MS Dhoni: మహి మార్కు.. వారిని ఆడించి.. చెన్నైని ఛాంపియన్‌గా నిలిపి..
2018 ఐపీఎల్‌లో ఎక్కువగా వయసు మళ్లిన ఆటగాళ్లతో నిండిన చెన్నై జట్టును చూసి ‘డాడీస్ ఆర్మీ’ అంటూ ఎద్దేవా చేశారు జనాలు. చివరికి చూస్తే విజేత ఆ జట్టే.
2018 ఐపీఎల్‌లో ఎక్కువగా వయసు మళ్లిన ఆటగాళ్లతో నిండిన చెన్నై జట్టును చూసి ‘డాడీస్ ఆర్మీ’ అంటూ ఎద్దేవా చేశారు జనాలు. చివరికి చూస్తే విజేత ఆ జట్టే. 2020లో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో చెన్నై పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశను కింది నుంచి రెండో స్థానంతో ముగించింది. తర్వాతి ఏడాది ఆ జట్టుపై ఏమాత్రం అంచనాల్లేవు. చివరికి చూస్తే ఛాంపియన్ చెన్నై. ఇదంతా ధోని నాయకత్వ మహిమ అనడంలో సందేహం లేదు. ఈసారి కాగితం మీద చూస్తే సీఎస్కే జట్టు అంత గొప్పగా ఏమీ కనిపించలేదు. అయినా ఫైనల్ వరకు వచ్చిందన్నా అందులో ధోని పాత్ర కీలకం. ఇక మళ్లీ ఐపీఎల్‌లో కనిపించడనుకున్న రహానెని ధోని చెన్నై జట్టులోకి తీసుకుని స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పిస్తే.. అతను కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయాలందించాడు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో పెద్దగా ప్రభావం చూపని శివమ్ దూబె సైతం ఈసారి తనదైన ముద్ర వేశాడంటే అందులో ధోని పాత్ర కీలకం. మలింగను పోలిన బౌలింగ్ శైలిని కలిగిన పతిరనను సైతం మహి భలేగా ఉపయోగించుకున్నాడు. ప్రధాన బౌలింగ్ అస్త్రంగా మార్చాడు.
వేరే జట్లలో పెద్దగా ప్రభావం చూపని ఆటగాళ్లను ఇలా ప్రమాదకర ఆటగాళ్లుగా తీర్చిదిద్దడం ధోనీకే చెల్లు. చెన్నై జట్టంటేనే సమష్టితత్వానికి పెట్టింది పేరు. ఆటగాళ్లు స్వేచ్ఛగా, సహజ శైలిలో చెలరేగడానికి అవకాశం ఉంటుంది. ఆ జట్టులో అలాంటి వాతావరణం నెలకొనేలా చేయడంలో మహి పాత్ర కీలకం. నిజానికి ఫైనల్ మ్యాచ్‌లో ఒక దశ వరకు ధోనీకి ఏదీ కలిసి రాలేదు. ఐపీఎల్ తుది సమరాల్లో ఎక్కువగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచినప్పటికీ.. వర్షం ముప్పును దృష్టిలో ఉంచుకుని ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ గుజరాత్ పరిస్థితులను ఉపయోగించుకుని భారీ స్కోరు కొట్టింది. ఫైనల్లో 215 పరుగుల ఛేదన అంటే ఇక చెన్నై ఆశలు వదులుకోవాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ధోని ఊహించిందే నిజమైంది. వర్షం కారణంగా రెండున్నర గంటలకుపైగా మ్యాచ్ ఆగిపోవడంతో చెన్నై ముందు 171 పరుగుల లక్ష్యం (15 ఓవర్లలో) నిలిచింది. విరామ సమయంలో పక్కా ప్రణాళికతో సిద్ధమైంది సీఎస్కే. ఓపెనర్లు బరిలోకి దిగగానే టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో చెన్నై లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. అద్భుత విజయంతో అయిదో ట్రోఫీని ఒడిసిపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.