MI vs SRH: గ్రీన్‌ ధనాధన్‌

ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి చెలరేగింది. ఆదివారం ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుచేసింది.

Updated : 22 May 2023 08:12 IST

కామెరూన్‌ సూపర్‌ సెంచరీ
ముంబయి విజయం
ఓటమితో ముగించిన సన్‌రైజర్స్‌

ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి చెలరేగింది. ఆదివారం ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుచేసింది. మొదట సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు సరిగ్గా 200 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (83; 46 బంతుల్లో 8×4, 4×6), వివ్రాంత్‌ శర్మ (69; 47 బంతుల్లో 9×4, 2×6) అదరగొట్టారు. ముంబయి బౌలర్లలో ఆకాశ్‌ మధ్వాల్‌ (4/37) విజృంభించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కామెరూన్‌ గ్రీన్‌ (100 నాటౌట్‌; 47 బంతుల్లో 8×4, 8×6) సూపర్‌ సెంచరీతో లక్ష్యాన్ని ముంబయి 2 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్‌ శర్మ (56; 37 బంతుల్లో 8×4, 1×6) కూడా రాణించాడు. సన్‌రైజర్స్‌ పదో ఓటమితో పట్టికలో చివరి స్థానంతో సీజన్‌ను ముగించింది.
గ్రీన్‌ పిడుగల్లే..: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఛేదనలో ముంబయి మూడో ఓవర్లోనే ఇషాన్‌ (14) వికెట్‌ కోల్పోయింది. కానీ ఆ ప్రభావం జట్టుపై ఏ మాత్రం పడలేదు. గ్రీన్‌ దూకుడుకు రోహిత్‌ జోరు జత కావడంతో ముంబయి లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ముఖ్యంగా గ్రీన్‌ వస్తూనే బౌండరీలతో హోరెత్తించాడు. అప్పటివరకూ ఓ మోస్తరుగా సాగిన ఇన్నింగ్స్‌కు రాకెట్‌ వేగాన్ని అందించాడు. అతని బ్యాట్‌ ఎక్కువగా సిక్సర్లతోనే మాట్లాడింది. బౌలర్‌ ఎవరనేది చూడకుండా బంతిని అమాంతం ఎత్తి స్టాండ్స్‌లో పడేశాడు. వివ్రాంత్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో కేవలం 20 బంతుల్లోనే అతను అర్ధశతకం పూర్తిచేశాడు. మరోవైపు నితీశ్‌ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌లో సన్వీర్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్‌ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గ్రీûకు తోడు రోహిత్‌ కూడా చెలరేగడంతో 10 ఓవర్లకు 114/1తో ముంబయి విజయం దిశగా సాగింది. అర్ధసెంచరీ తర్వాత రోహిత్‌కు మరో జీవదానం లభించింది. ఈ సారి త్యాగి బౌలింగ్‌లో మళ్లీ సన్వీరే క్యాచ్‌ వదిలేశాడు. మరోవైపు సిక్సర్ల దండయాత్ర కొనసాగించిన గ్రీన్‌ లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు రోహిత్‌ను ఔట్‌ చేసిన మయాంక్‌ దాగర్‌ (1/37).. 128 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. కుడి వైపు గాల్లోకి డైవ్‌ చేస్తూ నితీశ్‌ సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయినా సన్‌రైజర్స్‌కు సంతోషించడానికి ఏమీ లేకుండా పోయింది. సూర్య (25 నాటౌట్‌)తో కలిసి బాదుడు కొనసాగించిన గ్రీన్‌ సాధించాల్సిన రన్‌రేట్‌ను అందుబాటులోకి తెచ్చాడు. సూర్య కూడా దూకుడు కాస్త 24 బంతుల్లో 21 పరుగులుగా మారి ముంబయి విజయం ఖాయమైంది. కానీ గ్రీన్‌ శతకాన్ని అందుకుంటాడా? లేదా? అనే ఉత్కంఠ మొదలైంది. అతను బౌండరీతో 98 పరుగులకు చేరుకున్నాడు. ముంబయికి కావాల్సింది 3 పరుగులే. అప్పుడు అతను సింగిల్‌ తీయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ సూర్య మళ్లీ సింగిల్‌ తీసి స్ట్రైక్‌ ఇవ్వడంతో గ్రీన్‌ ఒక పరుగుతో సెంచరీని చేరుకోవడంతో పాటు మ్యాచ్‌నూ ముగించాడు. అతను 47 బంతుల్లోనే మూడంకెల స్కోరు సాధించాడు. సూర్య, గ్రీన్‌ జోడీ అబేధ్యమైన మూడో వికెట్‌కు 53 పరుగులు జతచేసింది.
ఓపెనర్లు అదుర్స్‌..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌.. సీజన్‌ను ఘనంగా ముగించాలనే ఉద్దేశంతో మొదట బ్యాటింగ్‌లో చెలరేగింది. ఐపీఎల్‌లో తొలిసారి బ్యాటింగ్‌కు వచ్చిన వివ్రాంత్‌.. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటూ సత్తాచాటాడు. మయాంక్‌ తన విలువకు న్యాయం చేస్తూ అదరగొట్టాడు. ఈ ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. వివ్రాంత్‌, మయాంక్‌ ఫోర్ల వేటలో పోటీపడడంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ 53/0తో నిలిచింది. మధ్య ఓవర్లలో ఈ జంట మరింతగా రెచ్చిపోయింది. చావ్లా బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌తో మిడ్‌వికెట్‌పై నుంచి స్టాండ్స్‌లోకి బంతిని పంపించిన వివ్రాంత్‌ సిక్సర్ల ఖాతా తెరిచాడు. జోర్డాన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను.. ఆ వెంటనే ఐపీఎల్‌లో తొలి అర్ధశతకాన్ని సాధించాడు. వరుసగా సిక్సర్‌, ఫోర్‌తో మయాంక్‌ కూడా ఆ మైలురాయి చేరుకున్నాడు. 13 ఓవర్లకు 130/0తో నిలిచిన సన్‌రైజర్స్‌.. అలవోకగా 220కి పైగా పరుగులు చేస్తుందనిపించింది. కానీ ఆకాశ్‌ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. మొదట వివ్రాంత్‌ను ఔట్‌ చేసి ముంబయికి ఉపశమనాన్ని అందించిన ఆకాశ్‌.. తన తర్వాతి ఓవర్లో సెంచరీ దిశగా సాగుతున్న మయాంక్‌ను బోల్తా కొట్టించాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (1)ను ఔట్‌ చేసిన జోర్డాన్‌ (1/42) కూడా కట్టుదిట్టంగా బంతులేశాడు. 7 నుంచి 16 ఓవర్ల మధ్య 115 పరుగులు రాబట్టిన సన్‌రైజర్స్‌.. ఆకాశ్‌ ధాటికి చివరి ఓవర్లలో పూర్తిగా తడబడింది. 19వ ఓవర్లో వరుస బంతుల్లో గత మ్యాచ్‌ సెంచరీ హీరో క్లాసెన్‌ (18), హ్యారీ బ్రూక్‌ (0)ను బౌల్డ్‌ చేసిన ఆకాశ్‌.. సన్‌రైజర్స్‌ను గట్టిదెబ్బ కొట్టాడు. 17వ ఓవర్లో మూడో బంతి మొదలు.. 18 బంతులు పాటు ఆ జట్టు ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయింది. చివరి బంతికి మార్‌క్రమ్‌ సిక్సర్‌తో సన్‌రైజర్స్‌ 200 స్కోరును అందుకుంది.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వివ్రాంత్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) ఆకాశ్‌ 69; మయాంక్‌ (సి) ఇషాన్‌ (బి) ఆకాశ్‌ 83; క్లాసెన్‌ (బి) ఆకాశ్‌ 18; ఫిలిప్స్‌ (సి) కార్తీకేయ (బి) జోర్డాన్‌ 1; మార్‌క్రమ్‌ నాటౌట్‌ 13; బ్రూక్‌ (బి) ఆకాశ్‌ 0; సన్వీర్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200; వికెట్ల పతనం: 1-140, 2-174, 3-177, 4-186, 5-186; బౌలింగ్‌: బెరెన్‌డార్ఫ్‌ 3-0-36-0; గ్రీన్‌ 1-0-2-0; జోర్డాన్‌ 4-0-42-1; ఆకాశ్‌ మధ్వాల్‌ 4-0-37-4; పియూష్‌ చావ్లా 4-0-39-0; కార్తీకేయ 4-0-39-0
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) బ్రూక్‌ (బి) భువనేశ్వర్‌ 14; రోహిత్‌ (సి) నితీశ్‌ (బి) మయాంక్‌ దాగర్‌ 56; గ్రీన్‌ నాటౌట్‌ 100; సూర్యకుమార్‌ నాటౌట్‌ 25; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (18 ఓవర్లలో 2 వికెట్లకు) 201; వికెట్ల పతనం: 1-20, 2-148; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-26-1; నితీశ్‌ 3-0-35-0; మయాంక్‌ దాగర్‌ 4-0-37-1; కార్తీక్‌ త్యాగి 2.5-0-41-0; ఉమ్రాన్‌ 3-0-41-0; వివ్రాంత్‌ 1-0-19-0; మార్‌క్రమ్‌ 0.1-0-1-0


2

టీ20 క్రికెట్లో 11 వేల పరుగుల మైలురాయి చేరుకున్న భారత ఆటగాళ్లలో రోహిత్‌ స్థానం. అగ్రస్థానంలో కోహ్లి (11,864) ఉన్నాడు. ముంబయి ఇండియన్స్‌ తరపున 5 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక ఆటగాడు రోహిత్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని