Yashasvi Jaiswal: కుర్రాడు.. ఏం కొట్టాడండీ!

మొదట కోల్‌కతా 20 ఓవర్లలో అతి కష్టం మీద 149 పరుగులు చేసింది. విధ్వంసక బ్యాటర్లకు నెలవైన నైట్‌రైడర్స్‌ ఇంతే స్కోరు చేసిందంటే.. పిచ్‌ బౌలర్లకు అనుకూలం అనుకున్నారంతా.

Updated : 12 May 2023 06:44 IST

యశస్వి వీర విధ్వంసం
13 బంతుల్లో అర్ధశతకంతో ఐపీఎల్‌లో రికార్డు
చాహల్‌ మాయాజాలం
రాజస్థాన్‌ చేతిలో కోల్‌కతా చిత్తు

మొదట కోల్‌కతా 20 ఓవర్లలో అతి కష్టం మీద 149 పరుగులు చేసింది. విధ్వంసక బ్యాటర్లకు నెలవైన నైట్‌రైడర్స్‌ ఇంతే స్కోరు చేసిందంటే.. పిచ్‌ బౌలర్లకు అనుకూలం అనుకున్నారంతా. లక్ష్యం చిన్నదైనా ఛేదన అంత తేలిక కాదేమో అన్న అంచనా! మొదట చాహల్‌ 4 వికెట్లు పడగొట్టడం చూసి.. స్పిన్నరైన కెప్టెన్‌ నితీశ్‌ రాణానే కోల్‌కతా బౌలింగ్‌ను ఆరంభించాడు. 6, 6, 4, 4, 2, 4.. ఇదీ తొలి ఓవర్లో యశస్వి ఊచకోత! ఇక అయిపోయింది నైట్‌రైడర్స్‌ కథ! కేవలం 13 బంతుల్లో 50 మార్కును అందుకుని 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసిన జైస్వాల్‌.. రాజస్థాన్‌కు ఘనవిజయాన్నందించాడు.

కోల్‌కతా

ఈ సీజన్లో భీకర ఫామ్‌తో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌.. మరో మేటి ఇన్నింగ్స్‌తో ఔరా అనిపించాడు. ఇప్పటికే సీజన్లో ఓ శతకం బాదిన అతను.. ఈసారి శతకాన్ని మించిన ఇన్నింగ్స్‌ ఆడాడు. కోల్‌కతాతో 150 పరుగుల ఛేదనలో యశస్వి 47 బంతుల్లోనే 98 పరుగులు చేసి (12×4, 5×6) అజేయంగా నిలిచాడు. యశస్వి కాస్త శాంతించిన సమయంలో.. సంజు శాంసన్‌ (48; 29 బంతుల్లో 2×4, 5×6) ప్రతాపం చూపించడంతో లక్ష్యం వేగంగా కరిగిపోయింది. దీంతో యశస్వి సెంచరీ చేయలేకపోయాడు. లక్ష్యాన్ని రాయల్స్‌ ఒక్క వికెట్టే కోల్పోయి కేవలం 13.1 ఓవర్లలోనే ఛేదించి విజయంతో పాటు కావాల్సినంత నెట్‌రన్‌రేట్‌నూ సంపాదించుకుంది. మొదట చాహల్‌ (4/25), బౌల్ట్‌ (2/15)ల ధాటికి కోల్‌కతా 8 వికెట్లకు 149 పరుగులే చేయగలిగింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (57; 42 బంతుల్లో 2×4, 4×6) టాప్‌స్కోరర్‌.

2.5 ఓవర్లకే అర్ధశతకం

కోల్‌కతా కెప్టెన్‌ నితీశ్‌ వేసిన తొలి ఓవర్‌తోనే ఆ జట్టు ఓటమిని ఖరారు చేసేశాడు యశస్వి. పిచ్‌, పరిస్థితులు ఏమీ చూడకుండా అతను తొలి బంతి నుంచే చెలరేగిపోయాడు. వరుసగా రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన యశస్వి.. తొలి ఓవర్లో 26 పరుగులు రాబట్టాడు. హర్షిత్‌ వేసిన రెండో ఓవర్లో ఆడిన 3 బంతులకు 1, 4, 6 పరుగులు రాబట్టిన యశస్వి.. మూడో ఓవర్లో (శార్దూల్‌) హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టి 49 మీదికి వచ్చేశాడు. ఆ వెంటనే సింగిల్‌తో ఐపీఎల్‌లో రికార్డు 50ని నమోదు చేశాడు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 2.5 ఓవర్లకే అతడి అర్ధశతకం పూర్తవడం విశేషం. ఆ తర్వాత అతను నెమ్మదించాడు. యశస్వి కోసం వికెట్‌ను త్యాగం చేస్తూ రనౌటైన బట్లర్‌ (0) స్థానంలో వచ్చిన సంజు.. నెమ్మదిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించినా, తర్వాత రెచ్చిపోయాడు. అనుకుల్‌ రాయ్‌ వేసిన 11వ ఓవర్లో అతను మూడు సిక్సర్లు బాదేశాడు. వరుణ్‌ బౌలింగ్‌లోనూ అతను ఓ సిక్సర్‌ అందుకున్నాడు. సంజు దూకుడుతో జైస్వాల్‌కు సెంచరీ అవకాశాలు సన్నగిల్లాయి. విజయానికి    10 పరుగులే చేయాల్సిన స్థితిలో అతను  89 మీద నిలిచాడు. చివర్లో సంజు తగ్గి, జైస్వాల్‌కు అవకాశమిచ్చినా.. అతను సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. విజయానికి 3 పరుగులే చేయాల్సిన స్థితిలో  యశస్వి ఫోర్‌ కొట్టడంతో మ్యాచ్‌ పూర్తయింది. అతను 98పై నిలిచిపోయాడు.

మొదట బౌల్ట్‌.. తర్వాత చాహల్‌

మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా పరుగుల వేటలో తీవ్రంగా ఇబ్బంది పడింది. స్పిన్నర్‌ చాహల్‌ మాయాజాలానికి ఆ జట్టు తలవంచింది. అయితే ఆ జట్టును తొలి దెబ్బ కొట్టింది బౌల్డ్‌. దూకుడుకు మారుపేరైన రాయ్‌ (10), గుర్బాజ్‌ (18) ఇన్నింగ్స్‌లను ధాటిగానే ఆరంభించినా.. వారిని బౌల్ట్‌ ఎక్కువసేపు నిలవనీయలేదు. వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ వెనుదిరగడం.. వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా (22) క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకోవడంతో స్కోరు బోర్డు ముందుకు కదల్లేదు. పవర్‌ ప్లే ముగిసేసరికి 37/2తో ఉన్న కోల్‌కతా.. 8 ఓవర్లకు కూడా 58 పరుగులే చేయగలిగింది. ఈ దశలో వెంకటేశ్‌ దూకుడు పెంచి స్కోరు బోర్డును కదిలించాడు. అతను ఓ ఎండ్‌లో ధాటిగా స్వేచ్ఛగా షాట్లు ఆడుతున్నా.. మరో ఎండ్‌ నుంచి అతడికి సహకరించేవారు కరవయ్యారు. స్పిన్నర్‌ చాహల్‌ వచ్చీ రావడంతోనే వికెట్ల వేట మొదలుపెట్టాడు. రెండో బంతికే నితీశ్‌ను ఔట్‌ చేసిన అతను.. తర్వాత వెంకటేశ్‌, శార్దూల్‌ (1), రింకు (16)ల వికెట్లనూ ఖాతాలో వేసుకున్నాడు. రసెల్‌ (10) కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో కోల్‌కతా 150 మార్కును కూడా అందుకోలేకపోయింది.


13

అర్ధశతకానికి యశస్వి ఆడిన బంతులు. ఐపీఎల్‌లో ఇదే అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ.రాహుల్‌ (2018), కమిన్స్‌ (2022)ల పేరిట 14 బంతులతో ఉన్న ఉమ్మడి రికార్డు బద్దలైంది.


కోల్‌కతా ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) హెట్‌మయర్‌ (బి) బౌల్ట్‌ 10; గుర్బాజ్‌ (సి) సందీప్‌ (బి) బౌల్ట్‌ 18; వెంకటేశ్‌ (సి) బౌల్ట్‌ (బి) చాహల్‌ 57; నితీశ్‌ (సి) హెట్‌మయర్‌ (బి) చాహల్‌ 22; రసెల్‌ (సి) అశ్విన్‌ (బి) అసిఫ్‌ 10; రింకు (సి) రూట్‌ (బి) చాహల్‌ 16; శార్దూల్‌ ఎల్బీ (బి) చాహల్‌ 1; అనుకుల్‌ నాటౌట్‌ 6; నరైన్‌ (సి) రూట్‌ (బి) సందీప్‌ 6; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149; వికెట్ల పతనం: 1-14, 2-29, 3-77, 4-107, 5-127, 6-129, 7-140, 8-149; బౌలింగ్‌: బౌల్ట్‌ 3-0-15-2; సందీప్‌ శర్మ 4-0-34-1; అశ్విన్‌ 4-0-32-0; రూట్‌ 2-0-14-0; చాహల్‌ 4-0-25-4; అసిఫ్‌ 3-0-27-1

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి నాటౌట్‌ 98; బట్లర్‌ రనౌట్‌ 0; శాంసన్‌ నాటౌట్‌ 48; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (13.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 151; వికెట్ల పతనం: 1-30;  బౌలింగ్‌: నితీశ్‌ రాణా 1-0-26-0; హర్షిత్‌ రాణా 2-0-22-0; శార్దూల్‌ 1.1-0-18-0; వరుణ్‌ 3-0-28-0; నరైన్‌ 2-0-13-0; సుయాశ్‌ 3-0-22-0; అనుకుల్‌ 1-0-20-0


 


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు