ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్‌

ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. అటు అంతర్జాతీయ క్రికెట్లో, ఇటు ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే 16వ సీజన్‌లో మూడు శతకాలు సహా 851 పరుగులు చేసి ‘ఆరెంజ్‌ క్యాప్‌’ ఖాయం చేసుకున్నాడు.

Updated : 28 May 2023 03:12 IST

అహ్మదాబాద్‌: ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. అటు అంతర్జాతీయ క్రికెట్లో, ఇటు ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే 16వ సీజన్‌లో మూడు శతకాలు సహా 851 పరుగులు చేసి ‘ఆరెంజ్‌ క్యాప్‌’ ఖాయం చేసుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండో సారి ఫైనల్‌ చేరడంలో అతనిదే కీలక పాత్ర. క్వాలిఫయర్‌-2లో ముంబయిపై 60 బంతుల్లోనే 129 పరుగులు చేసిన గిల్‌.. టీ20 ప్రపంచకప్‌ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు తన ఆటలో టెక్నిక్‌ పరంగా కొన్ని మార్పులు, చిన్న సర్దుబాటు చేసుకోవడం కలిసొచ్చిందని వెల్లడించాడు. నిరుడు ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో గిల్‌కు జట్టులో చోటు దక్కలేదు. కానీ ఆ తర్వాత నుంచి అతని జోరు మామూలుగా సాగడం లేదు. ‘‘2022లో వెస్టిండీస్‌ పర్యటన నుంచి నేను గేరు మార్చానని అనుకుంటున్నా. గతేడాది ఐపీఎల్‌కు ముందు గాయపడ్డా. కానీ నా ఆటపై పనిచేస్తూనే ఉన్నా. టీ20 ప్రపంచకప్‌ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు టెక్నిక్‌లో కొన్ని మార్పులు చేసుకున్నా. క్వాలిఫయర్‌-2లో ముంబయిపై శతకమే ఇప్పటివరకూ ఐపీఎల్‌లో నా అత్యుత్తమ ఇన్నింగ్స్‌. అంచనాలను బయటే వదిలేసి మైదానంలో జట్టుకు తోడ్పాటు అందించేందుకే ప్రయత్నిస్తా. ఒక్కో బంతిని, ఒక్కో ఓవర్‌ను ఆడుతూ సాగుతా. ముంబయిపై ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు రాబట్టడంతో లయ దొరికింది. ఇది నా రోజని అప్పుడే అర్థమైంది. బ్యాటింగ్‌కు పిచ్‌ చక్కగా సహకరించింది. మంచి ఆరంభం లభిస్తే ఆత్మవిశ్వాసంతో పరుగులు సాధిస్తా’’ అని గిల్‌ చెప్పాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు