IPL Final - CSK vs GT: పదహారు పట్టేదెవరో!
కొన్ని జట్లు పాత కథనే పునరావృతం చేస్తూ ముందే రేసు నుంచి తప్పుకొన్నాయి.. కొన్ని ఆశాజనకంగా సీజన్‌ను ఆరంభించి మధ్యలో గాడితప్పాయి.. కొన్ని జట్లు చివరి దశలో చేతులెత్తేశాయి. నిలకడ లేని.. కూర్పు కుదరని.. అదృష్టాన్ని నమ్ముకున్న జట్ల కథ కంచికి చేరింది.
గుజరాత్‌తో చెన్నై అమీతుమీ
ఐపీఎల్-16 అంతిమ సమరం నేడే
ధోని, శుభ్‌మన్‌ల మీదే అందరి కళ్లూ
రాత్రి 7.30 నుంచి
కొన్ని జట్లు పాత కథనే పునరావృతం చేస్తూ ముందే రేసు నుంచి తప్పుకొన్నాయి.. కొన్ని ఆశాజనకంగా సీజన్‌ను ఆరంభించి మధ్యలో గాడితప్పాయి.. కొన్ని జట్లు చివరి దశలో చేతులెత్తేశాయి. నిలకడ లేని.. కూర్పు కుదరని.. అదృష్టాన్ని నమ్ముకున్న జట్ల కథ కంచికి చేరింది. సీజన్లో అత్యంత నిలకడగా ఆడుతూ.. ఉత్తమంగా కనిపించిన రెండు జట్లే తుది పోరుకు అర్హత సాధించాయి. ఈసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడానికి గుజరాత్, చెన్నైల్లో ఓ జట్టే అర్హమైందని ఎవ్వరైనా అంగీకరించాల్సిందే! స్టార్ కళ కంటే.. సమష్టితత్వాన్ని నమ్ముకుని ముందుకు సాగిన ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర సమరానికి రంగం సిద్ధం. మరి అత్యధిక టైటిళ్ల ముంబయి రికార్డును చెన్నై సమం చేస్తుందా? వరుసగా రెండో సీజన్లోనూ విజేతగా నిలిచి గుజరాత్ తన ఆధిపత్యాన్ని చాటుతుందా?
అహ్మదాబాద్: ఐపీఎల్-16లో ఆసక్తికర అంతిమ పోరుకు అంతా సిద్ధం. గ్రూప్ దశలో ఉత్తమ ప్రదర్శనతో టాప్-2లో నిలిచిన రెండు జట్ల మధ్యనే ఆదివారం టైటిల్ పోరు జరగబోతోంది. నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై.. నిరుడు ఐపీఎల్‌లో అడుగు పెట్టగానే విజేతగా నిలిచిన గుజరాత్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. సమష్టితత్వాన్ని నమ్ముకుని, నిలకడగా విజయాలు సాధిస్తూ ఫైనల్ వరకు వచ్చిన ఈ రెండు జట్లూ అదే ఒరవడితో కప్పు నెగ్గాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాయి. చెన్నైకి ధోని, గుజరాత్‌కు హార్దిక్ రూపంలో ప్రశాంతంగా పని చేసుకుపోయే కెప్టెన్లున్నారు. మొత్తంగా చూస్తే బలాబలాల్లో రెండు జట్లూ సమవుజ్జీల్లా కనిపిస్తుండగా.. బౌలింగ్‌లో గుజరాత్, బ్యాటింగ్‌లో చెన్నై కొంచెం పైచేయిలో ఉన్నాయి. తమకు మంచి రికార్డున్న, చెన్నైకి చేదు జ్ఞాపకాలున్న అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరుగతుండటం గుజరాత్‌కు కలిసొచ్చే అంశం. కానీ ధోని నాయకత్వం, సుడి కలిసొస్తే అయిదో కప్పు తమ సొంతం అవుతుందని చెన్నై భావిస్తోంది.
అతణ్ని ఆపేదెవరు?
గుజరాత్ అగ్రస్థానంతో గ్రూప్ దశను ముగించి.. క్వాలిఫయర్-2లో అలవోకగా ముంబయిని ఓడించి ఫైనల్ చేరిందంటే బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ మెరుపులే ప్రధాన కారణం. 16 మ్యాచ్‌ల్లో అతను ఏకంగా 851 పరుగులు బాదేశాడు. జట్టులో అతడి తర్వాతి స్కోరర్ 325 చేసిన హార్దిక్ పాండ్యనే అంటే.. గుజరాత్ బ్యాటింగ్‌ను అతనెలా ముందుకు నడిపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. జట్టులో మరే బ్యాటర్ నిలకడగా ఆడట్లేదు. కానీ ఒక వైపు గిల్ మాత్రం నిలబడిపోతున్నాడు. హార్దిక్, సాహా, మిల్లర్, విజయ్ శంకర్, సాయి సుదర్శన్.. ఇలా ఎవరో ఒకరు అతడికి సహకారం అందిస్తున్నారు. అలా గుజరాత్ భారీ స్కోర్లు సాధిస్తోంది. లక్ష్యాల్ని ఛేదిస్తోంది. ముంబయితో క్వాలిఫయర్-2లో ఉగ్రరూపం దాల్చి అద్భుత శతకం బాదిన గిల్.. మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు శతకాలతో 2016లో కోహ్లిని గుర్తుకు తెచ్చాడతను. ప్రస్తుత ఫామ్‌లో శుభ్‌మన్‌ను ఆపడం చెన్నై బౌలర్లకు సవాలే. మలింగను పోలిన బౌలింగ్ యాక్షన్‌తో బంతులేసే పతిరనపై సీఎస్‌కే ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. అతడితో పాటు దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, తీక్షణ, జడేజా.. శుభ్‌మన్‌ను ఎంతమేర పరీక్షించగలరో చూడాలి. కానీ తిరుగులేని టెక్నిక్, దానికి తోడు ఎంతో ఓపిక ఉన్న శుభ్‌మన్.. చెన్నై మీదా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడని గుజరాత్ ఆశిస్తోంది. అతణ్ని త్వరగా పెవిలియన్ చేరిస్తే.. చెన్నై పైచేయి సాధించినట్లే.
మహి మళ్లీ కనిపించడా?
ఇంకో 40 రోజుల్లోనే 42వ పుట్టిన రోజు జరుపుకోనున్న ధోని.. ఇంకా ఐపీఎల్‌లో కొనసాగుతుండటం ఆశ్చర్యమే. కానీ కష్టం మీద ఫిట్‌నెస్‌ను, అభిమానుల ఆకాంక్షలను నిలబెడుతూ లీగ్‌లో కొనసాగుతూ వచ్చాడు. కానీ మోకాలి నొప్పి, వయసు రీత్యా మహి ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌తో పాటు మొత్తంగా క్రికెట్‌కు టాటా చెప్పేస్తాడన్న ఆంచనాలున్నాయి. ధోని కూడా ఈ దిశగా సంకేతాలు ఇవ్వడంతో ఈ సీజన్ అంతా తన రిటైర్మెంట్ గురించి చర్చ జరిగింది. కానీ మహి ఇంకో సీజన్ ఆడాలని అభిమానులతో పాటు చెన్నై ఫ్రాంఛైజీ కోరుకుంటోంది. మరి మహి మనసులో ఏముందో చూడాలి. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేట్లయితే మాత్రం మహిని చివరగా ఆటగాడిగా చూసేది ఆదివారమే.
ఆ ముగ్గురు × ఈ ముగ్గురు
ఈ సీజన్లో సమష్టిగా, నిలకడగా రాణిస్తున్న బ్యాటింగ్ విభాగం చెన్నైది అయితే.. బౌలింగ్‌లో అదే శైలిని అనుసరిస్తున్నది గుజరాత్. చెన్నై ఏ ఒక్కరి మీదో ఆధారపడలేదు. ఓపెనర్లు కాన్వే, రుతురాజ్ ఆ జట్టుకు అద్భుత ఆరంభాలనిస్తే.. రహానె కొన్ని మ్యాచ్‌ల్లో, శివమ్ దూబె మరి కొన్ని మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపించారు. రాయుడు, జడేజా, ధోని అప్పుడప్పుడూ కాస్త మెరిశారు. ప్రధానంగా బ్యాటింగ్‌లో చెన్నైకి కాన్వే, రుతురాజ్, దూబెలే బలంగా నిలిచారు. ఫైనల్ ముంగిట వీరి మీదే అందరి దృష్టీ నిలిచి ఉంది. అటు గుజరాత్ బౌలింగ్ విభాగంలో టోర్నీలోనే అత్యుత్తమంగా నిలుస్తోంది. టోర్నీలో టాప్-3 వికెట్ల వీరులు ఆ జట్టులోని షమి, రషీద్, మోహిత్‌లే. ఈ ముగ్గురూ ఒకరితో ఒకరు పోటీ పడి వికెట్లు పడగొడుతున్నారు. షమి ఆరంభంలో వికెట్లు తీసి ప్రత్యర్థులను దెబ్బ కొడుతుంటే.. మధ్య ఓవర్లలో రషీద్ చూసుకుంటున్నాడు. చివరి ఓవర్లలో మోహిత్ హవా సాగుతోంది. ముంబయితో క్వాలిఫయర్-2లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఆ జట్టులో నూర్ అహ్మద్, జోష్ లిటిల్ కూడా అవసరానికి బాగానే ఉపయోగపడుతున్నారు. ఫైనల్లో చెన్నై బ్యాటర్లకు, గుజరాత్ బౌలర్లకు ఆసక్తికర పోరు ఖాయం.
వాళ్లొకటి.. వీళ్లొకటి.. మరి ఇది?
ఈ సీజన్ ఆరంభ పోరులో తలపడ్డ చెన్నై, గుజరాత్‌లే ఫైనల్లోనూ తలపడుతుండటం విశేషం. అహ్మదాబాద్‌లో ఆరంభ పోరులో గుజరాత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే చెన్నైలో గుజరాత్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో సీఎస్‌కే 15 పరుగుల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు ఫైనల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. అహ్మదాబాద్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడటం చెన్నైకి ప్రతికూలాంశం.
చెన్నై: కాన్వే, రుతురాజ్, రహానె, దూబె, మొయిన్ అలీ, రాయుడు, జడేజా, ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తీక్షణ, తుషార్ దేశ్‌పాండే. గుజరాత్: శుభ్‌మన్, సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ (కెప్టెన్), విజయ్ శంకర్, మిల్లర్, తెవాతియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, షమి, మోహిత్ శర్మ.
ఇంపాక్ట్.. వీళ్లే
ఈ సీజన్లో ప్రవేశ పెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సౌలభ్యాన్ని గుజరాత్, చెన్నై జట్లు బాగానే ఉపయోగించుకున్నాయి. వేరే జట్లు అవసరాన్ని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లను మారుస్తున్నాయి కానీ.. కొన్ని మ్యాచ్‌లుగా ఈ రెండు జట్లు ఇద్దరినే ఉపయోగించుకున్నాయి. చెన్నై మొదట బ్యాటింగ్ చేస్తే దూబెను తుది జట్టులోకి తీసుకుని.. బౌలింగ్‌లో పతిరనను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకుంటోంది. మొదట బౌలింగ్ చేస్తే పతిరనను తుది జట్టులో ఆడించి.. తర్వాత దూబెను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంటోంది. గుజరాత్ శుభ్‌మన్, జోష్ లిటిల్‌లను ఇలాగే ఆడిస్తోంది. ఫైనల్లో కూడా రెండు జట్లూ ఇదే కొనసాగించవచ్చు.
విజేతకు రూ.20 కోట్లు
ఐపీఎల్- 16 విజేత జట్టు రూ.20 కోట్లు నగదు బహుమతిగా పొందనుంది. రన్నరప్ జట్టు రూ.13 కోట్లు ఖాతాలో వేసుకుంటుంది. ఈ సారి మొత్తం రూ.46.5 కోట్లను నగదు బహుమతిగా అందజేయనున్నారు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు వరుసగా రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు దక్కించుకుంటాయి. అత్యధిక పరుగులు చేసే బ్యాటర్‌కు, అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌కు రూ.15 లక్షల చొప్పున అందిస్తారు. టోర్నీ వర్థమాన ఆటగాడికి రూ.20 లక్షలు, అత్యంత విలువైన ఆటగాడికి రూ.12 లక్షలు ఇవ్వనున్నారు.
3
ఈ సీజన్లో టాప్-3 వికెట్ల వీరులు గుజరాత్ బౌలర్లే. షమి (28), రషీద్ (27), మోహిత్ (24) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. షమి మరో అయిదు వికెట్లు పడగొడితే.. ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో, హర్షల్ పటేల్ (32)ల పేరిట ఉమ్మడిగా ఉన్న రికార్డును బద్దలు కొడతాడు.
11
ధోని ఆడబోతున్న 11వ ఐపీఎల్ ఫైనల్ ఇది. మరే ఆటగాడూ ఇన్నిసార్లు తుది పోరులో పాల్గొనలేదు. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ ఇప్పటిదాకా అయిదు ఐపీఎల్ ఫైనల్స్ ఆడగా.. ఒక్కసారీ అతను ఓటమి వైపు నిలవలేదు.
123
ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులతో కోహ్లి (973) 2016లో నెలకొల్పిన రికార్డును అధిగమించడానికి గిల్‌కు అవసరమైన పరుగులు. అతను ప్రస్తుతం 16 మ్యాచ్‌ల్లో 851 పరుగులతో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
S Jaishankar: ఆయనో మోడ్రన్ ఆర్కిటెక్.. కేంద్ర మంత్రి జైశంకర్‌పై అమెరికా ప్రశంసలు
-
PM Modi: పసుపు రైతుల కోసం.. ఎంతవరకైనా వెళ్తాం: ప్రధాని మోదీ
-
Annamalai: మహిళా జర్నలిస్ట్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. వివాదంలో అన్నామలై
-
Narayana - CID: మాజీ మంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు
-
Chandrababu-TDP: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల దీక్ష
-
Kerala: కుండపోత వర్షంలో జీపీఎస్‌ను నమ్ముకొని.. ప్రాణాలు పోగొట్టుకొన్న యువ డాక్టర్లు