SRH vs LSG: ఇక కష్టమే..

స్కోరు బోర్డుపై 182 పరుగులున్నాయ్‌.. జట్టు నిండా నాణ్యమైన బౌలర్లున్నారు.. పిచ్‌ నుంచి సహకారం లభిస్తోంది.. ఛేదనలో ప్రత్యర్థి తడబడుతోంది.

Updated : 14 May 2023 08:47 IST

లఖ్‌నవూ చేతిలో సన్‌రైజర్స్‌ ఓటమి
ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం
పూరన్‌, స్టాయినిస్‌ ధనాధన్‌

స్కోరు బోర్డుపై 182 పరుగులున్నాయ్‌.. జట్టు నిండా నాణ్యమైన బౌలర్లున్నారు.. పిచ్‌ నుంచి సహకారం లభిస్తోంది.. ఛేదనలో ప్రత్యర్థి తడబడుతోంది. చాలా వరకు మ్యాచ్‌ చేతుల్లోనే ఉంది. కానీ ఆఖరి ఓవర్లలో బౌలింగ్‌ గాడి తప్పింది. స్టాయినిస్‌, పూరన్‌ దంచేశారు. మ్యాచ్‌ను లఖ్‌నవూ ఎగరేసుకుపోయింది. దురదృష్టం వెన్నంటే ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మళ్లీ కలిసిరాలేదు. సొంతగడ్డపై మరో ఓటమితో ఐపీఎల్‌-16లో ప్లేఆఫ్స్‌ అవకాశాల్ని మరింత సంక్లిష్టం చేసుకుంది.

పూరన్‌ (44 నాటౌట్‌; 13 బంతుల్లో 3×4, 4×6), స్టాయినిస్‌ (40; 25 బంతుల్లో 2×4, 3×6) అదరగొట్టారు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో లఖ్‌నవూకు కీలక విజయాన్ని అందించారు. శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించింది. మొదట సన్‌రైజర్స్‌ 6 వికెట్లకు 182 పరుగులు సాధించింది. క్లాసెన్‌ (47; 29 బంతుల్లో 3×4, 3×6), సమద్‌ (37 నాటౌట్‌; 25 బంతుల్లో 1×4, 4×6) రాణించడంతో సన్‌రైజర్స్‌ మెరుగైన స్కోరు సాధించింది. పూరన్‌, స్టాయినిస్‌ మెరుపులకు ప్రేరక్‌ మన్కడ్‌ (64 నాటౌట్‌; 45 బంతుల్లో 7×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ తోడవడంతో.. లఖ్‌నవూ 4 బంతులు మిగిలివుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో లఖ్‌నవూ 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్‌ ఆశల్ని నిలబెట్టుకోగా.. సన్‌రైజర్స్‌ ఏడో ఓటమితో తన అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా.. అద్భుతాలు జరిగితే తప్ప సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ చేరుకోవడం కష్టం!

పూరన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌: లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ను 13 ఓవర్లకు ముందు.. తర్వాతగా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో లఖ్‌నవూ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టలేకపోయారు. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (2) మొదటి పరుగు కోసం 11 బంతులు ఆడాల్సొచ్చింది. గేరు మార్చిన క్వింటన్‌ డికాక్‌ (29; 19 బంతుల్లో 3×4, 1×6)ను మయాంక్‌ మార్కండే బోల్తా కొట్టించాడు. ప్రేరక్‌, స్టాయినిస్‌ క్రీజులో కుదురుకున్నా.. బ్యాటుకు పని చెప్పలేదు. 13 ఓవర్లకు లఖ్‌నవూ స్కోరు 89/2. 42 బంతుల్లో 94 పరుగులు చేయాల్సి రావడంతో సన్‌రైజర్సే గెలుస్తుందనిపించింది. కానీ ఇక్కడి నుంచి లఖ్‌నవూ జూలు విదిల్చింది. మార్కండే వేసిన 14వ ఓవర్‌ తొలి బంతినే ప్రేరక్‌ సిక్సర్‌గా మలిచాడు. మరో బౌండరీతో 14 పరుగులు రాబట్టాడు. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ వేసిన 16వ ఓవర్‌ మ్యాచ్‌ గమనాన్నే మార్చేసింది. వరుసగా రెండు సిక్సర్లు బాదిన స్టాయినిస్‌, మూడో బంతికి ఔటైనా.. పూరన్‌ చివరి 3 బంతులకు సిక్సర్లు బాదేశాడు. ఒక వైడ్‌ కలిపి మొత్తంగా ఈ ఓవర్లో 31 పరుగులు రావడంతో మ్యాచ్‌ లఖ్‌నవూ వైపు మొగ్గింది. పూరన్‌ తర్వాత కూడా జోరు కొనసాగించడంతో సన్‌రైజర్స్‌కు దారులు మూసుకుపోయాయి. లఖ్‌నవూ ఆఖరి 38 బంతుల్లో 96 పరుగులు రాబట్టింది.

మెరిసిన క్లాసెన్‌, సమద్‌: అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. జట్టులో ఒక్క బ్యాటరూ అర్ధసెంచరీ చేయకపోయినా, పెద్ద స్కోరే సాధించింది. పిచ్‌పై బౌన్స్‌, టర్న్‌ ఉండటంతో బ్యాటు, బంతికి మధ్య మంచి పోరాటం కనిపించింది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లు బ్యాటుకు పని చెప్పినప్పుడల్లా లఖ్‌నవూ బౌలర్లు కట్టడి చేశారు. పవర్‌ ప్లేలో అభిషేక్‌శర్మ (7), రాహుల్‌ త్రిపాఠి (20; 13 బంతుల్లో 4×4) వికెట్లను కోల్పోయిన సన్‌రైజర్స్‌ 56/2తో నిలిచింది. ఈ స్థితిలో అన్మోల్‌ప్రీత్‌ (36; 27 బంతుల్లో 7×4), క్లాసెన్‌లతో మార్‌క్రమ్‌ (28; 20 బంతుల్లో 2×4, 1×6) భాగస్వామ్యాలు నెలకొల్పడంతో 12 ఓవర్లకు 115/3తో మంచి స్థితికి చేరుకుంది. కానీ 13వ ఓవర్లో లఖ్‌నవూ కెప్టెన్‌ కృనాల్‌ పాండ్య.. వరుస బంతుల్లో మార్‌క్రమ్‌, ఫిలిప్స్‌లను పెవిలియన్‌ చేర్చి సన్‌రైజర్స్‌ను గట్టి దెబ్బ తీశాడు. ఈ స్థితిలో స్కోరు వేగం కూడా తగ్గినా.. చివరి ఓవర్లలో క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌ బ్యాట్లు ఝుళిపించడంతో సన్‌రైజర్స్‌ మెరుగైన స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది. క్లాసెన్‌, సమద్‌ ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. చివరి 5 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 52 పరుగులు సాధించింది.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: అన్మోల్‌ప్రీత్‌ (సి) అండ్‌ (బి) మిశ్రా 36; అభిషేక్‌ (సి) డికాక్‌ (బి) యుధ్‌వీర్‌ 7; త్రిపాఠి (సి) డికాక్‌ (బి) యశ్‌ 20; మార్‌క్రమ్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) కృనాల్‌ 28; క్లాసెన్‌ (సి) ప్రేరక్‌ (బి) అవేష్‌ 47; ఫిలిప్స్‌ (బి) కృనాల్‌ 0; సమద్‌ నాటౌట్‌ 37; భువనేశ్వర్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182; వికెట్ల పతనం: 1-19, 2-56, 3-82, 4-115, 5-115, 6-173; బౌలింగ్‌: యుధ్‌వీర్‌ 3-0-24-1; మేయర్స్‌ 1-0-11-0; కృనాల్‌ 4-0-24-2; అవేష్‌ 2-0-30-1; యశ్‌ ఠాకూర్‌ 4-0-28-1; అమిత్‌ మిశ్రా 4-0-40-1; రవి బిష్ణోయ్‌ 2-0-23-0
లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) ఫిలిప్స్‌ 2; డికాక్‌ (సి) అభిషేక్‌ (బి) మార్కండే 29; ప్రేరక్‌ నాటౌట్‌ 64; స్టాయినిస్‌ (సి) సమద్‌ (బి) అభిషేక్‌ 40; పూరన్‌ నాటౌట్‌ 44; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (19.2 ఓవర్లలో 3 వికెట్లకు) 185; వికెట్ల పతనం: 1-12, 2-54, 3-127; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-30-0; ఫారూఖీ 3.2-0-32-0; ఫిలిప్స్‌ 2-0-10-1; నటరాజన్‌ 4-0-31-0; మార్కండే 3-0-39-1; అభిషేక్‌ 3-0-42-1


త్రిషకు సత్కారం

టీనేజీ సంచలన క్రికెటర్‌ త్రిషను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ ఏడాది భారత అమ్మాయిలు అండర్‌-19 ప్రపంచకప్‌ గెలవడంలో ఈ భద్రాచలం అమ్మాయి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌, లఖ్‌నవూ మ్యాచ్‌ సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం, సన్‌రైజర్స్‌ కోచ్‌ బ్రయాన్‌ లారా ఆమెకు ప్రత్యేక జ్ఞాపికను అందించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని