బెల్జియంతో భారత్‌ పోరు నేడు

హాకీ ప్రో లీగ్‌ 2022-23 సీజన్‌ రెండో అంచెకు వేళైంది. శుక్రవారం ఈ టోర్నీ ఆరంభం కాబోతోంది. తొలి మ్యాచ్‌లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ బెల్జియంతో భారత్‌ తలపడుతుంది.

Published : 26 May 2023 01:50 IST

హాకీ ప్రో లీగ్‌
రాత్రి 7.10 నుంచి

లండన్‌: హాకీ ప్రో లీగ్‌ 2022-23 సీజన్‌ రెండో అంచెకు వేళైంది. శుక్రవారం ఈ టోర్నీ ఆరంభం కాబోతోంది. తొలి మ్యాచ్‌లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ బెల్జియంతో భారత్‌ తలపడుతుంది. స్వదేశంలో జరిగిన తొలి అంచెలో 8 మ్యాచ్‌లు ఆడిన హర్మన్‌ప్రీత్‌సింగ్‌ సారథ్యంలోని భారత్‌ (5 విజయాలు) 19 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌ జర్మనీ, బలమైన ఆస్ట్రేలియాలను కంగుతినిపించింది. ఐరోపాలో జరగబోయే రెండో అంచెలోనూ ఇదే జోరు కొనసాగించాలని భారత్‌ పట్టుదలతో ఉంది. అయితే బెల్జియంపై నెగ్గి శుభారంభం చేయడం హర్మన్‌ప్రీత్‌ బృందానికి అంత తేలికేం కాదు. ప్రొ లీగ్‌లో భాగంగా చివరిగా ఆ జట్టుతో ఆడిన మ్యాచ్‌లో భారత్‌ 2-3 గోల్స్‌తో ఓడిపోయింది. ‘‘గత అయిదారేళ్లుగా భారత్‌-బెల్జియం మధ్య ఆరోగ్యకరమైన పోటీ నడుస్తోంది. ఆ జట్టుతో తలపడటాన్ని ఆస్వాదిస్తాం. గణాంకాలు చూసుకుంటే ఈ మధ్య చాలా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. మరోసారి సత్తా చాటుతామనే విశ్వాసంతో ఉన్నాం’’ అని హర్మన్‌ప్రీత్‌ చెప్పాడు. 2016 రియో ఒలింపిక్స్‌ తర్వాత భారత్‌-బెల్జియం 19 మ్యాచ్‌లు ఆడగా.. బెల్జియం 9, భారత్‌ 8 నెగ్గాయి. హాకీ ప్రొ లీగ్‌ రెండో అంచెలో బెల్జియంతో పాటు ఆతిథ్య బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, అర్జెంటీనాతో భారత్‌ పోటీపడనుంది. కొత్త కోచ్‌ క్రెయిగ్‌ ఫుల్టాన్‌కు కూడా ఈ అంచె పరీక్షే. గ్రాహం రీడ్‌ నుంచి పగ్గాలు చేపట్టిన ఫుల్టాన్‌.. తన తొలి టోర్నీలో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు