MS Dhoni - CSK: ధోని ముగిస్తున్నాడా?

ఆదివారం చెపాక్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌.. ఈ సీజన్‌లో సొంతగడ్డపై సీఎస్కేకు ఇదే చివరి లీగ్‌ పోరు.. మ్యాచ్‌ ముగిసింది.. సహచర ఆటగాళ్లతో కలిసి ధోని మైదానంలో తిరిగాడు.. రాకెట్‌ పట్టి టెన్నిస్‌ బంతులను ప్రేక్షకుల్లోకి కొట్టాడు.

Updated : 16 May 2023 06:50 IST

వీడ్కోలుపై మళ్లీ చర్చ

చెన్నై: ఆదివారం చెపాక్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌.. ఈ సీజన్‌లో సొంతగడ్డపై సీఎస్కేకు ఇదే చివరి లీగ్‌ పోరు.. మ్యాచ్‌ ముగిసింది.. సహచర ఆటగాళ్లతో కలిసి ధోని మైదానంలో తిరిగాడు.. రాకెట్‌ పట్టి టెన్నిస్‌ బంతులను ప్రేక్షకుల్లోకి కొట్టాడు. స్టాండ్స్‌లోకి సీఎస్కే జెర్సీలను విసిరాడు. అదే సమయంలో మైదానంలో వ్యాఖ్యానం చేస్తున్న దిగ్గజం సునీల్‌ గావస్కర్‌.. ధోని దగ్గరకు రాగానే పరుగెత్తుకు వెళ్లి తన చొక్కాపై ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాడు. స్టాండ్స్‌లోని అభిమానులు కనపడేలా ధోని సెల్ఫీ తీసుకున్నాడు. అటు ప్రేక్షకులు.. ఇటు ధోని.. ఆ సమయంలో భావోద్వేగంతో కనిపించారు. దీంతో ఇదే ధోనికి చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని, ఇక ఈ దిగ్గజం పూర్తిగా ఆటకు వీడ్కోలు పలుకుతాడనే చర్చలు మళ్లీ జోరందుకున్నాయి. మ్యాచ్‌ తర్వాత పరిణామాలు చూస్తే ఇదే నిజమనే అభిప్రాయమూ కలుగుతోంది. చెన్నైలో ఆఖరి మ్యాచ్‌ ఆడేశాననే సంకేతాలు ధోని ఇచ్చాడనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జులైలో 42వ పడిలోకి అడుగుపెట్టనున్న అతనికి వచ్చే సీజన్‌ ఆడడం కష్టమే కావొచ్చు. ప్రస్తుతం ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న అతను.. మ్యాచ్‌ తర్వాత మోకాలికి పట్టీతోనే కనిపించాడు. తన కెరీర్‌లో ఇది చివరి దశ అని కూడా మ్యాచ్‌ అనంతరం తెలిపాడు. ఈ సీజన్‌లో సొంతగడ్డపైనే అని కాకుండా చెన్నై ఎక్కడ ఆడినా పసుపు రంగు జెర్సీలతో స్టేడియం నిండిపోతుండడంపై స్పందిస్తూ.. ‘‘నాకు వీడ్కోలు పలికేందుకు వస్తున్నారనుకుంటా’’ అని ఇప్పటికే అతను వ్యాఖ్యానించాడు. కానీ ధోని వచ్చే సీజన్‌ కూడా ఆడతాడనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌ కాబట్టి చెన్నై ఆటగాళ్లందరూ కలిసి అభిమానులకు ధన్యవాదాలు తెలిపేందుకు ఇలా చేశారని కొందరు అంటున్నారు. అయితే ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉన్న చెన్నై.. మళ్లీ చెపాక్‌లో ఓ మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. చెన్నైలో రెండు ప్లేఆఫ్స్‌ (తొలి క్వాలిఫయర్‌, ఎలిమినేటర్‌) మ్యాచ్‌లు జరగనున్నాయి. మరి ధోని ఈ సీజన్‌ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

‘‘ఇదే తన చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని ధోని సరిపడా సంకేతాలిచ్చాడనే అనుకుంటున్నా. అతను వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఆడడని నాకనిపిస్తోంది. సన్నీ సర్‌ ఇప్పటివరకూ ఎవరి దగ్గరా ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం మేం చూడలేదు. అలాంటి దిగ్గజం తన చొక్కాపై ధోని ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం మహి గొప్పతనానికి నిదర్శనం’’

 టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్‌ కైఫ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని