CSK - LSG: ఆ రెండు.. ముందుకెళ్లేనా?

ఐపీఎల్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదేమో..! మరొక్క రోజులో లీగ్‌ దశ ముగియనున్నా ప్లేఆఫ్స్‌ చేరే మిగతా మూడు జట్లేవో తేలలేదు.

Updated : 20 May 2023 12:32 IST

ఐపీఎల్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదేమో..! మరొక్క రోజులో లీగ్‌ దశ ముగియనున్నా ప్లేఆఫ్స్‌ చేరే మిగతా మూడు జట్లేవో తేలలేదు. మిగిలింది నాలుగు మ్యాచ్‌లే..! ముందంజ వేయడం కోసం ఆరు జట్లు ఇంకా రేసులోనే ఉన్నాయి. 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువగా ఉన్న చెన్నై, లఖ్‌నవూ శనివారం తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లను ఆడనున్నాయి. కోల్‌కతాతో లఖ్‌నవూ ఢీకొననుండగా.. దిల్లీతో చెన్నై తలపడనుంది. చెన్నై, లఖ్‌నవూ గెలిస్తే చెరో 17 పాయింట్లతో మిగతా ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌ బెర్తులు సాధిస్తాయి. ఓడినా రేసులో ఉంటాయి. కాకపోతే ఆదివారం మ్యాచ్‌లు పూర్తయ్యే వరకు వేచిచూడాల్సిందే. అయితే శనివారం ఈ రెండు జట్లకు విజయం తేలికేం కాదు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన దిల్లీ ప్రమాదకరంగా కనిపిస్తోంది. పోయేదేమీ లేదన్నట్టుగా చెలరేగి ఆడుతున్న ఆ జట్టు తన చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. సొంతగడ్డపై చివరి మ్యాచ్‌ ఆడుతున్న దిల్లీ విజయంతో ఈ సీజన్‌కు వీడ్కోలు పలకాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కోల్‌కతా ఇంకా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించలేదు. అవకాశాలు స్వల్పమే కానీ.. లఖ్‌నవూపై ఘన విజయం సాధించి.. మిగతా జట్ల ఫలితాలు అనుకూలంగా వస్తే ఆ జట్టుకూ ముందంజ వేసే ఛాన్స్‌ ఉంది. కేఎల్‌ రాహుల్‌ గాయంతో వైదొలిగినా కృనాల్‌ పాండ్య సారథ్యంలో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేస్తున్న లఖ్‌నవూ.. కోల్‌కతాను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఒకవేళ చెన్నై, లఖ్‌నవూ విజయం సాధిస్తే.. ఆదివారం చివరి బెర్తు కోసం మూడు జట్లు రేసులో ఉంటాయి. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడనున్న బెంగళూరు.. హైదరాబాద్‌ను ఢీకొననున్న ముంబయి తమ ఆఖరి మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే 16 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ఈ రెండింట్లో ఒక జట్టే గెలిస్తే.. ఆ జట్టు చివరి ప్లేఆఫ్స్‌ బెర్తును దక్కించుకుంటుంది. ఒకవేళ రెండూ ఓడితే.. ఆర్‌సీబీ, ముంబయి ఇండియన్స్‌లతో పాటు రాజస్థాన్‌ 14 పాయింట్లతో సమానంగా నిలుస్తుంది. మెరుగైన రన్‌రేట్‌ కలిగిన ఓ జట్టు ముందుకెళ్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని