేశాయి.. కానీ అందరికంటే ఎక్కువగా అయిదు మ్యాచ్‌లు ఆడిన దిల్లీ క్యాపిటల్స్‌ ఇంకా ఖాతానే తెరవలేదు. శనివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలోనూ ఆ జట్టుకు భంగపాటు తప్పలేదు.

Updated : 16 Apr 2023 08:06 IST

మెరిసిన విరాట్‌, వైశాఖ్‌
బెంగళూరు విజయం
బెంగళూరు

ఐపీఎల్‌లో 21 మ్యాచ్‌లు పూర్తయ్యాయి.. మిగతా జట్లన్నీ బోణీ కొట్టేశాయి.. కానీ అందరికంటే ఎక్కువగా అయిదు మ్యాచ్‌లు ఆడిన దిల్లీ క్యాపిటల్స్‌ ఇంకా ఖాతానే తెరవలేదు. శనివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలోనూ ఆ జట్టుకు భంగపాటు తప్పలేదు. 200కు పైగా పరుగులు చేసేలా కనిపించిన బెంగళూరును 174కే కట్టడిచేసినా.. ఆ లక్ష్యాన్ని ఛేదించగల బ్యాటర్లు జట్టులో ఉన్నా దిల్లీ క్యాపిటల్స్‌ రాత మారలేదు. ఈ సీజన్‌లో చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి వరుసగా మూడో అర్ధశతకం బాదిన వేళ.. ఐపీఎల్‌ అరంగేట్రంలో యువ పేసర్‌ విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ అదరగొట్టిన తరుణాన.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుదే విజయం. వరుసగా రెండు ఓటముల తర్వాత ఆ జట్టు గెలుపు రుచి చూసింది.

పీఎల్‌-16లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మళ్లీ విజయాల బాట పట్టింది. శనివారం 23 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. విరాట్‌ కోహ్లి (50; 34 బంతుల్లో 6×4, 1×6) అర్ధశతకంతో సత్తాచాటడంతో మొదట ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. క్యాపిటల్స్‌ బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ (2/23), మిచెల్‌ మార్ష్‌ (2/18) ప్రత్యర్థికి కళ్లెం వేశారు. ఛేదనలో దిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులే చేయగలిగింది. మనీశ్‌ పాండే (50; 38 బంతుల్లో 5×4, 1×6) పోరాటం వృథా అయింది. విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ (3/20)తో పాటు సిరాజ్‌ (2/23) కూడా రాణించాడు.

కుర్రాడు అదుర్స్‌..: బెంగళూరును అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే కట్టడి చేశామనే ఆనందం దిల్లీకి ఎక్కువసేపు నిలవలేదు. ఆ జట్టు ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరే అందుకు కారణం. ఒక్క పరుగుకే రెండు వికెట్లు.. రెండు పరుగులకే మూడు వికెట్లు.. పవర్‌ప్లే చివరకు 32/4. ముస్తాఫిజుర్‌ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన   పృథ్వీ షా (0) ఆడింది రెండు బంతులే. బ్యాటింగ్‌లో నిరాశపర్చిన అనుజ్‌. ఫీల్డింగ్‌లో మెరుపు త్రోతో పృథ్వీని రనౌట్‌ చేశాడు. వరుస ఓవర్లలో మార్ష్‌ (0), యశ్‌ ధూల్‌ (1) పెవిలియన్‌ చేరిపోయారు. ఆ తర్వాత బౌలింగ్‌లో వైవిధ్యంతో యువ పేసర్‌ వైశాఖ్‌ దిల్లీ పనిపట్టాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో పోరాడే వార్నర్‌ (19)ను తన తొలి ఓవర్లోనే ఔట్‌ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు. 9 ఓవర్లకు 53/5తో దిల్లీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మరోవైపు పట్టుదలగా క్రీజులో నిలిచిన మనీశ్‌కు సహకరించే బ్యాటర్‌ కరవయ్యాడు. ఓ మూడు ఫోర్లతో అలరించిన అక్షర్‌ (21) కథకు వైశాఖ్‌ ముగింపు పలికాడు. మనీశ్‌ మాత్రం బౌండరీలతో సాగాడు. హసరంగ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదాడు. కానీ అదే ఓవర్లో అర్ధశతకం అందుకున్న అతణ్ని హసరంగ ఎల్బీగా ఔట్‌ చేయడంతో దిల్లీ పనైపోయింది. నోకియా (23 నాటౌట్‌), కుల్‌దీప్‌ (7 నాటౌట్‌) కలిసి ఆ జట్టును ఆలౌట్‌ కాకుండా చూశారు.

కోహ్లి ఒక్కడే..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్‌లో కోహ్లి ఆటే హైలైట్‌. కానీ అతనిచ్చిన మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను పేలవంగా ముగించింది. తొలి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో కోహ్లి పరుగుల వేట మొదలైంది. మార్ష్‌ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌లో అమన్‌ గాల్లోకి ఎగిరి చక్కటి క్యాచ్‌ అందుకోవడంతో డుప్లెసిస్‌ (22) పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాతి బంతికే మహిపాల్‌ లామ్రోర్‌ (26) కూడా ఔటవాల్సింది. కానీ అతనిచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను మనీశ్‌ పాండే పట్టలేకపోయాడు. దీంతో 47/1తో ఆర్సీబీ పవర్‌ప్లే ముగించింది. అక్కడి నుంచి మహిపాల్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ నడిపించాడు. సొగసైన కవర్‌డ్రైవ్‌లు, అందమైన కట్‌ షాట్లు, ఆకట్టుకునే స్ట్రెయిట్‌ డ్రైవ్‌లతో కోహ్లి అలరించాడు. తన బౌలింగ్‌లోనే కోహ్లి బలంగా కొట్టిన బంతిని కుల్‌దీప్‌ అందుకోలేకపోయాడు. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో బ్యాక్‌ఫుట్‌పై బలంగా నిలబడి ఫ్లిక్‌తో కోహ్లి కొట్టిన సిక్సర్‌ చూడాల్సిందే. కానీ అర్ధశతకం తర్వాత అతను ఫుల్‌టాస్‌ను భారీషాట్‌ ఆడే ప్రయత్నంలో బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డర్‌కు చిక్కాడు. మ్యాక్స్‌వెల్‌ (24) వస్తూనే సిక్సర్ల బాట పట్టడం, మహిపాల్‌ కూడా జోరు ప్రదర్శించడంతో 12 ఓవర్లకు 110/2తో ఉన్న ఆర్సీబీ.. మరోసారి 200 పరుగులు చేస్తుందనిపించింది. కానీ టపటపా నాలుగు వికెట్లు పడగొట్టిన దిల్లీ బౌలర్లు ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు. మొదట మహిపాల్‌ను మార్ష్‌ వెనక్కిపంపాడు. హర్షల్‌ (6)ను 14వ ఓవర్‌ చివరి బంతికి అక్షర్‌ (1/25) ఔట్‌ చేయగా.. గూగ్లీలతో మాయ చేసిన కుల్‌దీప్‌ 15వ ఓవర్‌ తొలి రెండు బంతుల్లో వరుసగా మ్యాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తీక్‌ (0)ను బలి తీసుకున్నాడు. 15 ఓవర్లకు 134/6తో నిలిచిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. అప్పటికే ఔటైన మహిపాల్‌ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అనుజ్‌ (15 నాటౌట్‌; 22 బంతుల్లో 1×4) బ్యాటింగ్‌లో తడబడ్డాడు. కనీసం బంతికో పరుగు చొప్పునా చేయలేకపోయాడు. మరో ఎండ్‌లో షాబాజ్‌ (20 నాటౌట్‌) కొన్ని షాట్లు ఆడడంతో జట్టు స్కోరు 170 దాటింది.


బ్యాటర్‌గా మొదలెట్టి..

ఆ కుర్రాడు బ్యాటర్‌గా అందులోనూ ఓపెనర్‌గా కెరీర్‌ మొదలెట్టాడు. ఓ వైపు బ్యాటింగ్‌ చేస్తూనే.. అప్పుడప్పుడూ పేస్‌ బౌలింగ్‌ వేసేవాడు. కానీ అండర్‌-17లో ఆడేటప్పుడు కోచ్‌ విసిరిన సవాలుతో అతని జీవితమే మారిపోయింది. పూర్తిస్థాయిలో ఫాస్ట్‌బౌలర్‌గా మారిన అతనే.. ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన 26 ఏళ్ల విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌. మొదట్లో పూర్తిగా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టిన అతను అప్పుడప్పుడూ ఫాస్ట్‌బౌలింగ్‌ వేసేవాడు. అతనిలోని పేసర్‌ను గుర్తించిన కోచ్‌ రామన్‌.. ఆ బౌలర్‌ను బయటకు తేవాలని సవాలు విసిరాడు. అధిక బరువుతో ఉన్నావని, వేగంగా బౌలింగ్‌ చేయలేవని వైశాఖ్‌తో తరచూ అంటుండేవాడు. దీంతో కసిగా బౌలింగ్‌పై దృష్టి పెట్టిన అతను.. ఇప్పుడు అత్యధిక వేగంతో బౌలింగ్‌ చేసే కర్ణాటక పేసర్లలో ఒకడిగా ఎదిగాడు. 2022-23 రంజీ సీజన్‌లో  31 వికెట్లతో కర్ణాటక తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కానీ నిరుడు ఐపీఎల్‌లో వేలంలో అతణ్ని ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంతో నిరాశ చెందాడు. ఒక్క అవకాశం కోసం ఎదురు చూశాడు. గాయంతో సీజన్‌కు దూరమైన రజత్‌ పటీదార్‌ స్థానంలో వైశాఖ్‌ను ఆర్సీబీ తీసుకుంది. ఇప్పుడు తొలి మ్యాచ్‌లోనే ఉత్తమ ప్రదర్శనతో జట్టును ఓటమి నుంచి బయటపడేశాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్లో డెలివరీ, నకుల్‌ బంతులతో వికెట్లు సాధించాడు. ఆర్సీబీ తరపున అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు.


బెంగళూరు: కోహ్లి (సి) యశ్‌ ధుల్‌ (బి) లలిత్‌ 50; డుప్లెసిస్‌ (సి) అమన్‌ (బి) మార్ష్‌ 22; మహిపాల్‌ (సి) అభిషేక్‌ (బి) మార్ష్‌ 26; మ్యాక్స్‌వెల్‌ (సి) వార్నర్‌ (బి) కుల్‌దీప్‌ 24; హర్షల్‌ (సి) అభిషేక్‌ (బి) అక్షర్‌ 6; షాబాజ్‌ నాటౌట్‌ 20; దినేశ్‌ కార్తీక్‌ (సి) లలిత్‌ (బి) కుల్‌దీప్‌ 0; అనుజ్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 174; వికెట్ల పతనం: 1-42, 2-89, 3-117, 4-132, 5-132, 6-132; బౌలింగ్‌: నోకియా 4-0-31-0; అక్షర్‌ 3-0-25-1; ముస్తాఫిజుర్‌ 3-0-41-0; మిచెల్‌ మార్ష్‌ 2-0-18-2; లలిత్‌ యాదవ్‌ 4-0-29-1; కుల్‌దీప్‌ యాదవ్‌ 4-1-23-2

దిల్లీ: వార్నర్‌ (సి) కోహ్లి (బి) వైశాఖ్‌ 19; పృథ్వీ షా రనౌట్‌ 0; మిచెల్‌ మార్ష్‌ (సి)  కోహ్లి (బి) పార్నెల్‌ 0; యశ్‌ ధూల్‌ ఎల్బీ (బి) సిరాజ్‌ 1; మనీశ్‌ పాండే ఎల్బీ (బి) హసరంగ 50; అభిషేక్‌ పోరెల్‌ (సి) పార్నెల్‌ (బి) హర్షల్‌ 5; అక్షర్‌ (సి) సిరాజ్‌ (బి) వైశాఖ్‌ 21; అమన్‌ (సి) కోహ్లి (బి) సిరాజ్‌; 18; లలిత్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) వైశాఖ్‌ 4; నోకియా నాటౌట్‌ 23; కుల్‌దీప్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151; వికెట్ల పతనం: 1-1, 2-1, 3-2, 4-30, 5-53, 6-80, 7-98, 8-110, 9-128; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-23-2; పార్నెల్‌ 4-0-28-1; విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ 4-0-20-3; షాబాజ్‌ అహ్మద్‌ 1-0-11-0; హసరంగ 3-0-37-1; హర్షల్‌ 4-0-32-1


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు