ధోనీకి అలా.. రోహిత్‌కు ఇలా

ఐపీఎల్‌- 16 ఎలిమినేటర్‌లో లఖ్‌నవూపై వ్యూహాలకు గాను ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మకు ఘనత దక్కాలని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 27 May 2023 02:45 IST

దిల్లీ: ఐపీఎల్‌- 16 ఎలిమినేటర్‌లో లఖ్‌నవూపై వ్యూహాలకు గాను ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మకు ఘనత దక్కాలని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. అదే ఆ స్థానంలో ధోని ఉంటే ఇప్పటికే హంగామా చేసేవాళ్లని అతనన్నాడు. ‘‘అవును.. రోహిత్‌ను తక్కువ అంచనా వేస్తున్నారు. ముంబయి ఇండియన్స్‌ కోసం అతను 5 టైటిళ్లు నెగ్గాడు. లఖ్‌నవూతో ఎలిమినేటర్‌లో మంచి కెప్టెన్సీ ప్రదర్శన చేశాడు. ఉదాహరణకు.. ఓవర్‌ ద వికెట్‌ నుంచి బౌలింగ్‌ చేసి బదోనీని ఆకాశ్‌ ఔట్‌ చేశాడు. వెంటనే రౌండ్‌ ద వికెట్‌ నుంచి బంతి వేసి ఎడమ చేతి వాటం బ్యాటర్‌ పూరన్‌ను పెవిలియన్‌ చేర్చాడు. ఓవర్‌ ద వికెట్‌ నుంచి బౌలింగ్‌ చేస్తూ వికెట్‌ లభిస్తే.. క్రీజులో ఎడమ చేతి వాటం బ్యాటర్‌ ఉన్నా అదే వైపు నుంచి బౌలింగ్‌ కొనసాగించేందుకే బౌలర్‌ చూస్తాడు. కానీ ఇక్కడ ఆకాశ్‌ రౌండ్‌ ద వికెట్‌ నుంచి బౌలింగ్‌ చేసి అద్భుతమైన బంతితో వికెట్‌ సాధించాడు. ఒకవేళ ముంబయి స్థానంలో సీఎస్కే ఉండి, ధోని కెప్టెన్‌గా ఉంటే.. ధోని తన వ్యూహంతో పూరన్‌ ఆట కట్టించాడని గొప్పగా చెప్పేవాళ్లు. కానీ ఇక్కడ రౌండ్‌ ద వికెట్‌ నుంచి బౌలింగ్‌ వేయమని ఆకాశ్‌కు చెప్పిన రోహిత్‌కు ఆ ఘనత దక్కడం లేదు. అలాగే మొదట నేహాల్‌ వధేరాను ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బరిలో దింపారు. సాధారణంగా మొదట బ్యాటింగ్‌ చేసేటప్పుడు జట్లు అదనపు బ్యాటర్‌ను ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా ఆడించడం లేదు. కానీ రోహిత్‌.. నేహాల్‌ను వాడుకున్నాడు. అందుకు కూడా రోహిత్‌కు ఘనత దక్కాలి’’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని