CSK vs DC: క్వాలిఫయర్‌కు సీఎస్కే అర్హత

గత సీజన్‌లో లీగ్‌ దశలోనే నిష్క్రమణ.. ఈ సారి కూడా ఆ ఛాంపియన్‌ జట్టుపై ఎన్నో అనుమానాలు! కానీ ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ.. ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో ఘనంగా అడుగుపెట్టింది.

Updated : 21 May 2023 10:09 IST

దిల్లీపై ఘన విజయం
చెలరేగిన రుతురాజ్‌, కాన్వే

గత సీజన్‌లో లీగ్‌ దశలోనే నిష్క్రమణ.. ఈ సారి కూడా ఆ ఛాంపియన్‌ జట్టుపై ఎన్నో అనుమానాలు! కానీ ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ.. ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో ఘనంగా అడుగుపెట్టింది. లీగ్‌ దశలో తన చివరి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసి ముందంజ వేసింది. ఐపీఎల్‌లో తన 14వ సీజన్లో 12వ సారి సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం విశేషం. పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో చెన్నై టోర్నీని ముగించింది. ధోనికి ఇదే చివరి సీజన్‌ అనే ఊహాగానాల మధ్య.. మరో రెండు మ్యాచ్‌ల్లోనైనా అతణ్ని మైదానంలో చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది.

దిల్లీ

సీఎస్కే వచ్చేసింది. ఐపీఎల్‌-16లో ఎనిమిదో విజయంతో, 17 పాయింట్లతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. శనివారం దిల్లీ క్యాపిటల్స్‌ను 77 పరుగుల తేడాతో చెన్నై చిత్తుచేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రుతురాజ్‌ గైక్వాడ్‌ (79; 50 బంతుల్లో 3×4, 7×6), డెవాన్‌ కాన్వే (87; 52 బంతుల్లో 11×4, 3×6) చెలరేగడంతో మొదట సీఎస్కే 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది. శివమ్‌ దూబె (22; 9 బంతుల్లో 3×6), జడేజా (20 నాటౌట్‌; 7 బంతుల్లో 3×4, 1×6) మెరిశారు. అనంతరం నిర్ణీత ఓవర్లలో దిల్లీ 9 వికెట్లకు 146 పరుగులే చేయగలిగింది. వార్నర్‌ (86; 58 బంతుల్లో 7×4, 5×6) మాత్రమే రాణించాడు. దీపక్‌ చాహర్‌ (3/22), పతిరన (2/22), తీక్షణ (2/23) ప్రత్యర్థిని కట్టడి చేశారు. దిల్లీ తొమ్మిదో ఓటమితో సీజన్‌ను ముగించింది.

వార్నర్‌ ఒక్కడే..: 26/3.. భారీ ఛేదనలో 5 ఓవర్లకు దిల్లీ స్కోరిది. ఆ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఈ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గది కేవలం వార్నర్‌ పోరాటమే. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరోవైపు పట్టుదలగా క్రీజులో నిలబడ్డ అతను మంచి షాట్లతో అలరించాడు. అంతకుముందు తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్‌ 2వ)నే పృథ్వీ షా (5)ను తుషార్‌.. అనంతరం వరుస బంతుల్లో ఫిల్‌ సాల్ట్‌ (3), రొసో (0)ను దీపక్‌ చాహర్‌ వెనక్కి పంపడంతో పవర్‌ప్లేలోనే దిల్లీ పనైపోయింది. యశ్‌ ధుల్‌ (13) తో కలిసి వార్నర్‌ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగినా.. లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైనంత వేగంగా ఆడలేకపోయారు.  అయినా వార్నర్‌ మాత్రం ఆగలేదు. జడేజా ఓవర్లో వరుసగా 4, 6, 6 రాబట్టాడు. ఆ ఓవర్లో అక్షర్‌ (15) కూడా ఓ సిక్సర్‌ కొట్టాడు. కానీ మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన చాహర్‌.. అక్షర్‌ను బుట్టలో వేసుకున్నాడు. చివరకు వార్నర్‌ పోరాటానికి పతిరన తెరదించాడు. లాంగాన్‌లో ముందుకు డైవ్‌ చేస్తూ రుతురాజ్‌ పట్టిన క్యాచ్‌కు అతను వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లో తీక్షణ రెండు వికెట్లు తీయడం కొసమెరుపు.

బాదుడే బాదుడు..: ప్లేఆఫ్స్‌లో ఘనంగా అడుగుపెట్టాలని భావించిందేమో.. చెన్నై ఆరంభం నుంచే బాదుడు మంత్రాన్ని జపించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు రుతురాజ్‌, కాన్వే అదిరే ఆరంభాన్నివ్వగా.. శివమ్‌, జడేజా మెరుపు ముగింపునిచ్చారు. తొలి ఓవర్‌ నుంచే బౌండరీల వేట మొదలైంది. పేస్‌, స్పిన్‌ అనే తేడా లేకుండా బాదుడే లక్ష్యంగా రుతురాజ్‌, కాన్వే సాగారు. పవర్‌ప్లేలో 52/0తో నిలిచి భారీస్కోరుపై కన్నేసిన సీఎస్కే.. మధ్యలో మూడు ఓవర్ల పాటు కాస్త నెమ్మదించింది. కానీ దిల్లీకి ఆ ఉపశమనం తాత్కాలికమే. అక్షర్‌ బౌలింగ్‌లో బ్యాక్‌ఫుట్‌పై బలంగా నిలబడి డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా వరుసగా రెండు సిక్సర్లతో రుతురాజ్‌ మళ్లీ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అర్ధశతకం తర్వాత అతను మరింతగా రెచ్చిపోయాడు. కుల్‌దీప్‌ వేసిన 12వ ఓవర్లో హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదేశాడు. ఇందులో ప్రతి షాట్‌ దేనికదే ప్రత్యేకం. మరో ఎండ్‌లో కాన్వే కూడా ఏ మాత్రం తగ్గలేదు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో అలరించాడు. ఎట్టకేలకు ఈ జోడీని 15వ ఓవర్లో చేతన్‌ సకారియా (1/36) విడగొట్టాడు. స్లో షార్ట్‌పిచ్‌ బంతితో రుతురాజ్‌ను బోల్తా కొట్టించి 141 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. కానీ సూపర్‌ ఫామ్‌లో ఉన్న దూబె రాకతో దిల్లీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ఉన్నది కాసేపే అయినా అతను సిక్సర్లతో చెలరేగాడు. కాన్వే కూడా జోరు పెంచడంతో స్కోరుబోర్డు రాకెట్‌ వేగాన్ని అందుకుంది. ఖలీల్‌ (1/45) వేసిన 18వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన దూబె.. చివరి బంతికి ఔటైపోయాడు. దూబె, కాన్వే కలిసి రెండో వికెట్‌కు కేవలం 22 బంతుల్లోనే 54 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాతి ఓవర్లోనే కాన్వే కూడా వెనుదిరిగినా సీఎస్కే 220 దాటిందంటే అందుకు కారణం జడేజా. అతను మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. నోకియా బౌలింగ్‌లో వరుసగా 6, 4 రాబట్టిన జడ్డూ.. చివరి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) రొసో (బి) చేతన్‌ 79; కాన్వే (సి) అమన్‌ (బి) నోకియా 87; శివమ్‌ దూబె (సి) లలిత్‌ (బి) ఖలీల్‌ 22; ధోని నాటౌట్‌ 5; జడేజా నాటౌట్‌ 20; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 223; వికెట్ల పతనం: 1-141, 2-195, 3-195; బౌలింగ్‌: ఖలీల్‌ 4-0-45-1; లలిత్‌ 2-0-32-0; అక్షర్‌ 3-0-32-0; నోకియా 4-0-43-1; చేతన్‌ 4-0-36-1; కుల్‌దీప్‌ 3-0-34-0

దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) రాయుడు (బి) తుషార్‌ 5; వార్నర్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరన 86; సాల్ట్‌ (సి) రహానె (బి) చాహర్‌ 3; రొసో (బి) చాహర్‌ 0; యశ్‌ ధుల్‌ (సి) తుషార్‌ (బి) జడేజా 13; అక్షర్‌ (సి) రుతురాజ్‌ (బి) చాహర్‌ 15; అమన్‌ (సి) అలీ (బి) పతిరన 7; లలిత్‌ (సి) అలీ (బి) తీక్షణ 6; నోకియా నాటౌట్‌ 0; కుల్‌దీప్‌ ఎల్బీ (బి) తీక్షణ 0; చేతన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 146; వికెట్ల పతనం: 1-5, 2-26, 3-26, 4-75, 5-109, 6-131, 7-144, 8-146, 9-146; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-22-3; తుషార్‌ 4-0-26-1; తీక్షణ 4-1-23-2; జడేజా 4-0-50-1; పతిరన 4-0-22-2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని