ఆసియాకప్‌పై తుది నిర్ణయం ఏసీసీ సమావేశంలో..

ఆసియాకప్‌ వేదికపై తుది నిర్ణయం ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఎగ్జి క్యూటివ్‌ బోర్డు సమావేశంలో తీసుకోనున్నారు.

Published : 29 May 2023 02:26 IST

దిల్లీ: ఆసియాకప్‌ వేదికపై తుది నిర్ణయం ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఎగ్జి క్యూటివ్‌ బోర్డు సమావేశంలో తీసుకోనున్నారు. తమ దేశంలో నాలుగు ప్రాథమిక రౌండ్‌ మ్యాచ్‌లు, నాలుగు సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లు నిర్వహించాలన్న పాకిస్థాన్‌ బోర్డు ప్రతిపాదనను బీసీసీఐ ఇప్పటికే తిరస్కరించింది. ఈ మేరకు ఏసీసీ ఛైర్మన్‌ జై షా తన వైఖరిని సభ్యదేశాల ప్రతినిధులకు అనధికారికంగా స్పష్టం చేసినట్లు సమాచారం. షా బీసీసీఐ కార్యదర్శి కూడా. పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్‌ తిరస్కరించిన నేపథ్యంలో టోర్నీ వేదికపై ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఏసీసీ బోర్డే. ‘‘శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లు తమ మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో ఆడేందుకు అభ్యంతరం లేదని ఇప్పటికే పీసీబీతో చెప్పాయి. కానీ హైబ్రిడ్‌ మోడల్‌కు భారత్‌ అంగీకరించట్లేదు. వేదికపై తుది నిర్ణయం ఇక ఏసీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో మాత్రమే తీసుకుంటారు’’ అని ఓ ఏసీసీ సభ్యుడు చెప్పాడు.


భారత్‌కు వాళ్లిద్దరే కీలకం: హసీ

దిల్లీ: ఆస్ట్రేలియాతో ఏప్రిల్‌ 7న ఓవల్‌లో ఆరంభమయ్యే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో విజయం సాధించాలంటే భారత్‌కు విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌శర్మ కీలకం కానున్నారని కంగారూ జట్టు మాజీ స్టార్‌ మైకేల్‌ హసీ అభిప్రాయపడ్డాడు. ‘‘ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌ తరఫున విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ కీలకం కానున్నారు. ఫామ్‌ అందుకున్న కోహ్లిని విస్మరించకూడదు. కానీ ఐపీఎల్‌ ఆడి వస్తున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. పేసర్లు కూడా ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాకు కమిన్స్‌ కీలకం కానున్నాడు. హేజిల్‌వుడ్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే ఆ జట్టు బలం ఇంకా పెరుగుతుంది. సిరాజ్‌, షమి, జడేజా, అశ్విన్‌ రూపంలో భారత్‌కు కూడా మంచి బౌలింగ్‌ దళం ఉంది. రెండు పటిష్టమైన జట్లే’’ అని హసీ చెప్పాడు.


పాక్‌తో భారత్‌ డ్రా

సలాలా: జూనియర్‌ పురుషుల ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ అజేయంగా కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన పూల్‌- ఎ మ్యాచ్‌ను భారత్‌ 1-1తో డ్రా చేసుకుంది. దాయాదితో పోరులో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన మన కుర్రాళ్లు.. పాక్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచిన శార్దానంద్‌ తివారి (24వ నిమిషంలో) భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. మూడో క్వార్టర్‌ నుంచి పాక్‌ కూడా ఎదురు దాడికి దిగింది. బషారత్‌ (44వ) ఫీల్డ్‌ గోల్‌తో ఆ జట్టు.. భారత్‌ను అందుకుంది.


వెర్‌స్టాపెన్‌ మొనాకో గ్రాండ్‌ ప్రి

మొనాకో: ఫార్ములావన్‌ ప్రపంచ ఛాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (నెదర్లాండ్స్‌) ఈ సీజన్‌లోనూ దూసుకెళ్తున్నాడు. ఆదివారం మొనాకో గ్రాండ్‌ ప్రి రేసులో ఈ రెడ్‌బుల్‌ రేసర్‌ విజేతగా నిలిచాడు. ఒక గంటా 48 నిమిషాల 51.980 సెకన్లలో రేసు ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మధ్యలో వర్షం వచ్చినా వెర్‌స్టాపెన్‌ వేగాన్ని కొనసాగించాడు. ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్‌ మార్టిన్‌), ఎస్తెబాన్‌ ఒకాన్‌ (ఆల్పిన్‌ రెనాల్ట్‌), హామిల్టన్‌ (మెర్సిడెజ్‌) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నారు. ఈ విజయంతో ఛాంపియన్‌షిప్‌ పట్టికలో తన ఆధిక్యాన్ని వెర్‌స్టాపెన్‌ మరింత పెంచుకున్నాడు. ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌ ప్రి రేసుల్లో గెలిచిన అతను.. ప్రస్తుతం 144 పాయింట్లతో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. పెరెజ్‌ (105) రెండో స్థానంలో ఉన్నాడు.


భారత్‌కు అయిదో స్థానం

అల్మాటీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచకప్‌ను భారత్‌ అయిదో స్థానంతో ముగించింది. ఈ టోర్నీలో మహిళల స్కీట్‌లో భారత్‌ రజత, కాంస్య పతకాలు సాధించింది. ఆదివారం, పోటీల చివరిరోజు ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు పతకం దక్కలేదు. పృథ్వీరాజ్‌-శ్రేయసి సింగ్‌ (136/150) అయిదో స్థానంలో మాత్రమే నిలవగలిగారు. మరో భారత జోడీ జొరావర్‌ సంధు-ప్రీతి రజక్‌ (134) ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ విభాగంలో కజకిస్థాన్‌ స్వర్ణం గెలవగా.. టర్కీ, ఇరాన్‌ రజత, కాంస్య పతకాలు సాధించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని