ప్రణయ్‌ ఆరేళ్ల తర్వాత..

హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ సాధించాడు. ఆరేళ్లుగా టైటిల్‌ కరవుతో ఉన్న అతడు ఎట్టకేలకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ప్రపంచ టూర్‌ టైటిల్‌ను పట్టేశాడు.

Published : 29 May 2023 02:30 IST

సింగిల్స్‌ టైటిల్‌ సొంతం
ఖాతాలో మలేసియా మాస్టర్స్‌

కౌలాలంపూర్‌: హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ సాధించాడు. ఆరేళ్లుగా టైటిల్‌ కరవుతో ఉన్న అతడు ఎట్టకేలకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ప్రపంచ టూర్‌ టైటిల్‌ను పట్టేశాడు. మలేసియా మాస్టర్స్‌ సూపర్‌-500 టోర్నీలో అత్యుత్తమ ఆటతో అదరగొట్టిన భారత స్టార్‌ షట్లర్‌ విజేతగా నిలిచాడు. ఆదివారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రణయ్‌ 21-19, 13-21, 21-18తో వెంగ్‌హంగ్‌ యంగ్‌ (చైనా)ను ఓడించాడు. తొలి గేమ్‌ ఆరంభంలో వాంగ్‌ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లినా.. పుంజుకున్న ప్రణయ్‌ స్కోరు సమం చేశాడు. ఇద్దరూ తగ్గకపోవడంతో పోటీ హోరాహోరీగా సాగింది. కానీ విరామ సమయానికి ప్రణయ్‌ 11-10తో స్వల్ప ఆధిక్యంలో నిలిచాడు. బ్రేక్‌ తర్వాత కూడా భారత స్టార్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. స్కోరు 19-19తో సమంగా ఉన్నప్పుడు.. వరుసగా రెండు పాయింట్లు సాధించిన ప్రణయ్‌ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ ఆట నువ్వానేనా అన్నట్లే సాగింది. సుదీర్ఘ ర్యాలీలు నడిచాయి. అయితే ఒక దశలో విజృంభించిన యంగ్‌.. వరుస పాయింట్లతో 17-11తో ఆధిక్యం సాధించడమే కాక అదే ఊపులో గేమ్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. మూడో గేమ్‌ ఆరంభంలో వెనుకబడినా.. బ్రేక్‌ సమయానికి ప్రణయ్‌ 11-10తో ఆధిక్యం సాధించాడు. విరామం తర్వాత యంగ్‌ నుంచి పోటీ ఎదురైనా.. మెరుపు క్రాస్‌కోర్టు షాట్లు, స్మాష్‌లతో భారత షట్లర్‌ 20-18తో విజయానికి చేరువయ్యాడు. అదే జోరుతో మరో పాయింట్‌ గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. గతేడాది చరిత్రాత్మక థామస్‌కప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రణయ్‌కి 2017 యుఎస్‌ ఓపెన్‌ తర్వాత దక్కిన తొలి సింగిల్స్‌ విజయమిదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని