సింధు ఔట్‌

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు నిరాశ. ఈ రెండుసార్లు ఛాంపియన్‌ మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సెమీఫైనల్లోనే నిష్క్రమించింది.

Published : 28 May 2023 02:58 IST

మలేసియా మాస్టర్స్‌
ఫైనల్లో ప్రణయ్‌

కౌలాలంపూర్‌: భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు నిరాశ. ఈ రెండుసార్లు ఛాంపియన్‌ మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. శనివారం మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ఆరో సీడ్‌ సింధు 14-21, 17-21తో ఏడో సీడ్‌ మరిస్కా టాన్‌జంగ్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడింది. ఈ పోరులో తన శైలి దూకుడును ప్రదర్శించలేకపోయిన సింధు.. అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. కానీ తొలి గేమ్‌ ఆరంభంలో సింధు మెరుగ్గానే ఆడింది. 3-0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె.. విరామ సమయానికి 11-8తో నిలిచింది. బ్రేక్‌ తర్వాత సింధు తడబడింది. పదునైన రిటర్న్‌లతో విజృంభించిన టాన్‌జంగ్‌ 15-12తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాతా అదే జోరుతో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ కూడా హోరాహోరీగా సాగింది. స్కోరు 5-5తో ఉన్నప్పుడు మరిస్కా మోచేతికి గాయమైంది. అయితే ఇది ఆమె ఆటపై ప్రభావం చూపించలేకపోయింది. సింధు గట్టిగానే పోరాడినా బ్రేక్‌ సమయానికి మరిస్కా 11-9తో ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత కొన్ని మెరుపు షాట్లు ఆడిన భారత షట్లర్‌.. పుంజుకోవడానికి ప్రయత్నించింది. పట్టువదలని మరిస్కా ఆధిక్యాన్ని కాపాడుకోవడమే కాక గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. టాన్‌జంగ్‌పై గతంలో 7 మ్యాచ్‌లు నెగ్గిన సింధుకు ఇది వరుసగా రెండో ఓటమి. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్రిస్టియన్‌ అడింటా (ఇండోనేసియా)తో సెమీఫైనల్లో భారత స్టార్‌ తొలి గేమ్‌లో 19-17తో ఆధిక్యంలో ఉండగా.. ప్రత్యర్థి మోకాలి గాయంతో తప్పుకున్నాడు. ఒక షాట్‌ను ఎగిరి రిటర్న్‌ చేసే ప్రయత్నంలో క్రిస్టియన్‌ గాయపడి ఆటను కొనసాగించలేకపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని