LSG vs RCB: కొన్నే.. కాపాడుకుంది

బౌలర్ల హవా నడిచిన పోరులో బెంగళూరు మురిసింది. తక్కువ స్కోరే  చేసినా.. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై లఖ్‌నవూపై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 02 May 2023 07:27 IST

స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో బెంగళూరు పైచేయి

లక్ష్యం 127.. 108కే లఖ్‌నవూ ఆలౌట్‌

పరుగులు కష్టంగా వచ్చిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో బెంగళూరుదే పైచేయి. ఛేదనలో చతికిలపడ్డ లఖ్‌నవూకు కొంత లక్ష్యమే కొండంతైంది. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఆర్సీబీ 126 పరుగుల స్కోరును కాపాడుకుని టోర్నీలో అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

లఖ్‌నవూ

బౌలర్ల హవా నడిచిన పోరులో బెంగళూరు మురిసింది. తక్కువ స్కోరే  చేసినా.. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై లఖ్‌నవూపై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బెంగళూరు 9 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. డుప్లెసిస్‌ (44; 40 బంతుల్లో 1×4, 1×6), కోహ్లి (31; 30 బంతుల్లో 3×4) రాణించారు. రవి బిష్ణోయ్‌ (2/21), అమిత్‌ మిశ్రా (2/21), నవీనుల్‌ (3/30), కృనాల్‌ (0/21) ఆర్సీబీని కట్టడి చేశారు. ఛేదనలో లఖ్‌నవూ ఘోరంగా విఫలమైంది. కర్ణ్‌ శర్మ (2/20), హేజిల్‌వుడ్‌ (2/15) ఇతర బౌలర్లు విజృంభించడంతో 19.5 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. గౌతమ్‌  (23; 13 బంతుల్లో 1×4, 2×6) టాప్‌ స్కోరర్‌.

లఖ్‌నవూ చతికిల: మొదట బెంగళూరు పరుగుల కోసం కష్టపడితే స్వల్ప ఛేదనలో అంతకన్నా ఎక్కువ చెమటోడ్చింది లఖ్‌నవూ. చకచకా వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. రెండో బంతికే మేయర్స్‌ను సిరాజ్‌ ఔట్‌ చేయగా.. ఆ తర్వాత కృనాల్‌ (14), బదోని (4), దీపక్‌ హుడా (1), పూరన్‌ (9) క్యూ కట్టారు. ప్రమాదకర పూరన్‌ను కర్ణ్‌ అయిదో వికెట్‌గా వెనక్కి పంపేటప్పటికి లఖ్‌నవూ స్కోరు 7  ఓవర్లలో 38/5. అయితే గౌతమ్‌ చెలరేగడం, మరోవైపు స్టాయినిస్‌ (13; 19 బంతుల్లో 1×6) ఉండడంతో 65/5తో నిలిచిన లఖ్‌నవూలో ఆశలు రేగాయి. కానీ 11వ ఓవర్లో స్టాయినిస్‌ను కర్ణ్‌ ఔట్‌ చేయడం, తర్వాతి ఓవర్లో గౌతమ్‌ రనౌట్‌ కావడంతో ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. టెయిలెండర్లు అద్భుతాలేమీ చేయలేకపోయారు. 15వ ఓవర్లో బిష్ణోయ్‌ (5) ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించేటప్పటికి స్కోరు 77. మిశ్రా (19), నవీనుల్‌ (13) కాస్త పోరాడి, కాస్త ఆసక్తిరేపినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. రాహుల్‌ గాయం కూడా లఖ్‌నవూకు ప్రతికూలమైంది. ఆఖరి వికెట్‌గా అతడు క్రీజులోకి వచ్చినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరుగెత్తలేకపోవడంతో ఆఖరి ఓవర్లో అతడు స్ట్రైకింగ్‌కు వెళ్లలేకపోయాడు.

చెమటోడ్చిన ఛాలెంజర్స్‌: అంతకుముందు పరుగుల కోసం బెంగళూరు చెమటోడ్చింది. స్పిన్నర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ఏ పరుగూ అంత తేలిగ్గా రాలేదు. భారీ షాట్లు సాధ్యం కాకపోవడంతో బౌండరీలు ఎక్కువగా రాలేదు. ఫలితంగా స్కోరు బోర్డు మందకొడిగా సాగింది. అనుకూలిస్తున్న పిచ్‌పై కృనాల్‌, రవి బిష్ణోయ్‌, మిశ్రా, గౌతమ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లను పరీక్షించారు. ఏమాత్రం స్వేచ్ఛనివ్వలేదు. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌ కూడా పరుగుల కోసం కష్టపడ్డారు. కానీ తొలి వికెట్‌కు 9 ఓవర్లలో 62 పరుగులు జోడించి ఓ పునాది అయితే వేశారు. క్లిష్టమైన పిచ్‌పై అది కాస్త ఫర్వాలేదనిపించే ఆరంభమే. ఆ తర్వాత ఆట చూశాక ప్రారంభమే మెరుగు అనిపిస్తుంది. వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లు పెవిలియన్‌ బాట పట్టాడు. బ్యాటర్లు మరింతగా ఇబ్బందిపడ్డారే తప్ప ఏమాత్రం బ్యాట్‌ ఝుళిపించలేకపోయారు. ఓపెనర్లు కాకుండా ఒక్క దినేశ్‌ కార్తీక్‌ (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగాడు. బెంగళూరు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. కోహ్లి తొలి బంతినే బౌండరీకి తరలించాడు. కానీ  ఆ తర్వాతే పరుగుల వేట కష్టమైంది. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 42/0. వేగం పెంచడం కోసం 9వ ఓవర్‌ చివరి బంతికి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడబోయిన కోహ్లి గురి తప్పి స్టంపౌటయ్యాడు. స్పిన్నర్లు కట్టిపడేయడంతో అక్కడి నుంచి 15వ ఓవర్‌ వరకు బెంగళూరుకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఆ వ్యవధిలో కేవలం 30 పరుగులే చేసిన ఆర్సీబీ.. మూడు వికెట్లు (అనుజ్‌, మ్యాక్స్‌వెల్‌, ప్రభుదేశాయ్‌) వికెట్లను కూడా కోల్పోయింది. డుప్లెసిస్‌ 17వ ఓవర్లో వెనుదిరిగాడు. దినేశ్‌ కార్తీక్‌ ఓ ఫోర్‌, సిక్స్‌ కొట్టి ఔటయ్యాడు. మొత్తం మీద ఆఖరి ఓవర్లలోనూ బెంగళూరు ఇన్నింగ్స్‌ జోరందుకోలేదు. చివరి అయిదు ఓవర్లలో ఆర్సీబీ.. అయిదు వికెట్లు కోల్పోయి కేవలం 34 పరుగులు సాధించింది. నవీనుల్‌ హక్‌ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

రాహుల్‌, ఉనద్కత్‌లకు గాయాలు

ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ముందు భారత జట్టుకు నిరాశ కలిగించే వార్త. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడే భారత జట్టులో ఉన్న లఖ్‌నవూ సూపర్‌కింగ్స్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, జైదేవ్‌ ఉనద్కత్‌ గాయపడ్డారు. బెంగళూరుతో మ్యాచ్‌లో డుప్లెసిస్‌ షాట్‌ను అడ్డుకునే క్రమంలో రాహుల్‌ కుడి తొడకు.. ఈ మ్యాచ్‌కు ముందు నెట్‌ ప్రాక్టీస్‌లో ఉనద్కత్‌ ఎడమ భుజానికి గాయాలయ్యాయి. ఈ రెండు గాయాలు తీవ్రంగానే కనిపిస్తుండడం టీమ్‌ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ గాయాలతో వీళ్లిద్దరూ జూన్‌ 7న ఓవల్‌లో ఆరంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైతే యశస్వి జైస్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు జట్టులో చోటిచ్చే అవకాశం ఉంది. జైస్వాల్‌ను కాదనుకుంటే ఇషాన్‌కిషన్‌, అభిమన్యు ఈశ్వరన్‌లలో ఒకరిని చేర్చే ఛాన్స్‌ ఉంది.


బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (స్టంప్డ్‌) పూరన్‌ (బి) బిష్ణోయ్‌ 31; డుప్లెసిస్‌ (సి) కృనాల్‌ (బి) మిశ్రా 44; అనుజ్‌ (సి) మేయర్స్‌ (బి) గౌతమ్‌ 9; మ్యాక్స్‌వెల్‌ ఎల్బీ (బి) బిష్ణోయ్‌ 4;  ప్రభుదేశాయ్‌ (సి) గౌతమ్‌ (బి) మిశ్రా 6; కార్తీక్‌ రనౌట్‌ 16; లొమ్రార్‌ ఎల్బీ (బి) నవీనుల్‌ 3; హసరంగ నాటౌట్‌ 8; కర్ణ్‌ (సి) గౌతమ్‌ (బి) నవీనుల్‌ 2; సిరాజ్‌ (సి) పూరన్‌ (బి) నవీనుల్‌ 0; హేజిల్‌వుడ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 126; వికెట్ల పతనం: 1-62, 2-75, 3-80, 4-90, 5-109, 6-114, 7-117, 8-121, 9-121; బౌలింగ్‌: కృనాల్‌ పాండ్య 4-0-21-0; స్టాయినిస్‌ 1-0-11-0; నవీనుల్‌ 4-0-30-3; బిష్ణోయ్‌ 4-0-21-2; మిశ్రా 3-0-21-2; యశ్‌ 2-0-12-0; గౌతమ్‌ 2-0-10-1

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) రావత్‌ (బి) సిరాజ్‌ 0; బదోని (సి) కోహ్లి (బి) హేజిల్‌వుడ్‌ 4; కృనాల్‌ (సి) కోహ్లి (బి) మ్యాక్స్‌వెల్‌ 14; హుడా (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) హసరంగ 1; స్టాయినిస్‌ (సి) ప్రభుదేశాయ్‌ (బి) కర్ణ్‌ 13; పూరన్‌ (సి) లొమ్రార్‌ (బి) కర్ణ్‌ 9; గౌతమ్‌ రనౌట్‌ 23; బిష్ణోయ్‌ రనౌట్‌ 5; మిశ్రా (సి) కార్తీక్‌ (బి) హర్షల్‌ 19; నవీనుల్‌ (సి) కార్తీక్‌ (బి) హేజిల్‌వుడ్‌ 13; రాహుల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 108; వికెట్ల పతనం: 1-0, 2-19, 3-21, 4-27, 5-38, 6-65, 7-66, 8-77, 9-103; బౌలింగ్‌: సిరాజ్‌ 3-0-24-1; హేజిల్‌వుడ్‌ 3-0-15-2; మ్యాక్స్‌వెల్‌ 1-0-3-1; హసరంగ 4-0-20-1; కర్ణ్‌ 4-0-20-2; హర్షల్‌ 3.5-0-20-1; లొమ్రార్‌ 1-0-4-0


3

లఖ్‌నవూ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగట్టిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. బెంగళూరుపై రెండు వికెట్లు చేజిక్కించుకున్న అతడు.. మలింగ (170)ను అధిగమించాడు. మిశ్రా ఇప్పటివరకు 172 వికెట్లు పడగొట్టాడు. డ్వేన్‌ బ్రావో (183), చాహల్‌ (178) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని