ఇక ప్రతి రాష్ట్రంలో స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌లు

ఇటీవల కాలంలో భారత ఆటగాళ్లు తరచూ గాయపడుతున్న నేపథ్యంలో ఇకపై ప్రతి రాష్ట్రంలో స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌లు ఉండాలని బీసీసీఐ నిర్ణయించింది.

Published : 28 May 2023 02:50 IST

అహ్మదాబాద్‌: ఇటీవల కాలంలో భారత ఆటగాళ్లు తరచూ గాయపడుతున్న నేపథ్యంలో ఇకపై ప్రతి రాష్ట్రంలో స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌లు ఉండాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు కోచ్‌లతోపాటు స్పోర్ట్స్‌ సైన్స్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ బృందాలను నియమించుకోవాలని రాష్ట్ర సంఘాలను బోర్డు కోరనుంది. ‘‘ఆటగాళ్లు గాయపడుతున్న నేపథ్యంలో మేం ఒక వ్యవస్థను సృష్టించాం. దాని ప్రకారం ప్రతి రాష్ట్రం కూడా స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌.. స్పోర్ట్స్‌ సైన్స్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ బృందాలను నియమించుకోనుంది. అభ్యర్థులను జాతీయ క్రికెట్‌ అకాడమీ ఇంటర్వ్యూ చేస్తుంది’’ అని శనివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. భారత క్రికెటర్లు, ముఖ్యంగా బౌలర్లు ఇటీవల కాలంలో ఎక్కువగా గాయపడుతున్నారు. అందులో చాలా మంది నిరుడు జాతీయ క్రికెట్‌ అకాడమీలో గడిపారు.


హాకీ అమ్మాయిలు గెలుపుతో..

అడిలైడ్‌: ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల హాకీ జట్టు స్ఫూర్తిదాయక విజయంతో ముగించింది. శనివారం అయిదోది, ఆఖరిదైన మ్యాచ్‌లో సవిత బృందం 2-1 గోల్స్‌తో ఆస్ట్రేలియా-ఏను ఓడించింది. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్‌ (10వ నిమిషం), దీప్‌ గ్రేస్‌ (25వ ని) గోల్స్‌ నమోదు చేశారు.


జెహాన్‌కు రెండో స్థానం

మొనాకో: స్ప్రింట్‌ రేస్‌ ఫార్ములా-2 ఛాంపియన్‌షిప్‌లో భారత రేసర్‌ జెహాన్‌ దారువాలా రెండో స్థానంలో నిలిచాడు. డచ్‌ జట్టు ఎంపీ మోటర్‌ స్పోర్ట్‌ తరఫున బరిలో దిగిన జెహాన్‌... రేసులో చివరి వరకు గట్టిగా ప్రయత్నించినా అయుమూ ఇవాసా (జపాన్‌)ను అధిగమించలేకపోయాడు. మొనాకో ఛాంపియన్‌షిప్‌లో స్ప్రింట్‌ రేస్‌లో పోడియంపై నిలవడం జెహాన్‌కు ఇది రెండోసారి. గతేడాది ఈ భారత రేసర్‌ రెండో స్థానంలో నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని