నార్కో పరీక్షకు సిద్ధం

జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నార్కో పరీక్షకు తాను సిద్ధమని.. వినేశ్‌ ఫొగాట్‌

Published : 23 May 2023 02:32 IST

దిల్లీ: జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నార్కో పరీక్షకు తాను సిద్ధమని.. వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియాలకు కూడా పరీక్ష నిర్వహించాలని బ్రిజ్‌భూషణ్‌ చేసిన వ్యాఖ్యలకు రెజ్లర్లు స్పందించారు. తాము కూడా సవాల్‌కు సిద్ధమని స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా అన్నాడు. ‘‘తనతో పాటు నాకు, వినేశ్‌కు నార్కో పరీక్ష చేయాలని బ్రిజ్‌భూషణ్‌ అంటున్నాడు. పరీక్షకు మేం సిద్ధమే. కానీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పరీక్ష జరగాలని, అది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని మేం కోరుతున్నాం. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూడాలనుకుంటున్నాం. నాకు, వినేశ్‌కు పరీక్షలు చేయాలని అతడు అన్నాడు. కేవలం మాకిద్దరికే ఎందుకు? అతడిపై ఫిర్యాదు చేసిన అమ్మాయిలందరికీ ఈ పరీక్ష చేయాలి’’ అని బజ్‌రంగ్‌ పేర్కొన్నాడు. ‘‘బ్రిజ్‌భూషణ్‌ స్టార్‌ కాదు.  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి. అతణ్ని అలాగే చూడాలి’’ అని వినేశ్‌ ఫొగాట్‌ చెప్పింది. బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన నిరసన కార్యక్రమానికి (మే 23) నెల పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఇండియా గేట్‌ దగ్గర మరోసారి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నట్లు ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మలిక్‌ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని