KKR vs LSG: ఎలిమినేటర్‌కు సూపర్‌ జెయింట్స్‌

లఖ్‌నవూ మురిసింది. ఎనిమిదో విజయంతో ఐపీఎల్‌-16 ప్లేఆప్స్‌కు దూసుకెళ్లింది. పూరన్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో మెరిసిన వేళ ఉత్కంఠ పోరులో ఆ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది.

Updated : 21 May 2023 10:07 IST

ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై విజయం

లఖ్‌నవూ మురిసింది. ఎనిమిదో విజయంతో ఐపీఎల్‌-16 ప్లేఆప్స్‌కు దూసుకెళ్లింది. పూరన్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో మెరిసిన వేళ ఉత్కంఠ పోరులో ఆ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. రింకూ సింగ్‌ మరోసారి అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నా కోల్‌కతాను గెలపించలేకపోయాడు. 17 పాయింట్లతో లీగ్‌ దశను ముగించిన లఖ్‌నవూ.. పట్టికలో చెన్నైతో సమానంగా నిలిచింది. కానీ రన్‌రేట్‌లో వెనుకబడి మూడో స్థానంతో సంతృప్తి చెందింది. ఎనిమిదో ఓటమితో కోల్‌కతా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

కోల్‌కతా

లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ ప్లేఆఫ్స్‌లో ప్రవేశించింది. శనివారం తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. పూరన్‌ (58; 30 బంతుల్లో 4×4, 5×6) మెరవడంతో మొదట లఖ్‌నవూ 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. నరైన్‌ (2/28), వైభవ్‌ అరోరా (2/30) బంతితో రాణించారు. రింకూ సింగ్‌ (67 నాటౌట్‌; 33 బంతుల్లో 6×4, 4×6) గొప్పగా బ్యాటింగ్‌ చేసినా ఛేదనలో కోల్‌కతా 7 వికెట్లకు 175 పరుగులే చేయగలిగింది. జేసన్‌ రాయ్‌ (45; 28 బంతుల్లో 7×4, 1×6) రాణించాడు. రవి బిష్ణోయ్‌ (2/23) సూపర్‌గా బౌలింగ్‌ చేశాడు.

రింకూ మెరిసినా.: జేసన్‌ రాయ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ (24; 15 బంతుల్లో 3×4, 1×6) చెలరేగడంతో ఛేదనలో కోల్‌కతాకు మంచి ఆరంభం లభించింది. 5 ఓవర్లకే స్కోరు 59. కానీ ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను లఖ్‌నవూ ఆసక్తికరంగా మార్చింది. ఆరో ఓవర్లో వెంకటేశ్‌ను ఔట్‌ చేయడం ద్వారా కృనాల్‌ వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత కొద్ది తేడాతో నితీష్‌ రాణా (8), జేసన్‌ రాయ్‌ నిష్క్రమించారు. పది ఓవర్లకు కోల్‌కతా 82/3. రింకూ, గుర్బాజ్‌ (10) నిలిచినా వేగంగా ఆడలేకపోయారు. 14వ ఓవర్లో గుర్బాజ్‌ ఔయ్యేసరికి స్కోరు 108. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగినా రసెల్‌ (9 బంతుల్లో) క్రీజులో ఉండడంతో కోల్‌కతా మంచి ఆశలతోనే ఉంది. కానీ 16 ఓవర్లో అతణ్ని బిష్ణోయ్‌ ఔట్‌ చేయడంతో లఖ్‌నవూ పైచేయిలో నిలిచింది. మరోవైపు రింకూ జోరందుకోలేకపోయాడు. ఎదుర్కొన్న తొలి 20 బంతుల్లో అతడు చేసింది 24 పరుగులే. 17వ ఓవర్లో నవీనుల్‌ అయిదు పరుగులే ఇచ్చాడు. చివరి మూడు ఓవర్లలో కోల్‌కతా 51 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 18వ ఓవర్లో రింకూ ఓ సిక్స్‌ కొట్టినా.. శార్దూల్‌, నరైన్‌ ఔటయ్యారు. చివరి రెండు ఓవర్లలో 41 పరుగులు అవసరం కావడంతో కోల్‌కతాకు కష్టమే అనిపించింది. కానీ రెచ్చిపోయి ఆడిన రింకూ.. నవీనుల్‌ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, సిక్స్‌ బాది మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశాడు. ఆఖరి ఓవర్లో (యశ్‌) కోల్‌కతా 21 పరుగులు చేయాల్సిన స్థితి. తొలి మూడు బంతుల్లో ఆ జట్టు మూడే పరుగులే చేసినా లఖ్‌నవూ ధీమాగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ రింకూ ఉన్నాడు. నాలుగో బంతికి సిక్స్‌ కొట్టి లఖ్‌నవూను అతడు కలవర పెట్టాడు. అయితే తర్వాతి బంతికి రింకూ ఫోర్‌ మాత్రమే కొట్టడంతో లఖ్‌నవూ ఊపిరిపీల్చుకుంది. ఆఖరి బంతికి రింకూ సిక్స్‌ కొట్టినా.. లఖ్‌నవూ ఒక్క పరుగుతో గట్టెక్కింది.

చెలరేగిన పూరన్‌: 73/5. 10.1 ఓవర్లలో లఖ్‌నవూ పరిస్థితిది. కరన్‌ శర్మ (3), ప్రేరక్‌ మన్కడ్‌ (26), డికాక్‌ (28), స్టాయినిస్‌ (0), కృనాల్‌ (9) ఔటయ్యారు. 7 నుంచి 10 ఓవర్ల మధ్య లఖ్‌నవూకు 19 పరుగులే వచ్చాయి. ఆ జట్టు తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకునేలా కనిపించింది. కానీ చెలరేగి ఆడిన పూరన్‌ ఆ జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చిన పూరన్‌.. వస్తూనే బాదుడు మొదలెట్టాడు. ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లోనే.. వరుణ్‌ (11వ ఓవర్లో) బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6 దంచేశాడు. మరోవైపు బదోని (25) అండగా నిలవగా.. పూరన్‌ ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 18వ ఓవర్లో బదోని నిష్క్రమించేటప్పటికి స్కోరు 147. తర్వాతి ఓవర్లో పూరన్‌ రెండు సిక్స్‌లు కొట్టి ఔటయ్యాడు. చివరి ఓవర్లో (రసెల్‌) ఆఖరి రెండు బంతుల్లో గౌతమ్‌ వరుసగా 6, 4 దంచేశాడు. పూరన్‌ జోరుతో చివరి పది ఓవర్లలో లఖ్‌నవూ 103 పరుగులు పిండుకుంది. అతడు బదోనితో ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించాడు.

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: కరన్‌  (సి) శార్దూల్‌ (బి) హర్షిత్‌ 3; డికాక్‌ (సి) రసెల్‌ (బి) వరుణ్‌ 28; ప్రేరక్‌ (సి) హర్షిత్‌  (బి) అరోరా 26; స్టాయినిస్‌ (సి) వెంకటేశ్‌ (బి) అరోరా 0; కృనాల్‌ (సి) రింకూ (బి) నరైన్‌ 9; బదోని (సి) శార్దూల్‌ (బి) నరైన్‌ 25; పూరన్‌ (సి) వెంకటేశ్‌ (బి) శార్దూల్‌ 58; గౌతమ్‌ నాటౌట్‌ 11; బిష్ణోయ్‌ (బి) శార్దూల్‌ 2; నవీనుల్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 176; వికెట్ల పతనం: 1-14, 2-55, 3-55, 4-71, 5-73, 6-147, 7-159, 8-162; బౌలింగ్‌: హర్షిత్‌3-0-21-1; అరోరా 4-0-30-2; వరుణ్‌ 4-0-38-1; నితీష్‌ 1-0-3-0; శార్దూల్‌ 2-0-27-2; నరైన్‌ 4-0-28-2; సుయాశ్‌ 1-0-12-0; రసెల్‌ 1-0-12-0

కోల్‌కతా ఇన్నింగ్స్‌: జేసన్‌ (బి) కృనాల్‌ 45; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) బిష్ణోయ్‌ (బి) గౌతమ్‌ 24; నితీష్‌ (సి) కృనాల్‌ (బి) బిష్ణోయ్‌ 8; గుర్బాజ్‌ (సి) బిష్ణోయ్‌ (బి) యశ్‌ 10; రింకూ  నాటౌట్‌ 67; రసెల్‌ (బి) బిష్ణోయ్‌ 7; శార్దూల్‌ (సి) మన్కడ్‌ (బి) యశ్‌ 3; నరైన్‌ రనౌట్‌ 1; అరోరా నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175; వికెట్ల పతనం: 1-61, 2-78, 3-82, 4-108, 5-120, 6-134, 7-136; బౌలింగ్‌: మోసిన్‌ 1-0-15-0; నవీనుల్‌ 4-0-46-0; కృనాల్‌ 4-0-30-1; గౌతమ్‌ 4-0-26-1; బిష్ణోయ్‌ 4-0-23-2; యశ్‌ 3-0-31-2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు