GT vs DC: దిల్లీ గట్టెక్కింది..

ఐపీఎల్‌లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకునే ట్రెండ్‌ కొనసాగుతోంది. మొన్న లఖ్‌నవూపై కేవలం 127 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని బెంగళూరు ఔరా అనిపిస్తే.. ఇప్పుడు గుజరాత్‌పై దిల్లీ 130 పరుగులే  చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది.

Updated : 03 May 2023 07:04 IST

స్వల్ప ఛేదనలో తడబడ్డ టైటాన్స్‌

ఐపీఎల్‌లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకునే ట్రెండ్‌ కొనసాగుతోంది. మొన్న లఖ్‌నవూపై కేవలం 127 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని బెంగళూరు ఔరా అనిపిస్తే.. ఇప్పుడు గుజరాత్‌పై దిల్లీ 130 పరుగులే  చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. 5 ఓవర్లలో 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి గొప్పగా పోరాడి, గౌరవప్రదమైన స్కోరును సాధించిన డీసీ.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో టైటాన్స్‌కు చెక్‌ పెట్టింది. 9 మ్యాచ్‌ల్లో మూడో విజయంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

అహ్మదాబాద్‌

ఆసక్తికర పోరులో దిల్లీ నిలిచింది. మంగళవారం 5 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై గెలిచింది. షమి (4/11) విజృంభించడంతో మొదట దిల్లీ 8 వికెట్లకు 130 పరుగులే చేయగలిగింది. అమన్‌ హకీమ్‌ ఖాన్‌ (51; 44 బంతుల్లో 3×4, 3×6) ఒత్తిడిలో విలువైన ఇన్నింగ్స్‌తో దిల్లీని ఆదుకున్నాడు. ఛేదనలో తడబడ్డ టైటాన్స్‌.. 6 వికెట్లకు 125 పరుగులే చేయగలిగింది. హార్దిక్‌ (59 నాటౌట్‌; 53 బంతుల్లో 7×4) టాప్‌ స్కోరర్‌. ఖలీల్‌ (2/24), ఇషాంత్‌ (2/23), కుల్‌దీప్‌ (1/15) టైటాన్స్‌ను దెబ్బతీశారు.

టైటాన్స్‌ కష్టంగా: చిన్న లక్ష్యాన్ని తేలిగ్గా ఛేదిస్తుందనుకుంటే టైటాన్స్‌ బోల్తా కొట్టింది. బ్యాటింగ్‌కు క్లిష్టంగా ఉన్న పిచ్‌పై పరుగుల కోసం చెమటోడ్చింది. వికెట్లు పోవడంతో పాటు భారీ షాట్లు ఆడడం కష్టం కావడంతో ఛేదనలో వెనుకబడిపోయింది. హార్దిక్‌ కడవరకూ క్రీజులో ఉన్నా ఫలితం లేకపోయింది. టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ కూడా దాదాపు దిల్లీలాగే ఆరంభమైంది. టైటాన్స్‌ ఎనిమిది ఓవర్లలో 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. సాహా (0), గిల్‌ (6), విజయ్‌ శంకర్‌ (6), మిల్లర్‌ (0) వెనుదిరిగారు. ఆ దశలో మనోహర్‌ (26; 33 బంతుల్లో 1×6)తో కలిసి హార్దిక్‌ జట్టును ఆదుకున్నాడు. కానీ భారీ షాట్లు కొట్టలేకపోవడంతో ఇన్నింగ్స్‌ మందకొడిగా సాగింది. 16 ఓవర్లకు స్కోరు 89 పరుగులే. చివరి నాలుగు ఓవర్లలో 42 పరుగులు చేయాల్సిన పరిస్థితి. మామూలుగానైతే ఇది మరీ కష్టమైందేమీ కాదు. కానీ కట్టుదిట్టమైన బౌలింగ్‌, భారీ షాట్లు ఆడేందుకు బ్యాటర్ల ఇబ్బంది చూస్తే చాలా కష్టమనేనని చూసేవాళ్లందరికీ అనిపించింది. పైగా టైటాన్స్‌ తర్వాతి రెండు ఓవర్లలో 9 పరుగులే చేసి మనోహర్‌ వికెట్‌ కోల్పోయింది. ఆపై 19వ ఓవర్‌ (నోకియా) తొలి మూడు బంతుల్లో మూడు పరుగులే వచ్చాయి. దిల్లీ విజయం లాంఛనమే అనుకున్నారంతా! కానీ ఒక్కసారిగా విరుచుకుపడ్డ తెవాతియా వరుసగా 6, 6, 6 బాది మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశాడు. టైటాన్స్‌ను రేసులోకి తెచ్చాడు. ఒకరకంగా ఆ జట్టుకే మంచి అవకాశాలున్నాయనిపించింది. కానీ చివరి ఓవర్లో చక్కగా బౌలింగ్‌ చేసిన ఇషాంత్‌ తొలి మూడు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చి.. నాలుగో బంతికి తెవాతియా (20)ను ఔట్‌ చేశాడు. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చాడు.

దిల్లీ తడబాటు: టైటాన్స్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అంతకుముందు దిల్లీ తక్కువ స్కోరుతో సరిపెట్టుకుంది. నిజానికి 130 కూడా ఊహించని స్కోరే. ఎందుకంటే ఓ దశలో ఆ జట్టు వంద దాటడమే కష్టమనిపించింది. షమి ధాటికి దిల్లీ 5 ఓవర్లలో 23 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో చిక్కుకుంది. కానీ అమన్‌ హకీమ్‌ పోరాటం దిల్లీకి గౌరవప్రదమైన స్కోరును సాధించి పెట్టింది. ఒత్తిడిలో చక్కని ఇన్నింగ్స్‌ ఆడిన అమన్‌.. అక్షర్‌ పటేల్‌ (27; 30 బంతుల్లో 2×4, 1×6), రిపల్‌ పటేల్‌ (23; 13 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. దిల్లీ ఆరంభం దారుణం. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టును షమి పదునైన పేస్‌తో బెంబేలెత్తించాడు. టైటాన్స్‌ బౌలింగ్‌ దాడిని ఆరంభించిన అతడు దిల్లీ టాప్‌ లేపేశాడు. పరుగుల సంగతి పక్కన పెడితే షమి బౌలింగ్‌లో వికెట్‌ కాపాడుకోవడమే బ్యాటర్లకు కష్టమైపోయింది. అతడు తొలి బంతికే సాల్ట్‌ను వెనక్కి పంపాడు. తన తర్వాతి ఓవర్లో రొసో (8)ను ఔట్‌ చేసిన షమి.. ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లో మనీష్‌ పాండే (1), ప్రియమ్‌ గార్గ్‌ (10)లను వెనక్కి పంపి దిల్లీకి షాకిచ్చాడు. కీలక బ్యాటర్‌ వార్నర్‌.. ప్రియమ్‌తో సమన్వయ లోపంతో రెండో ఓవర్లోనే రనౌటయ్యాడు. పాతిక పరుగులైనా స్కోరు బోర్డుపై చేరకముందే సగం వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డ దిల్లీ మ్యాచ్‌లో చాలా ముందే చేతులెత్తేసినట్లనిపించింది. కానీ పట్టుదలగా నిలిచిన అమన్‌ ఆ జట్టును ఆదుకున్నాడు. మరోవైపు అక్షర్‌ కూడా నిలబడడంతో దిల్లీ కోలుకుంది. అయితే 14వ ఓవర్లో అక్షర్‌ను మోహిత్‌ ఔట్‌ చేయడంతో 50 పరుగుల ఆరో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికి దిల్లీ స్కోరు 73/6. అమన్‌ ఆ తర్వాత మరో ఉపయుక్తమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రిపల్‌ పటేల్‌తో ఏడో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. మోహిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో అమన్‌ ఓ ఫోర్‌, సిక్స్‌.. లిటిల్‌ బౌలింగ్‌లో ఓ ఫోర్‌ దంచాడు. 18వ ఓవర్లో (మోహిత్‌) మరో సిక్స్‌ కొట్టి, ఆ తర్వాత ఓవర్లో నిష్క్రమించాడు. రిపల్‌ ధాటిగా ఆడాడు. చివరి అయిదు ఓవర్లలో దిల్లీ 52 పరుగులు రాబట్టింది.


దిల్లీ ఇన్నింగ్స్‌: ఫిల్‌ సాల్ట్‌ (సి) మిల్లర్‌ (బి) షమి 0; వార్నర్‌ రనౌట్‌ 2; ప్రియమ్‌ గార్గ్‌ (సి) సాహా (బి) షమి 10; రొసో (సి) సాహా (బి) షమి 8; మనీష్‌ పాండే (సి) సాహా (బి) షమి 1; అక్షర్‌ పటేల్‌ (సి) రషీద్‌ (బి) మోహిత్‌ 27; అమన్‌ (సి) మనోహర్‌ (బి) రషీద్‌ 51; రిపల్‌ పటేల్‌ (సి) హార్దిక్‌ (బి) మోహిత్‌ 23; నోకియా నాటౌట్‌ 3; కుల్‌దీప్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 130; వికెట్ల పతనం: 1-10, 2-6, 3-16, 4-22, 5-23, 6-73, 7-126, 8-130; బౌలింగ్‌: షమి 4-0-11-4; హార్దిక్‌ 1-0-10-0; లిటిల్‌ 3-0-27-0; రషీద్‌ 4-0-28-1; నూర్‌ 4-0-20-0; మోహిత్‌ 4-0-33-2

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) సాల్ట్‌ (బి) ఖలీల్‌ 0; శుభ్‌మన్‌ (సి) మనీష్‌ (బి) నోకియా 6; హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 59; విజయ్‌శంకర్‌ (బి) ఇషాంత్‌ 6; మిల్లర్‌ (బి) కుల్‌దీప్‌ 0; మనోహర్‌ (సి) అమన్‌ (బి) ఖలీల్‌ 26; తెవాతియా (సి) రొసో (బి) ఇషాంత్‌ 20; రషీద్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 125; వికెట్ల పతనం: 1-0, 2-18, 3-26, 4-32, 5-94, 6-122; బౌలింగ్‌: ఖలీల్‌ 4-1-24-2; ఇషాంత్‌  4-0-23-2; నోకియా 4-0-39-1, కుల్‌దీప్‌ 4-0-15-1; అక్షర్‌ 4-0-24-0


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని