GT vs MI: గిల్‌ తగ్గలేదు.. గుజరాత్‌ వదల్లేదు

ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం వర్షం ఆగింది. కానీ ఆ తర్వాతే పెను తుపాను మొదలైంది.

Updated : 27 May 2023 08:10 IST

శుభ్‌మన్‌ మూడో శతకం
వరుసగా రెండో ఫైనల్లో టైటాన్స్‌
ముంబయి చిత్తు

ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం వర్షం ఆగింది. కానీ ఆ తర్వాతే పెను తుపాను మొదలైంది. అది మామూలు తుపాను కాదు.. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన గిల్‌ సృష్టించిన బీభత్సం. బంతిపై ఏదో కోపం ఉన్నట్లు.. స్టాండ్స్‌లోని ప్రేక్షకులే లక్ష్యం అన్నట్లు.. శుభ్‌మన్‌ వీర విధ్వంసం సాగించాడు. మంచినీళ్లు తాగినంత సులభంగా నాలుగు మ్యాచ్‌ల్లో మూడో శతకాన్ని అందుకున్నాడు. 2016లో తిరుగులేని ఆధిపత్యంతో కోహ్లి ఏకంగా 973 పరుగులు కొట్టగా.. ఇప్పుడు గిల్‌ అంతటి పెత్తనం చెలాయిస్తూ ఇప్పటికే 851 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. అనంతరం మోహిత్‌తో సహా బౌలర్లు అదరగొట్టడంతో ముంబయిని చిత్తుచేసిన గుజరాత్‌ ఐపీఎల్‌-16 ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం చెన్నైతో అమీతుమీకి సిద్ధమైంది.

రెండు జట్ల మధ్య తొలిసారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ సమరంలో ముంబయి ఇండియన్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌దే పైచేయి. శుక్రవారం రెండో క్వాలిఫయర్స్‌లో ఆ జట్టు 62 పరుగుల తేడాతో ముంబయిపై గెలిచి టైటాన్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుభ్‌మన్‌ గిల్‌ (129; 60 బంతుల్లో 7×4, 10×6) విధ్వంసక శతకంతో మొదట గుజరాత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (43; 31 బంతుల్లో 5×4, 1×6) గిల్‌కు చక్కటి సహకారం అందించాడు. ఛేదనలో ముంబయి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్‌ (61; 38 బంతుల్లో 7×4, 2×6), తిలక్‌ వర్మ (43; 14 బంతుల్లో 5×4, 3×6) పోరాటం సరిపోలేదు. మోహిత్‌ శర్మ (5/10) ఆ జట్టును దెబ్బకొట్టాడు. అంతకుముందు వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా మ్యాచ్‌ మొదలైంది.

ఆశలు రేపినా..

కొండంత లక్ష్య ఛేదనలో ముంబయికి ఆశించిన ఆరంభం దక్కలేదు. కానీ తిలక్‌, గ్రీన్‌ (30), సూర్య ఆశలు రేపినా.. జట్టును గెలిపించలేకపోయారు. ఇషాన్‌ ఆడలేకపోవడంతో ఆకాశ్‌ స్థానంలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా వచ్చిన నేహాల్‌ (4)తో రోహిత్‌ (8) ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న షమి (2/41).. తన వరుస ఓవర్లలో ఓపెనర్లను ఔట్‌ చేసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. మధ్యలో మోచేతి గాయంతో గ్రీన్‌ బయటకు వెళ్లాల్సి వచ్చింది. ముంబయి పరిస్థితి అగమ్యగోచరంగా కనిపించింది. కానీ వస్తూనే బౌలర్లపై తిలక్‌ ఎదురుదాడికి దిగాడు. ఉన్నంతసేపు ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. షమి ఓవర్లో అతను వరుసగా నాలుగు ఫోర్లతో పాటు ఓ సిక్సర్‌ కూడా కొట్టడం విశేషం. బంతిని గట్టిగా బాదాలనే కసితో తిలక్‌ కనిపించాడు. ప్రమాదకర రషీద్‌ (2/33) బౌలింగ్‌లోనూ ఓ బౌండరీ సాధించాడు. కానీ అదే ఓవర్లో స్లాగ్‌స్వీప్‌కు ప్రయత్నించి బౌల్డవడంతో ముంబయి 6 ఓవర్లకు 72/3తో నిలిచింది. మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన గ్రీన్‌తో కలిసి సూర్య జట్టును లక్ష్యం దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ చకచకా బౌండరీలు బాదేస్తూ జట్టును నడిపించారు. 11 ఓవర్లకు 123/3తో ముంబయి అప్పటికీ రేసులోనే ఉంది. కానీ గిల్‌ స్థానంలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా వచ్చిన లిటిల్‌ (1/26) తన తొలి ఓవర్లోనే గ్రీన్‌ను బౌల్డ్‌ చేసి ఇంపాక్ట్‌ చూపించాడు. మరోవైపు 360 డిగ్రీల ఆటతో సూర్య పోరాటం కొనసాగించాడు. లిటిల్‌ బౌలింగ్‌లో స్కూప్‌తో అదిరే సిక్సర్‌తో అర్ధశతకం చేరుకున్నాడు. 14.2 ఓవర్లకు స్కోరు 155/4. కానీ ఆ తర్వాత మోహిత్‌ మాయ మొదలైంది. బంతి అందుకున్న మోహిత్‌.. మొదట సూర్యను బౌల్డ్‌ చేయడంతో ముంబయి ఆశలకు తెరపడింది. ఆఫ్‌సైడ్‌ జరిగి షాట్‌ ఆడేందుకు సూర్య ప్రయత్నించగా.. బంతి లెగ్‌స్టంప్‌ను ముద్దాడింది. తర్వాతి ఓవర్లోనే డేవిడ్‌ (2)ను రషీద్‌ పెవిలియన్‌ చేర్చడంతో ముంబయి పనైపోయింది. చివరి ఆరు వికెట్లలో మోహిత్‌ అయిదు సొంతం చేసుకోవడం విశేషం. 16 పరుగుల వ్యవధిలో ముంబయి చివరి ఆరు వికెట్లు కోల్పోయింది.

బాదుడే బాదుడు..

అంతకుముందు టాస్‌ గెలిచిన ముంబయి ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ను అంతా తానై గిల్‌ నడిపించాడు. వర్షం ప్రభావం పెద్దగా కనిపించని పిచ్‌పై సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ గిల్‌ మరోసారి రెచ్చిపోయాడు. ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడమూ అతనికి కలిసొచ్చింది. పవర్‌ప్లేను టైటాన్స్‌ 50/0తో ముగించింది. కానీ ఆ వెంటనే బంతి అందుకున్న చావ్లా (1/45).. సాహాను బుట్టలో వేసుకున్నాడు. కానీ సుదర్శన్‌ జతగా గిల్‌ చెలరేగడంతో టైటాన్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అర్ధశతకం తర్వాత గిల్‌ విధ్వంసం తారస్థాయికి చేరింది. అతను సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. గత మ్యాచ్‌లో అయిదు వికెట్లతో జోరు మీదున్న ఆకాశ్‌ (1/52) బౌలింగ్‌లో ఎదురు దాడికి దిగిన గిల్‌.. ఒకే ఓవర్లో మూడు కళ్లుచెదిరే సిక్సర్లు కొట్టాడు. చావ్లా ఓవర్లోనూ రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో అదే శిక్ష వేశాడు. అందులో ఒక బంతిని క్రీజు వదిలి ముందుకు వచ్చి వైడ్‌ లాంగాన్‌ మీదుగా 106 మీటర్ల దూరానికి పంపించాడు. అదే ఊపులో కేవలం 49 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. మొదట 32 బంతుల్లో 50 పరుగులు చేసిన గిల్‌.. మరో 17 బంతుల్లోనే సెంచరీని చేరుకోవడం అతని ఊచకోతకు నిదర్శనం. ఆ తర్వాతా అతని వీర బాదుడు కొనసాగింది. బౌలర్లందరూ అతని బాధితులే. సుదర్శన్‌ కూడా గేరు మార్చడంతో 16 ఓవర్లకే జట్టు స్కోరు 183/1. ఆ తర్వాతి ఓవర్లోనే గిల్‌ హీరోచిత ఇన్నింగ్స్‌కు ఆకాశ్‌ ముగింపు పలికాడు. దీంతో 138 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అందులో శుభ్‌మన్‌వే 95 (38 బంతుల్లో) పరుగులు కావడం విశేషం. ఇక వస్తూనే హార్దిక్‌ (28 నాటౌట్‌; 13 బంతుల్లో 2×4, 2×6) బ్యాట్‌ ఝుళిపించాడు. కానీ సుదర్శన్‌ బౌండరీలు సాధించడంలో విఫలమవడంతో 18, 19 ఓవర్లు కలిపి 16 పరుగులే వచ్చాయి. వేగంగా ఆడడంలో ఇబ్బంది పడ్డ సుదర్శన్‌ రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరగడం గమనార్హం. ఇన్నింగ్స్‌ చివరి రెండు బంతులకు 4, 6 కొట్టిన హార్దిక్‌ జట్టు స్కోరును 230 దాటించాడు.


గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) చావ్లా 18; శుభ్‌మన్‌ (సి) డేవిడ్‌ (బి) ఆకాశ్‌ 129; సుదర్శన్‌ రిటైర్డ్‌ ఔట్‌ 43; హార్దిక్‌ నాటౌట్‌ 28, రషీద్‌ ఖాన్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 233

వికెట్ల పతనం: 1-54, 2-192, 3-214

బౌలింగ్‌: బెరెండార్ఫ్‌ 4-0-28-0; గ్రీన్‌ 3-0-35-0; ఆకాశ్‌ మధ్వాల్‌ 4-0-52-1; జోర్డాన్‌ 4-0-56-0; చావ్లా 3-0-45-1; కార్తికేయ 2-0-15-0

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) లిటిల్‌ (బి) షమి 8; నేహాల్‌ (సి) సాహా (బి) షమి 4; గ్రీన్‌ (బి) లిటిల్‌ 30; సూర్యకుమార్‌ (బి) మోహిత్‌ 61; తిలక్‌ (బి) రషీద్‌ 43; వినోద్‌ (సి) హార్దిక్‌ (బి) మోహిత్‌ 5; డేవిడ్‌ ఎల్బీ (బి) రషీద్‌ 2; జోర్డాన్‌ (సి) సుదర్శన్‌ (బి) మోహిత్‌ 2; చావ్లా (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 0; కార్తికేయ (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 6; బెరెండార్ఫ్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (18.2 ఓవర్లలో ఆలౌట్‌) 171 

వికెట్ల పతనం: 1-5, 2-21, 3-72, 4-124, 5-155, 6-156, 7-158, 8-161, 9-162

బౌలింగ్‌: షమి 3-0-41-2; హార్దిక్‌ 2-0-24-0; రషీద్‌ ఖాన్‌ 4-0-33-2; నూర్‌ అహ్మద్‌ 4-0-35-0; జోష్‌ లిటిల్‌ 3-0-26-1; మోహిత్‌ శర్మ 2.2-0-10-5


3

ఓ ఐపీఎల్‌ సీజన్‌లో  3 లేదా అంతకంటే ఎక్కువ శతకాలు చేసిన బ్యాటర్లలో శుభ్‌మన్‌ స్థానం. 2016లో కోహ్లి, 2022లో బట్లర్‌ చెరో నాలుగు సెంచరీల చొప్పున సాధించారు.


3

ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ప్రస్తుతానికి శుభ్‌మన్‌ స్థానం. 2016లో కోహ్లి 973 పరుగులు, 2022లో బట్లర్‌ 863 పరుగులు చేయగా.. ఈ సీజన్‌లో గిల్‌ ఇప్పటివరకూ 851 పరుగులు సాధించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని