IPL Final - CSK vs GT: ఓ వరుణా.. రేపు రా!

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఎన్నడూ చూడని చిత్రం! వర్షం వల్ల తొలిసారి ఐపీఎల్‌ ఫైనల్‌ వాయిదా పడింది. 16వ సీజన్‌ టైటిల్‌ కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడాల్సి ఉండగా.. భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తడంతో ఫైనల్‌ను వాయిదా వేయక తప్పలేదు. రిజర్వ్‌ డే అయిన సోమవారం

Updated : 29 May 2023 07:03 IST

వర్షం వల్ల ఐపీఎల్‌ ఫైనల్‌ నేటికి వాయిదా
ఈ రోజూ మ్యాచ్‌కు వాన ముప్పు

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఎన్నడూ చూడని చిత్రం! వర్షం వల్ల తొలిసారి ఐపీఎల్‌ ఫైనల్‌ వాయిదా పడింది. 16వ సీజన్‌ టైటిల్‌ కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడాల్సి ఉండగా.. భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తడంతో ఫైనల్‌ను వాయిదా వేయక తప్పలేదు. రిజర్వ్‌ డే అయిన సోమవారం మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.

అహ్మదాబాద్‌

శుభ్‌మన్‌ ఇంకో సెంచరీ కొట్టేస్తాడా.. షమి, రషీద్‌, మోహిత్‌ త్రయం మరోసారి విజృంభిస్తుందా.. గుజరాత్‌ వరుసగా రెండో ఏడాదీ విజేతగా నిలుస్తుందా..? చెన్నై ఓపెనింగ్‌ జోడీ జోరు కొనసాగిస్తుందా.. ధోనీని ఆటగాడిగా మైదానంలో చూసే చివరి రోజు ఇదేనా.. చెన్నై అయిదో కప్పు అందుకుంటుందా..? ఇలా ఎన్నెన్నో ఆశలు, అంచనాలతో ఆదివారం ఐపీఎల్‌ ఫైనల్‌ వీక్షించేందుకు సిద్ధమైన అభిమానులకు తీవ్ర నిరాశ! వేసవిలోనూ భారీ వర్షం అహ్మదాబాద్‌ను ముంచెత్తడంతో తొలిసారిగా ఐపీఎల్‌ ఫైనల్‌ వాయిదా పడింది. మ్యాచ్‌కు వర్షం ముప్పేమీ లేదని ముందు రోజు వాతావరణ శాఖ సంకేతాలు ఇచ్చినప్పటికీ.. అనుకోని అతిథిలా వచ్చిన వరుణుడు నరేంద్ర మోదీ స్టేడియంలో నీటి మడుగులు పడేలా ప్రతాపం చూపాడు. ఎంతకీ వర్షం విడవకపోవడం, ఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉండటంతో మ్యాచ్‌ను అంపైర్లు సోమవారానికి వాయిదా వేశారు. రాత్రి 7.30కి మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉండగా.. అంతకు గంట ముందే జల్లులు మొదలయ్యాయి. తర్వాత అది జోరు వర్షంగా మారింది. రెండున్నర గంటల పాటు విరామం లేకుండా వర్షం పడటంతో ఆదివారం మ్యాచ్‌ జరగడం కష్టమే అని అర్థమైంది. 9 గంటల ప్రాంతంలో వర్షం ఆగడంతో స్టేడియంలో ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఆశలు రేకెత్తాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న సూపర్‌ సాపర్లు పని మొదలుపెట్టాయి. కానీ పది నిమిషాల విరామం తర్వాత వరుణుడు తిరిగొచ్చాడు. మళ్లీ జోరు వర్షం స్టేడియాన్ని ముంచెత్తింది. అర్ధరాత్రి 12.06కి మైదానం సిద్ధమైతే 5 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ నిర్వహించే అవకాశముండగా.. స్టేడియంలో నీటి మడుగులు ఏర్పడటంతో గంట తర్వాత కూడా ఆట సాధ్యం కాదని తేలడంతో 11 గంటల ప్రాంతంలో మ్యాచ్‌ను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

రద్దయితే గుజరాత్‌కే ట్రోఫీ: ఆదివారం వర్ష సూచన లేకపోయినా.. మొతెరాను వరుణుడు ముంచెత్తగా, మరుసటి రోజు వర్షం పడేందుకు ఆస్కారం ఉండటం ఆందోళన రేకెత్తించేదే. సోమవారం 5 ఓవర్ల మ్యాచ్‌కూ పరిస్థితులు సహకరించకుంటే సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అదీ సాధ్యపడక మ్యాచ్‌ రద్దయితే మాత్రం గుజరాత్‌ టైటాన్స్‌నే ఐపీఎల్‌-16 ట్రోఫీ వరిస్తుంది. ఐపీఎల్‌ నియమావళి ప్రకారం ఫైనల్‌ వర్షం వల్ల రద్దయితే లీగ్‌ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. లీగ్‌ దశలో 20 పాయింట్లతో గుజరాత్‌ అగ్రస్థానంలో నిలవగా.. చెన్నై 17 పాయింట్లతో రెండో స్థానం సాధించింది. గత ఏడాదే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్‌.. తొలి సీజన్లోనే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సీఎస్కే 2010, 2011, 2018, 2021 సీజన్లలో టైటిల్‌ సాధించింది. ఆ జట్టు మరో ట్రోఫీ సాధిస్తే.. అత్యధికసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ను సమం చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని