Virender Sehwag: పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ నాతో ఆరు గంటలున్నా..

ఇటీవల ఓ యాడ్‌ షూటింగ్‌ సందర్భంగా పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ ఆరు గంటలు తనతో ఉన్నా ఇద్దరిలో ఎవరూ క్రికెట్‌ గురించి మాట్లాడలేదని వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పాడు. 

Updated : 19 May 2023 04:30 IST

దిల్లీ: ఇటీవల ఓ యాడ్‌ షూటింగ్‌ సందర్భంగా పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ ఆరు గంటలు తనతో ఉన్నా ఇద్దరిలో ఎవరూ క్రికెట్‌ గురించి మాట్లాడలేదని వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పాడు. ‘‘పృథ్వీ నాతో కలిసి ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ కూడా ఉన్నాడు. ఇద్దరిలో ఒక్కరూ ఒక్కసారి కూడా నాతో క్రికెట్‌ గురించి మాట్లాడలేదు. మేమక్కడ ఆరు గంటలు ఉన్నాం. మనం ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే చొరవ చూపాల్సింది మనమే’’ అని అన్నాడు. ఒకప్పుడు సునీల్‌ గావస్కర్‌తో మాట్లాడాలనుకున్న తాను, అతణ్ని ఎలా సంప్రదించాడో చెప్పాడు సెహ్వాగ్‌. ‘‘అప్పుడు నేను జట్టులో కొత్త. సన్నీ భాయ్‌ (గావస్కర్‌)తో మాట్లాడాలనుకున్నా. ‘నేనింకా కొత్త ఆటగాణ్ని. సన్నీ భాయ్‌ నన్ను కలుస్తాడో లేదో. కానీ మీరు నాకోసం ఆయనతో సమావేశం ఏర్పాటు చెయ్యాలి’ అని జాన్‌ రైట్‌తో చెప్పా. దాంతో రైట్‌ 2003-04లో నాకోసం డిన్నర్‌ ఏర్పాటు చేశాడు. నా ఓపెనింగ్‌ భాగస్వామి ఆకాశ్‌ చోప్రా కూడా వస్తాడని, బ్యాటింగ్‌ గురించి సన్నీ భాయ్‌తో మాట్లాడతామని చెప్పా. సన్నీ భాయ్‌ వచ్చాడు. మాతో కలిసి డిన్నర్‌ చేశాడు. నేను చెప్పేదేంటంటే.. ఎవరినైనా కలవాలనుకుంటే మనమే చొరవ చూపాలి. సెహ్వాగ్‌ లేదా చోప్రాతో మాట్లాడడానికి గావస్కర్‌ ముందుకు రాడు. మాట్లాడమని మనమే అతడికి విజ్ఞప్తి చేయాలి’’ అని చెప్పాడు. పేలవ దశలో ఉన్న ఆటగాడు సీనియర్‌ ఆటగాడి దగ్గరకు వెళ్లి మాట్లాడితే బాగుంటుందని వీరూ అన్నాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న పృథ్వీ (దిల్లీ క్యాపిటల్స్‌) బుధవారం పంజాబ్‌ కింగ్స్‌పై చక్కని అర్ధశతకం సాధించిన సంగతి తెలిసిందే. ‘‘గావస్కర్‌ మాతో చాలా సేపు మాట్లాడాడు. సలహాలు ఇచ్చాడు. ఆ సంభాషణతో మేమెంతో లాభపడ్డాం. కానీ సీనియర్‌తో మాట్లాడాలంటే మనమే చొరవ చూపాలి. గావస్కరే వచ్చి మనతో మాట్లాడడు. పృథ్వీ షా కూడా ప్రయత్నిస్తే ఎవరో ఒకరు అతడితో మాట్లాడేవాళ్లు’’ అని సెహ్వాగ్‌ అన్నాడు. క్రికెట్లో ఎంత ప్రతిభ ఉన్నా.. మానసికంగా ఫిట్‌గా లేకపోతే ప్రయోజనం లేదని అతడు చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని