Virat X Gambhir: కోహ్లీకి రూ.కోటి జరిమానా

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య పోరు సందర్భంగా వాగ్వాదానికి దిగిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, లఖ్‌నవూ మార్గనిర్దేశకుడు గౌతమ్‌ గంభీర్‌లకు భారీ జరిమానా పడింది.

Updated : 03 May 2023 06:45 IST

గంభీర్‌కు రూ.25 లక్షలు కోత
నవీనుల్‌కూ రిఫరీ శిక్ష
లఖ్‌నవూ

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య పోరు సందర్భంగా వాగ్వాదానికి దిగిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, లఖ్‌నవూ మార్గనిర్దేశకుడు గౌతమ్‌ గంభీర్‌లకు భారీ జరిమానా పడింది. ఐపీఎల్‌ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించిన కోహ్లి-గంభీర్‌లకు రిఫరీ.. మ్యాచ్‌ ఫీజులో 100 శాతం (లెవల్‌-2 నేరం) జరిమానా వేశాడు. విరాట్‌ మ్యాచ్‌కు రూ.1.07 కోట్ల చొప్పున ఫీజు అందుకుంటుండగా.. మెంటార్‌గా గంభీర్‌ మ్యాచ్‌కు రూ.25 లక్షలు అందుకుంటున్నాడు. విరాట్‌-గౌతి ఒకరినొకరు దూషించుకోవడం, బహిరంగంగా అనుచితంగా ప్రవర్తించడంతో ఐపీఎల్‌ ఈ శిక్షను విధించింది. వీరితో పాటు కోహ్లితో గొడవ పడిన లఖ్‌నవూ పేసర్‌ నవీనుల్‌ హక్‌కు ఫీజులో 50 శాతం కోత (లెవల్‌-1 నేరం) విధించారు.

మ్యాచ్‌ అనంతరం కోహ్లితో ఎల్‌ఎస్‌జీ ఆటగాడు కైల్‌ మేయర్స్‌ మాట్లాడుతుండగా.. గంభీర్‌ అతడిని పక్కకు లాక్కెళ్లడంతో గొడవ మొదలైంది. ఆ తర్వాత ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో నవీనుల్‌ హక్‌కు కోహ్లికి మధ్య మాటల యుద్ధం నడిచింది. మ్యాచ్‌లో నవీనుల్‌ ఔటైనపుడు విరాట్‌తో అతడికి వాగ్వాదం నడిచింది. విరాట్‌ తన బూట్‌ను చూపిస్తూ నవీనుల్‌ను ఏదో అన్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నవీనుల్‌.. మ్యాచ్‌ అయ్యాక విరాట్‌తో దురుసుగా మాట్లాడాడు. మేయర్స్‌ను గంభీర్‌ లాక్కెళ్లాక అతడికి, విరాట్‌కు వాగ్వాదం జరిగింది. ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్తుండగా.. చుట్టూ ఉన్న వారు సముదాయించే ప్రయత్నం చేశారు. ‘ఏదో మాట్లాడుతున్నావ్‌.. మాట్లాడు’ అని విరాట్‌తో గంభీర్‌ అంటే.. ‘నేనేమి నిన్ను అనలేదు.  మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ్‌’ అని విరాట్‌ బదులిచ్చినట్లు.. ‘మా ఆటగాళ్లను అంటే నన్ను అన్నట్లే’ అని గంభీర్‌ సమాధానం చెబితే.. ‘అయితే మీ ఆటగాళ్లను జాగ్రత్తగా చూసుకో’ అని విరాట్‌ అన్నట్ల్లు.. వీళ్లిద్దరి మధ్య సంభాషణను దగ్గరగా గమనించిన అధికారి ఒకరు వెల్లడించాడు. గొడవ పెద్దదవుతున్న స్థితిలో ఎల్‌ఎస్‌జీ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌, స్పిన్నర్‌ మిశ్రా కల్పించుకుని ఇద్దరినీ విడదీసి సముదాయించారు.


అక్కడ మొదలైంది

ఒకప్పుడు దిల్లీ జట్టులో సహచరులే అయిన కోహ్లి, గంభీర్‌లకు కొంతకాలంగా పడట్లేదు. పదేళ్ల క్రితం బెంగళూరు-కోల్‌కతా మ్యాచ్‌లోనూ వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. తాజా ఐపీఎల్‌లో ఆర్సీబీని లఖ్‌నవూ ఓడించడంతో ఆ జట్టు అభిమానుల వైపు చూస్తూ నోటి మీద వేలు వేసి రెచ్చగొట్టాడు గంభీర్‌. ఇదే మ్యాచ్‌లో అవేష్‌ ఖాన్‌ తీవ్ర ఆవేశంతో హెల్మెట్‌ను నేలకేసి కొట్టడం విమర్శలకు దారి తీసింది. తాజా మ్యాచ్‌లో లఖ్‌నవూపై ఆర్సీబీ పైచేయి సాధించడంతో విరాట్‌ రెచ్చిపోయాడు. కృనాల్‌ క్యాచ్‌ పట్టినపుడు ప్రేక్షకుల వైపు చూస్తూ గాల్లో ముద్దులు ఇచ్చాడు. అంతే కాక గంభీర్‌ లాగా నోటి మీద వేలు చూపించకూడదంటూ సంజ్ఞ చేశాడు. వికెట్‌ పడ్డ ప్రతిసారీ కోహ్లి సంబరాలు శ్రుతి మించాయి. ఆపై విరాట్‌, నవీనుల్‌ మధ్య మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానగా మారింది. మైదానంలో గొడవలు చాలవన్నట్లు కోహ్లి, నవీనుల్‌ హక్‌ సోషల్‌ మీడియాలో స్టేటస్‌లు పెట్టి వివాదాన్ని ఇంకా కొనసాగించారు.

‘‘ఎదుటి వాళ్లకు ఇచ్చినప్పుడు.. తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఇవ్వకూడదు’’ అని కోహ్లి స్టేటస్‌ పెడితే.. ‘‘సలహాలు తీసుకోవడానికి సిద్ధం. మర్యాద ఇవ్వడానికీ సిద్ధం. క్రికెట్‌ జంటిల్‌మన్‌ గేమ్‌. కానీ నువ్వు నా కాలి కింద అనే అర్థం వచ్చేలా మాట్లాడితే అది నన్ను కాదు మొత్తం మా దేశ ప్రజలను అన్నట్లు’’ అని నవీనుల్‌ తన స్టేటస్‌లో ఉంచాడు. మరోవైపు ఆర్సీబీ-ఎల్‌ఎస్‌జీ మధ్య జరిగిన గొడవలు క్రికెట్‌ పరువు తీసేలా ఉన్నాయని మాజీలు విమర్శించారు. ఒక క్రికెట్‌ సూపర్‌స్టార్‌.. మరో బాధ్యతగల పార్లమెంట్‌ సభ్యుడు ఇలా గల్లీ స్థాయిలో మాదిరి గొడవపడడం ఏమాత్రం బాగోలేదని అభిమానులు అంటున్నారు.


‘‘క్రికెట్‌ అంటే ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. వాటిని మైదానంలో చూపించాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. ఆర్సీబీ-ఎల్‌ఎస్‌జీ జట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవలు ఆమోదయోగ్యం కాదు. విరాట్‌-గౌతమ్‌ లాంటి స్థాయి ఆటగాళ్లు ఈ వివాదాల్లో భాగం కావడం నిరాశ కలిగిస్తోంది’’

భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే


‘‘ఒకప్పుడు నేను శ్రీశాంత్‌తో వ్యవహరించినదానికి ఇప్పుడూ సిగ్గుపడుతుంటా. కోహ్లి, గంభీర్‌ల మధ్య జరిగింది క్రికెట్‌కు మంచిది కాదు. ఆటలో ఇలాంటి గొడవలు సరికాదు’’

మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు