PBKS vs RCB: సిరాజ్.. మెరుపులా
ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ గాలులు.. ఆకాశంలో మెరుపులు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఛేదనలో పరిస్థితి ఇది.
పంజాబ్‌పై బెంగళూరు విజయం
రాణించిన డుప్లెసిస్, కోహ్లి
విజృంభించిన హైదరాబాదీ పేసర్
ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ గాలులు.. ఆకాశంలో మెరుపులు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఛేదనలో పరిస్థితి ఇది. ఆ మెరుపుల మధ్య మైదానంలో మెరుపులా విజృంభించాడు మహమ్మద్ సిరాజ్. కొత్త బంతితో ఆరంభంలో పంజాబ్‌ను దెబ్బకొట్టి.. పాతబంతితో ఆఖర్లో ప్రత్యర్థి పనిపట్టి.. ఫీల్డింగ్‌లోనూ సత్తాచాటి జట్టును గెలిపించాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో డుప్లెసిస్, కోహ్లి రాణించారు. పంజాబ్ బౌలర్లు ధాటికి అనుకున్న దానికంటే తక్కువ స్కోరే చేసిన ఆర్సీబీ.. సిరాజ్ చెలరేగడంతో ప్రత్యర్థిని చిత్తుచేసి.. ఆరు మ్యాచ్‌ల్లో మూడో విజయాన్ని అందుకుంది.
మొహాలి
ఐపీఎల్-16లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. మొదట ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. డుప్లెసిస్ (84; 56 బంతుల్లో 5×4, 5×6), కోహ్లి (59; 47 బంతుల్లో 5×4, 1×6) తొలి వికెట్‌కు 137 పరుగులు జోడించారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ (2/31) మెరిశాడు. ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ (4/21) దెబ్బకు పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (46; 30 బంతుల్లో 3×4, 4×6), జితేశ్ శర్మ (41; 27 బంతుల్లో 2×4, 3×6) పోరాటం సరిపోలేదు.
హడలెత్తించాడు..: ఆర్సీబీ ఇన్నింగ్స్‌కు పూర్తి విరుద్ధంగా పంజాబ్ ఛేదన మొదలైంది. 16 ఓవర్ల వరకూ బెంగళూరుది ఒక్క వికెట్ కూడా పడలేదు. కానీ పంజాబ్ 10 ఓవర్లలోపే సగం వికెట్లు కోల్పోయింది. ఆ జట్టును సిరాజ్ హడలెత్తించాడు. గాయం నుంచి కోలుకుంటున్న ధావన్ లేని టాప్‌ఆర్డర్‌ను ఓ ఆటాడుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే అథర్వ (4)ను పెవిలియన్ చేర్చి వికెట్ల పతనాన్ని సిరాజ్ మొదలెట్టాడు. మూడో ఓవర్లోనే బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ హసరంగ (2/39) గూగ్లీతో షార్ట్ (8)ను బోల్తా కొట్టించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన లివింగ్‌స్టోన్ (2)ను సిరాజ్ కుదురుకోనీయలేదు. చక్కటి బంతితో అతణ్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టిన సిరాజ్.. సూపర్ త్రోతో హర్‌ప్రీత్ సింగ్ (13)ను వెనక్కిపంపించాడు. మిడాఫ్‌లోకి బంతిని పంపిన ప్రభ్‌సిమ్రన్.. పరుగు కోసం క్రీజు దాటిన హర్‌ప్రీత్‌ను వెనక్కిపంపాడు. కానీ ఆ లోపే మెరుపు వేగంతో సిరాజ్ స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. దీంతో 6 ఓవర్లకు పంజాబ్ 49/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ సామ్ కరన్ (10)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ప్రభ్‌సిమ్రన్.. హసరంగ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. కానీ బద్దకంగా పరుగెత్తిన కరన్.. హసరంగ త్రోకు నిష్క్రమించడంతో మళ్లీ వికెట్ల పతనం మొదలైంది. ప్రభ్‌సిమ్రన్ పోరాటానికి పార్నెల్ (1/32) తెరదించగా.. షారుక్ ఖాన్ (7) ఇలా వచ్చి అలా వెళ్లాడు. కానీ జితేశ్ సిక్సర్ల బాటలో సాగడం.. విజయానికి చివరి 4 ఓవర్లలో 37 పరుగులు అవసరమవడంతో పంజాబ్ ఆశలు వదులుకోలేదు. హర్షల్ బౌలింగ్‌లో జితేశ్ క్యాచ్‌ను కోహ్లి అందుకోలేకపోయాడు. కానీ మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్ 18వ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చి హర్‌ప్రీత్ బ్రార్ (13), ఎలిస్ (1)ను బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే జితేశ్‌ను స్లో డెలివరీతో హర్షల్ (1/22) బుట్టలో వేసుకోవడంతో పంజాబ్ కథ ముగిసింది.
ఆ ఇద్దరి జోరు..: అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్ మలుపులతో సాగింది. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ దూకుడుతో మెరుగ్గా ఆరంభమైన ఇన్నింగ్స్.. మధ్యలో నెమ్మదించింది. పంజాబ్ బౌలర్లు పుంజుకోవడంతో ఊహించిన ముగింపు దక్కలేదు. సీఎస్కేతో మ్యాచ్‌లో నిరాశపర్చిన కోహ్లి తిరిగి పరుగుల బాట పట్టాడు. పూర్తి ఫిట్‌నెస్ లేకపోయినా డుప్లెసిస్ సిక్సర్లతో అలరించడంతో పవర్‌ప్లేను ఆర్సీబీ 59/0తో ముగించింది. కానీ ఆ తర్వాత కోహ్లి నెమ్మదించాడు. ఓ ఎండ్‌లో డుప్లెసిస్ ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పటికీ.. మరో ఎండ్‌లో కోహ్లి బౌండరీలు సాధించడానికి ఇబ్బంది పడ్డాడు. 11 ఓవర్లకు 98/0తో నిలిచిన ఆర్సీబీ 200 పరుగులు చేసేలా కనిపించింది. కానీ క్రమశిక్షణతో కట్టుదిట్టంగా బంతులేసిన బౌలర్లు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఒక్కసారిగా నెమ్మదించినట్లు కనిపించిన పిచ్‌పై పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ బౌలర్లు పుంజుకున్నారు. మధ్యలో 18 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఆ విరామానికి ముగింపు పలుకుతూ ఫోర్‌తో కోహ్లి 40 బంతుల్లో అర్ధసెంచరీ చేరుకున్నాడు. కానీ 16వ ఓవర్లో హర్‌ప్రీత్ వరుస బంతుల్లో కోహ్లి, మ్యాక్స్‌వెల్ (0)ను ఔట్ చేసి ఆర్సీబీని దెబ్బకొట్టాడు. మొదట ప్యాడిల్ స్వీప్ ఆడేందుకు కోహ్లి ప్రయత్నించాడు. అది ముందుగానే గమనించిన వికెట్ కీపర్ జితేశ్ తన ఎడమ వైపు కదిలి డైవ్ చేస్తూ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. సెంచరీ చేసేలా కనిపించిన డుప్లెసిస్ భారీషాట్‌కు ప్రయత్నించి ఎలిస్ (1/41) బౌలింగ్‌లో నిష్క్రమించాడు. దినేశ్ కార్తీక్ (7) విఫలమయ్యాడు. చివరి నాలుగు ఓవర్లలో 37 పరుగులు రాబట్టిన ఆర్సీబీ నాలుగు వికెట్లు కోల్పోయింది.
బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) జితేశ్ (బి) హర్‌ప్రీత్ 59; డుప్లెసిస్ (సి) కరన్ (బి) ఎలిస్ 84; మ్యాక్స్‌వెల్ (సి) అథర్వ (బి) హర్‌ప్రీత్ 0; దినేశ్ కార్తీక్ (సి) అథర్వ (బి) అర్ష్‌దీప్ 7; మహిపాల్ నాటౌట్ 7; షాబాజ్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174; వికెట్ల పతనం: 1-137, 2-137, 3-151, 4-163; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-34-1; హర్‌ప్రీత్ బ్రార్ 3-0-31-2; ఎలిస్ 4-0-41-1; సామ్ కరన్ 4-0-27-0; రాహుల్ చాహర్ 4-0-24-0; లివింగ్‌స్టోన్ 1-0-9-0
పంజాబ్ ఇన్నింగ్స్: అథర్వ ఎల్బీ (బి) సిరాజ్ 4; ప్రభ్‌సిమ్రన్ (బి) పార్నెల్ 46; షార్ట్ (బి) హసరంగ 8; లివింగ్‌స్టోన్ ఎల్బీ (బి) సిరాజ్ 2; హర్‌ప్రీత్ సింగ్ రనౌట్ 13; కరన్ రనౌట్ 10; జితేశ్ (సి) షాబాజ్ (బి) హర్షల్ 41; షారుక్ (స్టంప్డ్) కార్తీక్ (బి) హసరంగ 7; హర్‌ప్రీత్ బ్రార్ (బి) సిరాజ్ 13; ఎలిస్ (బి) సిరాజ్ 1; అర్ష్‌దీప్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (18.2 ఓవర్లలో ఆలౌట్) 150; వికెట్ల పతనం: 1-4, 2-20, 3-27, 4-43, 5-76, 6-97, 7-106, 8-147, 9-149; బౌలింగ్: సిరాజ్ 4-0-21-4; పార్నెల్ 3-0-32-1; హసరంగ 4-0-39-2; విజయ్‌కుమార్ 3-0-29-0; మ్యాక్స్‌వెల్ 1-0-5-0; హర్షల్ 3.2-0-22-1
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nobel Prize: రసాయన శాస్త్రంలో నోబెల్ వీరికే.. ప్రకటనకు ముందే ‘లీకుల’ కలకలం..!
-
Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!
-
HarishRao: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీశ్‌రావు
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు