GT vs SRH: గుజరాత్‌ ముందుకు.. సన్‌రైజర్స్‌ ఇంటికి

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఔట్‌. ఐపీఎల్‌-16లో ఆ జట్టు కథ ముగిసింది. ఆల్‌రౌండ్‌ జోరుతో తొమ్మిదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ ఈ సీజన్‌లో ప్లేఆప్స్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

Updated : 16 May 2023 06:52 IST

శుభ్‌మన్‌ సూపర్‌ సెంచరీ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఔట్‌. ఐపీఎల్‌-16లో ఆ జట్టు కథ ముగిసింది. ఆల్‌రౌండ్‌ జోరుతో తొమ్మిదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ ఈ సీజన్‌లో ప్లేఆప్స్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. అంతే కాక టాప్‌-2లోనూ చోటు ఖాయం చేసుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ సెంచరీ సాధించిన వేళ హార్దిక్‌ సేన.. సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. షమి, మోహిత్‌ బంతితో విజృంభించారు. 12 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు ఇది ఎనిమిదో ఓటమి.

అహ్మదాబాద్‌

గుజరాత్‌ టైటాన్స్‌ అదరగొట్టింది. సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను మట్టికరిపించి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. శుభ్‌మన్‌ గిల్‌ (101; 58 బంతుల్లో 13×4, 1×6) శతక్కొట్టడంతో మొదట టైటాన్స్‌ 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (47; 36 బంతుల్లో 6×4, 1×6) రాణించాడు. భువనేశ్వర్‌ (5/30) చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఛేదనలో  సన్‌రైజర్స్‌ చేతులెత్తేసింది. షమి (4/21), మోహిత్‌ శర్మ (4/28) ధాటికి 9 వికెట్లకు 154 పరుగులే చేయగలిగింది. క్లాసెన్‌ (64; 44 బంతుల్లో 4×4, 3×6) పోరాటం ఏమాత్రం సరిపోలేదు.

తేలిపోయిన సన్‌రైజర్స్‌: ఛేదనలో సన్‌రైజర్స్‌ తేలిపోయింది. టపటపా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు చాలా ముందే పోటీలో లేకుండా పోయింది. షమి, మోహిత్‌ విజృంభించడంతో సన్‌రైజర్స్‌ 49/6తో చిక్కుల్లో పడింది. జట్టు స్కోరు 59 వద్ద జాన్సన్‌ (3) కూడా ఔట్‌ కావడంతో ఆ జట్టు ఓటమి లాంఛనమే అనిపించింది. కానీ ఇన్నింగ్స్‌ను క్లాసెన్‌ అంత త్వరగా ముగియనివ్వలేదు. భువనేశ్వర్‌ (27) అండతో పోరాడి మ్యాచ్‌పై కాస్త ఆసక్తి రేపాడు. స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూనే వీలైనప్పుడు బౌండరీలు సాధించి స్కోరు బోర్డును నడిపించాడు. 16 ఓవర్లకు సన్‌రైజర్స్‌ స్కోరు 123/7. గెలుపు చాలా కష్టమే అయినా.. భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఉన్న క్లాసెన్‌ ఏదైనా చేస్తాడా అన్న చిన్న ఆసక్తి కలిగిన దశ అది. కానీ 17వ ఓవర్లో క్లాసెన్‌ను షమి ఔట్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ పరాజయం ఖాయమైపోయింది.

గిల్‌ అదరహో..: టైటాన్స్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఆటే హైలైట్‌. సాధికారిక ఇన్నింగ్స్‌ ఆడిన అతడు ఐపీఎల్‌లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు. ఫలితంగా గుజరాత్‌ మెరుగైన స్కోరు సాధించింది. 188 మంచి స్కోరే అయినా.. అది అనుకున్న దాని కన్నా తక్కువే. సుదర్శన్‌తో రెండో వికెట్‌కు గిల్‌ 147 పరుగులు జోడించడంతో అలవోకగా 200పై స్కోరు చేసేలా కనిపించిన టైటాన్స్‌, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో కాస్త అసంతృప్తిగానే ఇన్నింగ్స్‌ ముగించింది. ఆలస్యంగానైనా బంతితో పుంజుకున్న సన్‌రైజర్స్‌.. టైటాన్స్‌ను కట్టడి చేయగలిగింది. భువనేశ్వర్‌ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ తొలి అర్ధభాగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సాహాను మూడో బంతికే ఔట్‌ చేసిన ఆనందం సన్‌రైజర్స్‌కు ఎక్కువసేపు లేకుండా చేశాడు మరో ఓపెనర్‌ గిల్‌. చక్కని షాట్లతో అలరిస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. సాయి సుదర్శన్‌ రూపంలో అతడికి మంచి అండ దొరికింది. ఇద్దరు కలిసి భువి వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో 15 పరుగులు రాబట్టారు. తర్వాతి ఓవర్లో ఫారూఖీ బౌలింగ్‌లో గిల్‌ వరుసగా నాలుగు ఫోర్లు బాదేశాడు. పుల్‌, డ్రైవ్‌, ఫ్లిక్‌లతో అతడు అలరించాడు. పవర్‌ ప్లే ముగిసేసరికే టైటాన్స్‌ 65/1తో నిలిచింది. గిల్‌ 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకోగా.. 10 ఓవర్లకు గుజరాత్‌ 103/1తో నిలిచింది. ఆ తర్వాత కూడా గిల్‌ దూకుడు కొనసాగించాడు. జాన్సన్‌ బౌలింగ్‌లో సుదర్శన్‌ స్కూప్‌తో చూడచక్కని సిక్స్‌ కొట్టాడు. 14 ఓవర్లలో 147/1తో భారీ స్కోరు చేసేలా కనిపించింది గుజరాత్‌. కానీ ఆఖర్లో అద్భుతంగా పుంజుకున్న సన్‌రైజర్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థికి కళ్లెం వేసింది. చివరి ఆరు ఓవర్లలో కేవలం 41 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టింది. సుదర్శన్‌ను జాన్సన్‌ ఔట్‌ చేయడంతో గుజరాత్‌ తడబాటు మొదలైంది. ఆ తర్వాత హిట్టర్లు హార్దిక్‌ (8), మిల్లర్‌ (7), తెవాతియా (3) పెవిలియన్‌కు క్యూ కట్టారు. 16 ఓవర్లో హార్దిక్‌ను ఔట్‌ చేసిన భువి.. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి గిల్‌ సహా ముగ్గురిని ఔట్‌ చేశాడు. మరో బ్యాటర్‌ రనౌటయ్యాడు.


దయాళ్‌ వచ్చాడు..

యశ్‌ దయాళ్‌.. ఐపీఎల్‌ వీక్షకులు ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. గత నెల 9న కోల్‌కతాతో మ్యాచ్‌ ఈ గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌కు ఒక పీడకల. అతడి బౌలింగ్‌లో రింకూ సింగ్‌ చివరి 5 బంతులకు 5 సిక్సర్లు బాది, కేకేఆర్‌ను గెలిపించడం ఓ సంచలనం. ఆ దెబ్బతో దయాళ్‌ అయిదు వారాలు గుజరాత్‌ మైదానంలో కనిపించలేదు. మధ్యలో కెప్టెన్‌ హార్దిక్‌ను యశ్‌ గురించి అడిగితే.. అతను మానసికంగానే కాక శారీరకంగానూ దెబ్బ తిన్నాడని, మైదానంలోకి రావడానికి సమయం పడుతుందని అన్నాడు. అయితే సోమవారం యశ్‌ మ్యాచ్‌ ఆడాడు. సన్‌రైజర్స్‌పై 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు.


గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) అభిషేక్‌ (బి) భువనేశ్వర్‌ 0; శుభ్‌మన్‌ గిల్‌ (సి) సమద్‌ (బి) భువనేశ్వర్‌ 101; సుదర్శన్‌ (సి) నటరాజన్‌ (బి) జాన్సన్‌ 47; హార్దిక్‌ (సి) త్రిపాఠి (బి) భువనేశ్వర్‌ 8; మిల్లర్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) నటరాజన్‌ 7; తెవాతియా (సి) జాన్సన్‌ (బి) ఫారూఖీ 3; శానక నాటౌట్‌ 9; రషీద్‌ (సి) క్లాసెన్‌ (బి) భువనేశ్వర్‌ 0; నూర్‌ రనౌట్‌ 0; షమి (సి) జాన్సన్‌ (బి) భువనేశ్వర్‌ 0; మోహిత్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188; వికెట్ల పతనం: 1-0, 2-147, 3-156, 4-169, 5-175, 6-186, 7-186, 8-186, 9-187; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-30-5; జాన్సన్‌ 4-0-39-1; ఫారూఖీ 3-0-31-1; నటరాజన్‌ 4-0-34-1; మార్‌క్రమ్‌ 1-0-13-0; మార్కండే 3-0-27-0; అభిషేక్‌  1-0-13-0
సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: అన్మోల్‌ప్రీత్‌ (సి) రషీద్‌ (బి) షమి 5; అభిషేక్‌ (సి) సాహా (బి) యశ్‌ 5; మార్‌క్రమ్‌ (సి) శానక (బి) షమి 10; త్రిపాఠి (సి) తెవాతియా (బి) షమి 1; క్లాసెన్‌ (సి) మిల్లర్‌ (బి) షమి 64; సన్వీర్‌ (సి) సుదర్శన్‌ (బి) మోహిత్‌ 7; సమద్‌ (సి) మావి (బి) మోహిత్‌ 4; జాన్సన్‌ (సి) హార్దిక్‌ (బి) మోహిత్‌ 3; భువనేశ్వర్‌ (సి) రషీద్‌ (బి) మోహిత్‌ 27; మార్కండే నాటౌట్‌ 18; ఫారూఖీ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 154; వికెట్ల పతనం: 1-6, 2-11, 3-12, 4-29, 5-45, 6-49, 7-59, 8-127, 9-147; బౌలింగ్‌: షమి 4-0-21-4; యశ్‌ దయాళ్‌ 4-0-31-1; రషీద్‌ 4-0-28-0; మోహిత్‌  4-0-28-4; నూర్‌ 2.5-0-35-0; తెవాతియా 1.1-0-7-0


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని