DC vs PBKS: దిల్లీ కథ ముగిసె..

అయిదు వరుస ఓటములతో ఈ ఐపీఎల్‌ సీజన్‌ను ఆరంభించిన దిల్లీ.. ప్లేఆఫ్స్‌కు దూరమైన తొలి జట్టయింది.

Updated : 14 May 2023 08:49 IST

8వ ఓటమితో ప్లేఆఫ్స్‌కు దూరం
పంజాబ్‌కు ఆరో విజయం
బౌలింగ్‌ పిచ్‌పై ప్రభ్‌సిమ్రన్‌ శతకం

అయిదు వరుస ఓటములతో ఈ ఐపీఎల్‌ సీజన్‌ను ఆరంభించిన దిల్లీ.. ప్లేఆఫ్స్‌కు దూరమైన తొలి జట్టయింది. మధ్యలో కాస్త పుంజుకున్నప్పటికీ, మళ్లీ గాడి తప్పిన ఆ జట్టు.. శనివారం పంజాబ్‌కు తలవంచి, ఎనిమిదో ఓటమిని ఖాతాలో వేసుకోవడంతో దారులు మూసుకుపోయాయి. దిల్లీ లాగే 12వ మ్యాచ్‌ ఆడి, ఆరో విజయం సాధించిన పంజాబ్‌.. తన అవకాశాలను మెరుగుపరుచుకోవడమే కాక, ప్లేఆఫ్స్‌ రేసును రసవత్తరంగా మార్చింది. బౌలర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన ప్రభ్‌సిమ్రన్‌ పంజాబ్‌ హీరో.

బౌలర్లు ఆధిపత్యం సాగించిన మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (103; 65 బంతుల్లో 10×4, 6×6) అద్భుత శతకం సాధించడంతో ఐపీఎల్‌-16 ప్లేఆఫ్స్‌ రేసులో పంజాబ్‌ కింగ్స్‌ ముందంజ వేసింది. ఆ జట్టు శనివారం 31 పరుగుల తేడాతో దిల్లీని ఓడించింది. మొదట 7 వికెట్లకు 167 పరుగులు చేసిన పంజాబ్‌.. దిల్లీని 136/8కు కట్టడి చేసింది. స్పిన్నర్లు హర్‌ప్రీత్‌ బ్రార్‌ (4/30), రాహుల్‌ చాహర్‌ (2/16)లతో పాటు పేసర్‌ ఎలిస్‌ (2/26) ఆ జట్టును దెబ్బ తీశారు. ఛేదనలో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ వార్నర్‌ (54; 27 బంతుల్లో 10×4, 1×6).. సాల్ట్‌ (21)తో కలిసి 69 పరుగులు జోడించి దిల్లీకి చక్కటి ఆరంభాన్నిచ్చినా, తొలి వికెట్‌ పడ్డాక ఆ జట్టు గాడి తప్పింది. బ్రార్‌ కీలక వికెట్లు పడగొట్టి దిల్లీని కోలుకోకుండా చేశాడు. అతడికి రాహుల్‌ చాహర్‌ కూడా తోడవడంతో 88/6తో దిల్లీ ఓటమి వైపు అడుగులేసింది. అమన్‌ (16), ప్రవీణ్‌ దూబే (16)ల పోరాటం పెద్దగా ఫలితాన్నివ్వలేదు.

అతనొక్కడే..: బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై మొదట మిగతా పంజాబ్‌ బ్యాటర్లందరూ తడబడితే.. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ మాత్రం పిచ్‌తో, పరిస్థితులతో సంబంధం లేదన్నట్లు చెలరేగిపోయి ఐపీఎల్‌ కెరీర్లో తొలి శతకం సాధించాడు. ఇషాంత్‌ (2/27) ధాటికి ధావన్‌ (7), లివింగ్‌స్టన్‌ (4) పెవిలియన్‌ చేరగా.. జితేశ్‌ (5) కూడా ఎక్కువసేపు నిలవలేదు. దీంతో 45/3తో కష్టాల్లో పడ్డ పంజాబ్‌ను సామ్‌ కరన్‌ (20)తో కలిసి ప్రభ్‌సిమ్రన్‌ ఆదుకున్నాడు. కరన్‌ సైతం పరుగులు చేయడానికి ఇబ్బంది పడగా.. ప్రభ్‌సిమ్రన్‌ మాత్రం అలవోకగా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 42 బంతుల్లో అర్ధశతకం సాధించిన అతను.. రెండో అర్ధశతకాన్ని 19 బంతుల్లోనే అందుకోవడం విశేషం. కరన్‌ ఔటయ్యాక అతడికి సహకరించేవారు కరవైనా.. ప్రభ్‌సిమ్రన్‌ తగ్గలేదు. అతను శతకం పూర్తి చేశాక 19వ ఓవర్లో ఔటయ్యాడు. అప్పటికి పంజాబ్‌ స్కోరు 154 కాగా.. అందులో ప్రభ్‌సిమ్రన్‌వే 103.

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ (బి) ముకేశ్‌ 103; శిఖర్‌ ధావన్‌ (సి) రొసో (బి) ఇషాంత్‌ 7; లివింగ్‌స్టన్‌ (బి) ఇషాంత్‌ 4; జితేశ్‌ (బి) అక్షర్‌ 5; సామ్‌ కరన్‌ (సి) అమన్‌ (బి) ప్రవీణ్‌ దూబే 20; హర్‌ప్రీత్‌ (సి) మార్ష్‌ (బి) కుల్‌దీప్‌ 2; షారుక్‌ రనౌట్‌ 2; రజా నాటౌట్‌ 11; రిషి ధావన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167; వికెట్ల పతనం: 1-10, 2-32, 3-45, 4-117, 5-129, 6-154, 7-165; బౌలింగ్‌: ఖలీల్‌ 4-0-36-0; ఇషాంత్‌ 3-0-27-2; అక్షర్‌ 4-0-27-1; ప్రవీణ్‌ దూబే 3-0-19-1; కుల్‌దీప్‌ 4-0-32-1; మార్ష్‌ 1-0-21-0; ముకేశ్‌ 1-0-3-1

దిల్లీ ఇన్నింగ్స్‌: వార్నర్‌ ఎల్బీ (బి) హర్‌ప్రీత్‌ 54; సాల్ట్‌ (బి) హర్‌ప్రీత్‌ 21; మార్ష్‌ ఎల్బీ (బి) ఆర్‌.చాహర్‌ 3; రొసో (సి) రజా (బి) హర్‌ప్రీత్‌ 5; అక్షర్‌ ఎల్బీ (బి) ఆర్‌.చాహర్‌ 1; పాండే (బి) హర్‌ప్రీత్‌ 0; అమన్‌ (సి) హర్‌ప్రీత్‌ (బి) ఎలిస్‌ 16; ప్రవీణ్‌ దూబే (బి) ఎలిస్‌ 16; కుల్‌దీప్‌ నాటౌట్‌ 10; ముకేశ్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 136; బౌలింగ్‌: 1-69, 2-74, 3-81, 4-86, 5-86, 6-88, 7-118, 8-123; బౌలింగ్‌: రిషి ధావన్‌ 1-0-10-0; సామ్‌ కరన్‌ 2-0-18-0; హర్‌ప్రీత్‌ 4-0-30-4; ఎలిస్‌ 4-0-26-2; అర్ష్‌దీప్‌ 4-0-32-0; రాహుల్‌ చాహర్‌ 4-0-16-2; రజా 1-0-3-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని