MI vs GT: ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే..

గుజరాత్‌తో మ్యాచ్‌లో గిల్‌ క్యాచ్‌లు వదిలేసిన ముంబయి ఫీల్డర్లు.. తమ జట్టు నిష్క్రమణకు కారణమయ్యారనే చెప్పాలి.

Updated : 27 May 2023 08:22 IST

ముంబయికి గాయాల దెబ్బ

గుజరాత్‌తో మ్యాచ్‌లో గిల్‌ క్యాచ్‌లు వదిలేసిన ముంబయి ఫీల్డర్లు.. తమ జట్టు నిష్క్రమణకు కారణమయ్యారనే చెప్పాలి. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే గిల్‌ ఔటవ్వాల్సింది. జోర్డాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ అయిదో బంతికి గిల్‌ షాట్‌ ఆడగా.. మిడాన్‌లో ఉన్న టిమ్‌ డేవిడ్‌ డైవ్‌ చేయగా.. బంతి చేతుల్లో పడి ఎగిరిపోయింది. ఆ తర్వాత కార్తీకేయ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌వికెట్లో తిలక్‌ వర్మ తన కాళ్ల ముందు పడ్డ బంతిని ఆపేందుకే చూశాడు కానీ క్యాచ్‌ అందుకునే ప్రయత్నం చేయలేదు. ఇక అర్ధశతకం తర్వాత తన బౌలింగ్‌లోనే గిల్‌ బలంగా కొట్టడంతో దూసుకొచ్చిన బంతిని గ్రీన్‌ పట్టలేకపోయాడు. అప్పుడు అతని స్కోరు 58. సిక్సర్లతో చెలరేగిన గిల్‌ ఆ తర్వాత 24 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు.

మ్యాచ్‌లో ఆటగాళ్లకు గాయాలూ ముంబయిని దెబ్బకొట్టాయి. ఇషాన్‌ కిషన్‌ అనూహ్యంగా గాయపడ్డాడు. 16వ ఓవర్‌ బౌలింగ్‌ చేసిన తర్వాత జోర్డాన్‌ తన టోపీ సర్దుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఇషాన్‌ ఎడమ కంటికి జోర్డాన్‌ మోచేయి బలంగా తాకింది. నొప్పితో మైదానం వీడిన అతను బ్యాటింగ్‌కే రాలేదు. అతని స్థానంలో విష్ణు వినోద్‌ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆడాడు. తర్వాత బంతిని ఆపబోయి రోహిత్‌ వేలికి గాయమై బయటకు వెళ్లాల్సి వచ్చింది. కాసేపు జట్టును సూర్య నడిపించాడు. బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్‌ త్వరగానే ఔటైపోయాడు. హార్దిక్‌ బౌన్సర్‌ మోచేతికి బలంగా తాకడంతో గ్రీన్‌ బ్యాటింగ్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెళ్లి.. తిలక్‌ ఔటయ్యాక తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని