బుమ్రాకు ప్రత్యామ్నాయాన్ని కాదు.. మధ్వాల్‌

స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు తాను ప్రత్యామ్నాయం కాదని... తన వంతు బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తున్నానని ముంబయి ఇండియన్స్‌ సంచలన పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ చెప్పాడు.

Updated : 26 May 2023 05:52 IST

చెన్నై: స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు తాను ప్రత్యామ్నాయం కాదని... తన వంతు బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తున్నానని ముంబయి ఇండియన్స్‌ సంచలన పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ చెప్పాడు. లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌తో ఎలిమినేటర్‌లో 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసిన నేపథ్యంలో మధ్వాల్‌ ఇలా స్పందించాడు. ‘‘ముంబయి నాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నేనేమి బుమ్రాకు ప్రత్యామ్నాయం కాదు. కానీ నా వంతుగా ఏం చేయగలనో అది చేస్తున్నా. లఖ్‌నవూతో ఎలిమినేటర్‌లో చెపాక్‌ పిచ్‌ నుంచి పేసర్లకు పూర్తి సహకారం లేకపోయినా.. బ్యాటర్లకు దొరకని లెంగ్త్‌లో బంతిని వేసి వికెట్ల కోసం ప్రయత్నించి ఫలితం సాధించా. కెప్టెన్‌ రోహిత్‌ భాయ్‌కి నా బలమేంటో తెలుసు. నెట్స్‌లో ఎక్కువగా యార్కర్లు వేసినా..కొత్త బంతితో బౌలింగ్‌ చేయగలనని నమ్మాడు. అందుకే ఏ స్థితిలో నన్ను బరిలో దింపాలో అతడికి అవగాహన ఉంది’’ అని ఆకాశ్‌ చెప్పాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 29 ఏళ్ల మధ్వాల్‌.. ఇంజనీర్‌ కూడా కావడం విశేషం. స్టార్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ఇంటికి ఎదురింట్లోనే ఉండే మధ్వాల్‌.. రిషబ్‌కు శిక్షణ ఇచ్చిన అవతార్‌సింగ్‌ దగ్గరే క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. తన కెరీర్‌లో ఎక్కువగా టెన్నిస్‌ బంతితోనే ఆడిన అతడు.. బ్యాటర్లు సిక్సర్లు కొట్టకుండా యార్కర్లు వేయడాన్ని అలవాటు చేసుకున్నాడు. 2019లో ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు నెట్‌ బౌలర్‌గా సేవలందించిన మధ్వాల్‌ ఆ తర్వాత ముంబయి జట్టులో కూడా కొన్నాళ్లు అదే పాత్రలో కొనసాగాడు. ఈ ఐపీఎల్‌ సీజన్లో స్టార్‌ పేసర్‌ ఆర్చర్‌ గాయంతో వైదొలగడంతో మధ్వాల్‌కు కలిసొచ్చింది. ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడమే కాదు ఇప్పటిదాకా 7 మ్యాచ్‌లు ఆడి 12.85 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు