హార్దిక్‌ను ఎంపిక చేయాల్సింది

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను డబ్ల్యూటీసీ ఫైనల్లో పోటీపడే భారత జట్టుకు ఎంపిక చేయాల్సిందని ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 31 May 2023 02:40 IST

దుబాయ్‌: ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను డబ్ల్యూటీసీ ఫైనల్లో పోటీపడే భారత జట్టుకు ఎంపిక చేయాల్సిందని ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. అతడి ఆల్‌రౌండ్‌ సామర్థ్యం మ్యాచ్‌లో నిర్ణయాత్మక పాత్ర పోషించేదని అన్నాడు. హార్దిక్‌ 2018 నుంచి టెస్టు మ్యాచ్‌ ఆడలేదు. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా దీర్ఘ ఫార్మాట్‌కు దూరంగా ఉండాలని అతడు నిర్ణయించుకున్నాడు. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హార్దిక్‌ను ఎంపిక చేయాల్సింది. టెస్టు మ్యాచ్‌ ఆడడం తన శరీరానికి చాలా కష్టమని అతడే స్వయంగా చెప్పాడని నాకు తెలుసు. కానీ ఈ ఒక్క మ్యాచ్‌లో అతణ్ని ఆడించాల్సింది. ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ అతడు బౌలింగ్‌ చేశాడు. ఫాస్ట్‌గానూ వేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో హార్దిక్‌ చాలా కీలకమయ్యేవాడు. బ్యాట్‌తోనూ బంతితోనూ అతడు రాణించగలడు. రెండు జట్ల మధ్య ప్రధాన తేడా అతడే అయ్యేవాడు’’ అని పాంటింగ్‌ చెప్పాడు. 29 ఏళ్ల హార్దిక్‌ ఇప్పటివరకు 11 టెస్టులు మాత్రమే ఆడాడు. 2017లో టెస్టు అరంగేట్రం చేసిన అతడు.. 31.29 సగటుతో 532 పరుగులు చేశాడు. 11 వికెట్లు పడగొట్టాడు. 74 వన్డేల్లో 33 సగటుతో 1584 పరుగులు చేసి 32 వికెట్లు చేజిక్కించుకున్నాడు. 87 టీ20ల్లో 1271 పరుగులు సాధించాడు. 65 వికెట్లు పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని