BCCI: బీసీసీఐకి కాసుల పంట!

ఇప్పటికే ఆదాయంలో ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న బీసీసీఐకి మరోసారి కాసుల పంట పండనుంది. 2023 నుంచి 2027 వరకు అయిదేళ్ల కాలానికి గాను ఐసీసీ నుంచి సుమారు రూ.9424 కోట్లను ఆదాయంలో వాటాగా బీసీసీఐ పొందనుంది.

Updated : 11 May 2023 10:30 IST

దిల్లీ: ఇప్పటికే ఆదాయంలో ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న బీసీసీఐకి మరోసారి కాసుల పంట పండనుంది. 2023 నుంచి 2027 వరకు అయిదేళ్ల కాలానికి గాను ఐసీసీ నుంచి సుమారు రూ.9424 కోట్లను ఆదాయంలో వాటాగా బీసీసీఐ పొందనుంది. అంటే ఐసీసీ ఆదాయం (సుమారు రూ.24 వేల కోట్లు)లో దాదాపు 38.50 శాతం బీసీసీఐ ఖాతాలో చేరనుంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని ఓ ఐసీసీ సభ్యుడు తెలిపాడు. ఏడాదికి ఐసీసీకి రూ.4918 కోట్లు ఆదాయం రానుందని అంచనా. క్రికెట్లో ర్యాంకింగ్‌, ఐసీసీ టోర్నీల్లో ప్రదర్శన, ఆటకు వాణిజ్య సహకారం తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని కొత్త ఆర్థిక విధానం ప్రకారం ఆదాయంలో సభ్య దేశాలకు వాటా ఇవ్వనున్నారు. దీని ప్రకారం చూసుకుంటే ఇంగ్లాండ్‌కు 6.89 శాతం, ఆస్ట్రేలియాకు 6.25 శాతం, పాకిస్థాన్‌కు 5.75 శాతం ఆదాయంలో వాటా దక్కే అవకాశముంది. 2018 నుంచి 2022 వరకు ఐసీసీ నుంచి 26 శాతం వాటాను బీసీసీఐ పొందింది. కానీ ఇప్పుడు ఐసీసీలో శక్తిమంతమైన ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల విభాగానికి బీసీసీఐ కార్యదర్శి జై షా అధ్యక్షుడిగా ఉండడంతో ఈ సారి ఆదాయంలో మన వాటా పెరగనుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని