ఆ ఆలోచన గిల్‌క్రిస్ట్‌ది: గావస్కర్‌

మొత్తం మీద లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇప్పుడు ట్రోఫీపై కన్నేశాయి. రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్‌లో మంచి విజయాలతో ఫైనల్‌కు చేరుకున్నాయి.

Updated : 28 May 2023 03:12 IST

గావస్కర్‌: మొత్తం మీద లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇప్పుడు ట్రోఫీపై కన్నేశాయి. రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్‌లో మంచి విజయాలతో ఫైనల్‌కు చేరుకున్నాయి. క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్‌ నిర్వహించడం ద్వారా.. లీగ్‌ దశలో నంబర్‌వన్‌, నంబర్‌-2 జట్లకు అదనపు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచన గిల్‌క్రిస్ట్‌ది. అప్పుడు నేను ఐపీఎల్‌ పాలవకవర్గంలో ఉన్నా. పోటీని మరింత ఆసక్తిగా మలచడానికి ఏం చేయాలో సూచించాలంటూ ఫ్రాంఛైజీల కెప్టెన్లందరికీ లేఖలు రాశా. ఎనిమిది మందిలో అయిదుగురు జవాబిచ్చారు. అందులో గిల్‌క్రిస్ట్‌ చేసిన ప్రతిపాదనను అంగీకరించి, 2011 సీజన్‌ నుంచి అమలు చేశారు. అంతకన్నా ముందు రెండు సెమీఫైనల్స్‌, ఫైనల్‌ ఉండేవి. గిల్‌క్రిస్ట్‌ సూచనతో ప్రసారదారుకు అదనంగా మరో మ్యాచ్‌ కూడా లభించింది. ఆ విధానం ఫలాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. సీజన్‌లో అత్యుత్తమంగా ఆడిన టైటాన్స్‌కు.. ప్లేఆఫ్స్‌లో ఓడినా మరో అవకాశం లభించింది

ఇక ఈ ఐపీఎల్‌ చిరస్మరణీయమైంది. బంతితో, బ్యాటుతో ఎన్నో అద్భుత ప్రదర్శనలు చూశాం. ఫీల్డింగ్‌లోనూ ఎన్నో మెరుపులు. అద్భుతమైన శతకాలు, మ్యాచ్‌నే మలుపు తిప్పే అయిదు వికెట్ల ఘనతలు, కళ్లు చెదిరే క్యాచ్‌లు అభిమానులను అలరించాయి. ఖరీదైన ఆటగాళ్ల కన్నా అనామక దేశీ ఆటగాళ్లే ఐపీఎల్‌లో ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. ఖరీదైన ఆటగాళ్లు అప్పుడప్పుడు రాణిస్తున్నా.. కొద్ది మంది మాత్రమే జట్టుకు నిజంగా అవసరమైనప్పుడు ఆడుతున్నారు. బహుశా అంచనాల భారం వల్ల కావొచ్చు. వచ్చే వేలంలో ఫ్రాంఛైజీల జీతాల పరిమితి పెరుగుతుంది. కొందరికి కళ్లు చెదిరే ధర లభించడం చూస్తాం. వీళ్లను కంప్యూటర్‌ చూసే వాళ్లు ఇచ్చే సలహాలతో ఎంచుకుంటారు తప్ప.. క్రికెట్‌ తెలిసిన వాళ్ల సలహాల ఆధారంగా కాదు. కేవలం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసినవాళ్లనే కాదు.. రంజీల్లో రాణించిన వారినీ ఫ్రాంఛైజీలు పరిగణనలోకి తీసుకోవాలి. దేశవాళీ తెల్ల బంతి టోర్నీల్లో బాదేవాళ్ల కంటే రంజీ బ్యాటర్లు మెరుగైన ఆట కలిగి ఉంటారు. బాదేవాళ్లు చాలా వరకు చిన్న మైదానాల్లో ద్వితీయ శ్రేణి బౌలర్లను ఎదుర్కొంటుంటారు. కానీ ఐపీఎల్‌లో బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో చాలా నాణ్యత ఉంటుంది. వాళ్లు ఇబ్బందిపడతారు. సరైన నాణ్యత లేని పిచ్‌లపై వికెట్లు పడగొట్టిన బౌలర్ల పరిస్థితీ అంతే. ఈ నేపథ్యంలో సహాయ కోచ్‌గా దేశవాళీ క్రికెట్‌ చూసిన భారతీయుడు తమతో ఉన్న ఫ్రాంఛైజీ ఎంతో లాభపడుతుంది. దేశవాళీ క్రికెట్‌ చూడని విదేశీ కోచ్‌కు అతడు ఆటగాళ్లను ఎంచుకోవడంలో ఎంతో సహాయపడతాడు.

తాజా ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన నాలుగు జట్లకూ భారత ఆటగాళ్లే కెప్టెన్లు. ఒకవేళ తమకు విదేశీ కోచ్‌ ఉన్నా సరే... ఎంతో ఆత్మవిశ్వాసం గల ఈ కెప్టెన్లు టీమ్‌ సెలక్షన్‌, వ్యూహాలకు సంబంధించి తామే చాలా వరకు నిర్ణయాలు తీసుకున్నారు. నెహ్రా, హార్దిక్‌ రూపంలో గుజరాత్‌కు నిర్ణయాలు తీసుకునేవాళ్లుండడం వల్లే మోహిత్‌ శర్మ లాంటి ఆటగాడు ఇప్పటికీ జట్టుకు గొప్పగా ఉపయోగపడుతున్నాడు. ఇతర ఫ్రాంఛైజీలైతే అతణ్ని పరిగణనలోకి తీసుకునేవే కావు. ఏదేమైనా ఈ ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ అద్భుతం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని