యు టర్న్‌ లేదు.. రిటైర్మెంటే!

ఐపీఎల్‌లో అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో ఒకడైన అంబటి రాయుడు ఈ లీగ్‌కు గుడ్‌బై చెప్పేశాడు.

Published : 29 May 2023 02:30 IST

ఫైనల్‌తో ఐపీఎల్‌కు అంబటి వీడ్కోలు

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో ఒకడైన అంబటి రాయుడు ఈ లీగ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనలే తనకు చివరి మ్యాచ్‌ అని ఈ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు ఆదివారం ట్విటర్‌లో ప్రకటించాడు. ఈ నిర్ణయంపై ‘యు టర్న్‌’ తీసుకోనని స్పష్టం చేశాడు. ‘‘రెండు గొప్ప జట్లు ముంబయి ఇండియన్స్‌, సీఎస్కే.. 204 మ్యాచ్‌లు, 14 సీజన్లు, 11 ప్లేఆఫ్స్‌, 8 ఫైనల్స్‌, 5 ట్రోఫీలు, ఈ రోజు ఆరోది కావొచ్చు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ఫైనలే ఐపీఎల్‌లో నాకు చివరి మ్యాచ్‌. ఈ గొప్ప టోర్నీలో ఆడడాన్ని నిజంగా ఆస్వాదించా. అందరికీ ధన్యవాదాలు. ఇక యు టర్న్‌ ఉండదు’’ అని 37 ఏళ్ల రాయుడు ట్వీట్‌ చేశాడు. రాయుడు గతంలో రెండు సార్లు రిటైర్మెంట్‌ ప్రకటించి, ఆ తర్వాత మనసు మార్చుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంతో అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు వెల్లడించాడు. కానీ ఆ తర్వాత దేశవాళీ, ఐపీఎల్‌లో కొనసాగుతానని చెప్పాడు. ఇక 2022 సీజనే తనకు ఐపీఎల్‌లో చివరిదని తెలిపాడు. కానీ సీఎస్కే మేనేజ్‌మెంట్‌ జోక్యంతో మళ్లీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 2010-17 వరకు ముంబయికి ఆడిన రాయుడు.. ఆ జట్టు తరపున మూడు టైటిళ్లు (2013, 2015, 2017) గెలిచాడు. 2018 నుంచి సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తూ.. 2018, 2021లో విజేతగా నిలిచిన జట్టులో ఉన్నాడు. రోహిత్‌ (ఆరు) తర్వాత అత్యధిక ఐపీఎల్‌ టైటిళ్లు సొంతం చేసుకున్న ఆటగాడు రాయుడే. కానీ ఈ సీజన్‌లో మాత్రం ఫైనల్‌ ముందు వరకు 11 ఇన్నింగ్స్‌ల్లో 139 పరుగులే చేశాడు. శనివారం నాటికి రాయుడు ఐపీఎల్‌లో 203 మ్యాచ్‌లాడి 4329 పరుగులు చేశాడు. అందులో 22 అర్ధసెంచరీలు, ఓ శతకం ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు